నిర్మాతల మండలి షరతులు బన్నీకి వర్తించవా!

టాలీవుడ్ లో విధించే నిబంధనలు/షరతులు కొందరికి మాత్రమే అనే విషయం అందరికీ తెలిసిందే. నిర్మాతల మండలి లేదా ఫిలింఛాంబర్ ఆదేశాల్ని పాటించేది అతితక్కువ మంది. ఎవరి దారి వారిది.  Advertisement డిజిటల్ స్ట్రీమింగ్ కు…

టాలీవుడ్ లో విధించే నిబంధనలు/షరతులు కొందరికి మాత్రమే అనే విషయం అందరికీ తెలిసిందే. నిర్మాతల మండలి లేదా ఫిలింఛాంబర్ ఆదేశాల్ని పాటించేది అతితక్కువ మంది. ఎవరి దారి వారిది. 

డిజిటల్ స్ట్రీమింగ్ కు సంబంధించి నిర్మాతల మండలి తీసుకున్న 8 వారాల లాక్-ఇన్ పీరియడ్ నిబంధన ఎలా గాల్లో కలిసిపోయిందో అందరం చూస్తూనే ఉన్నాం. ఎవరికి నచ్చినట్టు వాళ్లు థియేట్రికల్ రిలీజ్ తో సంబంధం లేకుండా తమ సినిమాల్ని డిజిటల్ స్ట్రీమింగ్ కు ఇచ్చేస్తున్నారు.

ఇప్పుడు అలాంటిదే మరో నిబంధనను టాలీవుడ్ హీరోలు తుంగలో తొక్కుతున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్లు వ్యవహరిస్తున్నారు. మరీముఖ్యంగా అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరో ఈ నిబంధనను అస్సలు పట్టించుకోవడం లేదు.

మండలి ఏం చెప్పింది.. బన్నీ ఏం చేస్తున్నాడు

తెలంగాణలో, మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో పెరిగిపోతున్న కరోనా కేసుల్ని దృష్టిలో పెట్టుకొని షూటింగ్స్ కు సంబంధించి కొత్త నియమావళిని ప్రవేశపెట్టింది నిర్మాతల మండలి. వీలైతే షూటింగ్స్ వాయిదా వేసుకోమని, కుదరని పక్షంలో 50 మంది సిబ్బందికి మించకుండా షూటింగ్ జరుపుకోవాలని సూచించింది. కానీ పుష్ప షూటింగ్ మాత్రం భారీ యూనిట్ తో యదేచ్ఛగా కొనసాగుతోంది.

మొన్నటికిమొన్న యూసఫ్ గూడలోని ఓ కల్యాణమండపంలో పుష్ప సినిమాను షూట్ చేశారు. 2 రోజుల పాటు జరిగిన ఆ షూటింగ్ లో అటుఇటుగా 150 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఆ తర్వాత టోలీచౌకీలో మరికొన్ని సన్నివేశాలు తీశారు. ఈసారి ఫైట్ సీక్వెన్స్. యూనిట్ తో పాటు ఫైటర్స్ బృందం కూడా కలిపి దాదాపు 2వందల మంది వరకు ఉన్నట్టు సమాచారం. లీకైన స్టిల్స్ లోనే అటుఇటుగా 30-40 మందికి పైగా కనిపిస్తున్నారు.

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమాకు సంబంధించి తాజాగా మలయాళ నటుడు ఫహాజ్ ఫాజిల్ సెట్స్ పైకి వచ్చాడు. ఆ తర్వాత మరో కీలక పాత్రధారి అనసూయ కూడా సెట్స్ పైకి వచ్చింది. వీళ్లతో బన్నీ కాంబినేషన్ లో కొన్ని సన్నివేశాలు తీశారు. ఈ షూటింగ్ మొత్తం దాదాపు 150 నుంచి 200 మంది సిబ్బందితో జరిగినట్టు తెలుస్తోంది. నిజానికి పెద్ద సినిమాకు అంతమంది లేకపోతే షూటింగ్ జరగదు కూడా.

కరోనాతో ఇప్పటికే టాలీవుడ్ సతమతమౌతోంది. ఎంతోమందికి వైరస్ సోకింది. ఏకంగా మహేష్, ప్రభాస్, రామ్ చరణ్ లాంటి హీరోలు తమ సినిమాల్ని పక్కనపెట్టి హోం ఐసొలేషన్ లోకి వెళ్లిపోయారు. ఇలాంటి టైమ్ లో జాగ్రత్తగా ఉంటూ, నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన అల్లు అర్జున్.. ఇలా వంద మందికి పైగా సిబ్బందితో షూటింగ్ చేయడం కరెక్ట్ కాదు.