ఆంధ్రప్రదేశ్లో కరోనా కట్టడికి జగన్ సర్కార్ స్పీడ్ పెంచింది. ఇప్పటికే గత ఏడాది కోవిడ్ సెంటర్లను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకుని రోగులకు ఉపశమనం కలిగించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తాజాగా మరికొన్ని చర్యల్ని ప్రభుత్వం చేపట్టింది. రేపటి నుంచి… రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకూ నైట్ కర్ఫ్యూ చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అలాగే 18-45 ఏళ్ల మధ్య వయసున్న వారికి ఉచితంగా వ్యాక్సినేషన్ వేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల ఏపీలో 2,04,70,364 మందికి లబ్ధి కలగనుంది.
మే 1 నుంచి దేశ వ్యాప్తంగా యువకులకు వ్యాక్సిన్ వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మరింత చొరవ చూపింది. ఉచితంగా వ్యాక్సిన్ వేయాలనే నిర్ణయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే పశ్చిమబెంగాల్లో తమను గెలిపిస్తే ఉచిత వ్యాక్సిన్ వేయిస్తామని కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ ప్రకటించింది.
మొన్న బిహార్ ఎన్నికల్లోనూ, ప్రస్తుతం పశ్చిమబెంగాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కరోనాను రాజకీయ స్వార్థానికి బీజేపీ వాడుకోవడంపై ప్రత్యర్థులు దుమ్మెత్తి పోస్తున్నారు. కానీ ఏపీ సర్కార్ మాత్రం ఎన్నికలు లేకపోయినా, మానవీయ కోణంలో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.