దసరా సందర్భంగా ఈరోజు పొద్దున్నే ఓ పోస్ట్ పెట్టాడు ప్రభాస్. అందరికీ దసరా శుభాకాంక్షలు చెబుతూనే, 23న అందరితో ఓ ప్రత్యేకమైన వార్తను షేర్ చేసుకుంటానని రాసుకొచ్చాడు. అయితే తన పోస్ట్ లో ఎక్కడా సినిమా పేరును ప్రస్తావించలేదు ప్రభాస్. దీంతో ప్రభాస్ చెప్పబోయే మేటర్ పై ఫ్యాన్స్ 2 గ్రూపులుగా విడిపోయి చర్చించుకోవడం మొదలుపెట్టారు.
ప్రస్తుతం సాహో సినిమా చేస్తున్నాడు ప్రభాస్. కాబట్టి 23న తన పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమాకు సంబంధించి ఓ వీడియో విడుదల చేస్తాడంటూ ఓ గ్రూప్ వాదిస్తుంటే.. 39 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న ప్రభాస్ తన పెళ్లి కబురు కూడా చెప్పే ఛాన్స్ ఉందంటూ మరో గ్రూప్ కొత్త లాజిక్ తీసింది.
నిజమే.. ఈ ఏడాదిలోనే ప్రభాస్ పెళ్లి కబురు చెప్పే ఛాన్స్ ఉంది. పెళ్లి వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేసినా, ఆ మేటర్ ను మాత్రం ఈ ఏడాది రివీల్ చేసే ఛాన్స్ ఉందంటూ కృష్ణంరాజు ఇప్పటికే లీకులు వదిలారు. ఈ నేపథ్యంలో.. ప్రభాస్ చెబుతానంటున్న ఆ ప్రత్యేకమైన వార్త పెళ్లికి సంబంధించినదే కావొచ్చంటున్నారు చాలామంది.
మరోవైపు ప్రభాస్-అనుష్క వ్యవహారంపై మరోసారి పుకార్లు గుప్పుమన్నాయి. తామిద్దరి మధ్య ఏం లేదని, బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనంటూ వీళ్లిద్దరూ గతంలోనే స్పష్టత ఇచ్చినప్పటికీ గాసిప్స్ మాత్రం ఆగలేదు. కేవలం ప్రభాస్ ను కలిసేందుకే అనుష్క ఈమధ్య ఇటలీ కూడా వెళ్లిందంటూ కథనాలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో.. పుట్టినరోజు నాడు ఓ స్పెషల్ మేటర్ చెబుతానంటూ ప్రభాస్ ఊరించడం ఆసక్తికరంగా మారింది.