టీఆర్ఎస్ లో పెద్ద నాయకులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. మొన్నటికిమొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఫామ్ హౌజ్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ తనయుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కూడా కరోనా బారిన పడ్డారు.
“నాకు కూడా కరోనా సోకింది. ఓ మోస్తరు లక్షణాలున్నాయి. ప్రస్తుతం ఇంట్లోనే ఐసొలేషన్ లో ఉన్నాను. ఈమధ్యకాలంలో నాతో టచ్ లోకి వచ్చిన వాళ్లంతా కొవిడ్ ప్రొటోకాల్ పాటించాలి. విధిగా పరీక్షలు చేసుకోవాలి.” ఇలా తనకు కరోనా సోకిన విషయాన్ని కేటీఆర్ స్వయంగా వెల్లడించారు.
వైరస్ బారిన పడిన కేసీఆర్ ఫామ్ హౌజ్ కే పరిమితం కావడంతో, కేటీఆర్ కు బాధ్యతలు పెరిగాయి. ఇటు ప్రభుత్వం కార్యకలాపాలతో పాటు అటు పార్టీ వ్యవహారాల్ని కూడా తనే చూసుకోవడం మొదలుపెట్టారు.
మరోవైపు తండ్రి ఆరోగ్యంపై కూడా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునేవారు. ఈ క్రమంలో కేటీఆర్ కూడా వైరస్ బారిన పడ్డంతో పార్టీలో ఓ రకమైన ఆందోళన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం విషయానికొస్తే, ఆయనకు ఎలాంటి సమస్యలు లేవని వైద్యులు ప్రకటించారు.
కేవలం విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందన్నారు. ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో కేసీఆర్ కు అన్ని రకాల టెస్టులు చేశారు. ఆ రిపోర్టులు నిన్న వచ్చాయి. అవన్నీ నార్మల్ గానే ఉన్నాయి. ముఖ్యమంత్రికి ఎలాంటి ఇన్ఫెక్షన్లు లేవని, బ్లడ్ శాంపిల్స్ కూడా నార్మల్ గానే ఉన్నాయని వైద్యులు ప్రకటించారు.