‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’.. ఈ వర్మని నమ్మేదెలా.!

'స్వర్గీయ నందమూరి తారకరామారారావు ఆత్మ నాతో మాట్లాడుతోంది..' అంటూ తాను తెరకెక్కించనున్న 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' గురించి గతంలోనే రామ్‌గోపాల్‌ వర్మ విపరీతమైన పబ్లిసిటీ స్టంట్లు చేశాడు. ఆ ఆత్మే, 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' కథ రాయిస్తోందన్నది…

'స్వర్గీయ నందమూరి తారకరామారారావు ఆత్మ నాతో మాట్లాడుతోంది..' అంటూ తాను తెరకెక్కించనున్న 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' గురించి గతంలోనే రామ్‌గోపాల్‌ వర్మ విపరీతమైన పబ్లిసిటీ స్టంట్లు చేశాడు. ఆ ఆత్మే, 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' కథ రాయిస్తోందన్నది వర్మగారి ఉవాచ. ఇంకా, ఆ ఆత్మ వర్మతో ఇంకా కలసి ప్రయాణిస్తోందా.? అంటే, వర్మ మాటల్లో 'ఔను' అనే సమాధానం చెప్పాలి. 

ఓ పక్క స్వర్గీయ ఎన్టీఆర్‌ తనయుడు నందమూరి బాలకృష్ణ 'ఎన్‌టిఆర్‌ కథానాయకుడు', 'ఎన్‌టిఆర్‌ మహానాయకుడు' పేర్లతో క్రిష్‌ దర్శకత్వంలో ఎన్‌టిఆర్‌ బయోపిక్‌ని రూపొందిస్తోంటే, ఇంకోపక్క రామ్‌గోపాల్‌ వర్మ 'నిజాల నిగ్గు తేల్చుతా' అంటున్నాడు 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌'తో. వర్మని నమ్మేదెలా.? ఎప్పుడో చాన్నాళ్ళ క్రితమే 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమాని ప్రకటించిన వర్మ, ఇప్పుడు తాజాగా ఈ సినిమాని పట్టాలెక్కిస్తున్నట్లు ఇంకోసారి ప్రకటించి, ఇందుకోసం వర్మ ఎన్నడూ లేని విధంగా 'భక్తుడి' అవతారమెత్తిన దరిమిలా.. ఈ అంశానికి పబ్లిసిటీ బాగానే లభిస్తోంది. 

పబ్లిసిటీ స్టంట్లు చేయడంలో వర్మ తర్వాతే ఎవరైనా. ఈ విషయం అందరికీ తెలుసు. తిరుపతి, కాణిపాకం వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి మరీ, దేవుడి ఆశీస్సుల్ని పొందాడు వర్మ. చిత్రమేంటంటే, నిన్న మొన్నటిదాకా 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమాపై అభ్యంతరావు వ్యక్తం చేసిన లక్ష్మీ పార్వతి, ఇప్పుడు వర్మ వెనుకాలే వుండి.. సినిమాపై పూర్తి సంతృప్తిని వ్యక్తం చేయడం. 

'వంగవీటి', 'ఆఫీసర్‌' తదితర సినిమాలతో వర్మ ట్రాక్‌ రికార్డ్‌ ఇటీవలి కాలంలో ఎంత గొప్పగా వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయా సినిమాల నిర్మాణంలో వర్మ చేసే పబ్లిసిటీ స్టంట్లు పీక్స్‌లో వుంటే.. రిలీజయ్యాక సినిమా రిజల్ట్‌లు పాతాళంలోకి పడిపోతుంటాయి. మరి, 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' విషయంలో వర్మని నమ్మేదెలా.? వర్మ భక్తిని నమ్మేదెలా.? 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమాతో ఎన్టీఆర్‌ ఆత్మ సంతోషిస్తుందా.? మరింత క్షోభిస్తుందా.? వేచి చూడాల్సిందే.