Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: హలో గురు ప్రేమకోసమే...

సినిమా రివ్యూ: హలో గురు ప్రేమకోసమే...

రివ్యూ: హలో గురు ప్రేమకోసమే...
రేటింగ్‌: 2.75/5
బ్యానర్‌: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌
తారాగణం: రామ్‌, ప్రకాష్‌రాజ్‌, అనుపమ పరమేశ్వరన్‌, ప్రణీత, సితార, ఆమని, ప్రవీణ్‌, పోసాని కృష్ణమురళి, సత్య తదితరులు
కథ, మాటలు: బెజవాడ ప్రసన్న కుమార్‌
కథనం: ప్రసన్న కుమార్‌, త్రినాధరావు
సంగీతం: దేవిశ్రీప్రసాద్‌
కూర్పు: కార్తీక శ్రీనివాస్‌
ఛాయాగ్రహణం: విజయ్‌ కె. చక్రవర్తి
నిర్మాతలు: శిరీష్‌-లక్ష్మణ్‌
సమర్పణ: దిల్‌ రాజు
దర్శకత్వం: త్రినాధరావు నక్కిన
విడుదల తేదీ: అక్టోబర్‌ 18, 2018

కాబోయే మామని రకరకాలుగా వేధించే 'లవర్‌'ని తన గత రెండు చిత్రాల్లో చూపించిన దర్శకుడు త్రినాధరావు ఈసారి కూడా కాబోయే మామా అల్లుళ్ళ చుట్టే ఈ కథని కూడా నడిపించాడు. అయితే 'సినిమా చూపిస్త మావ', 'నేను లోకల్‌' మాదిరిగా ఈసారి అల్లుడు మరీ అల్లరి చిల్లరగా తిరిగే వాడు కాదు. అలాగే మామని వేధించడం కాకుండా స్నేహం పేరిట లాక్‌ చేసేస్తాడు. ఈ పాయింట్‌కి షిఫ్ట్‌ అయ్యే ముందు ఒక చిన్న పిట్ట ప్రేమకథ ఒకటి వుంటుంది. చిత్రంగా... అసలు కథ కంటే ఆ కొసరు కథే అలరిస్తుంది.

బలాదూర్‌గా తిరిగే హీరో (రామ్‌) ఉద్యోగం కోసం హైదరాబాద్‌కి వెళ్లి అక్కడ తన తల్లి స్నేహితుడి (ప్రకాష్‌రాజ్‌) ఇంట్లో వుంటాడు. అతని కూతురని తెలియక ఒకమ్మాయిని (అనుపమ) రైల్లో టీజ్‌ చేస్తాడు. ఆఫీస్‌కి చేరగానే అందమైన అమ్మాయిని (ప్రణీత) వెతుక్కుని ప్రేమలో పడిపోతాడు. కానీ తనకి తెలియకుండానే రైల్లోనే ప్రేమలో పడిపోయిన సంగతి రియలైజ్‌ అవుతాడు. ఆ సంగతి ఆమెకి చెప్పేలోగా ఆమె పెళ్లి వేరే వారితో ఖాయం చేసేస్తాడు ఆమె తండ్రి.

అప్పుడు తన కూతుర్ని ప్రేమిస్తోన్న సంగతి అతనికే చెప్పి నెల రోజులు తనతో స్నేహం చేస్తే తను ఎంత బెస్ట్‌ అనేది తెలుసుకుంటావని అతనితో అంటాడు. అలా మొదలైన 'స్నేహం' అతడి ప్రేమని సక్సెస్‌ చేస్తుందా? ఈ క్వశ్చన్‌కి ఆన్సర్‌ ఒక పది తెలుగు సినిమాలు చూసిన అనుభవం వున్న ఎవరైనా చెప్పేస్తారు. మరి ఇంత రొటీన్‌ కాన్‌ఫ్లిక్ట్‌ మీద ఈ స్క్రిప్ట్‌ నిలబెట్టాలని చూసిన దర్శక-రచయితలునా ప్రయత్నంలో సక్సెస్‌ అయ్యారా? కాన్‌ఫ్లిక్ట్‌ బలంగా లేనపుడు కామెడీపై డిపెండ్‌ అవడం తెలివైన తెలుగు సినిమా దర్శకుల లక్షణం.

ఇది తనకి పుష్కలం అని త్రినాధరావు ఇంతకుముందే నిరూపించుకున్నాడు. ఈ చిత్రాన్ని కూడా సన్నివేశ బలంతో పని లేకుండా, కథాగమనం గురించి ఆలోచించనివ్వకుండా కాసేపు డుపుబ్బ నవ్వించే కామెడీతో నడిపించాడు. అసలమ్మాయితో ప్రేమలో పడే ముందు కొసరమ్మాయితో రామ్‌ నడిపించే లవ్‌స్టోరీ చాలా ఫన్నీగా సాగుతుంది. ఇంగ్లీష్‌ 'మీడియం'గా వచ్చిన కాకినాడకి చెందిన 'ఇంగ్లీష్‌ మీడియం' అబ్బాయి సాఫ్ట్‌వేర్‌ ఆఫీస్‌లో మొదటి రోజు ఎంత వినోదం పండిస్తాడో, పర్సులో సరిపడా క్యాష్‌ లేకుండా అమ్మాయితో కాఫీ షాప్‌కి వెళితే ఎంతగా ఇబ్బంది పడతాడో లాంటి సుదీర్ఘమైన, అలరించే సన్నివేశాలతో మరోసారి త్రినాధరావు ఫుల్‌ ఫామ్‌లోనే వున్నాడనిపిస్తాడు.

అక్కడితో ఆగకుండా ఇంగ్లీష్‌ అర్థంకాక తనని, తనతో పాటు ప్రేమిస్తున్న అమ్మాయిని కూడా ఒక ఇబ్బందికర సిట్యువేషన్‌లో పడేసే సన్నివేశంలో సురేష్‌, ప్రకాష్‌రాజ్‌తో సహా అందరూ భలేగా నవ్విస్తారు. సీన్‌ తర్వాత సీన్‌గా మరింతగా నవ్విస్తూ, ఇంకా ఇంకా బెటర్‌ అవుతూ వుంటే తదుపరి రాబోయే హాస్యంపై అంచనాలు పెరిగిపోతుంటాయి. అయితే మధ్యలో ప్రవీణ్‌ పాత్ర పరిచయంలో చేసిన 'ప్రేమించుకుందాం రా', 'ప్రేమిస్తే' పేరడీలో పేలకుండా పోయిన కామెడీ మరుగున పడిపోతుంది. కానీ ఒక్కసారి ప్రణీత ట్రాక్‌కి ఎండ్‌ కార్డ్‌ పడిపోయిన తర్వాత వచ్చేదంతా అత్తెసరు కామెడీనే అనేది మెల్లమెల్లగా బోధపడుతుంది.

హీరోయిన్‌ తండ్రిని మాటకోసారి 'మాట మీద నిలబడే మనిషి' అని రుద్దుతూ పోతుంటే ద్వితియార్థం అంతా 'ఆ మాట మీదే నిలబెట్టాలని' చూస్తున్నారనే సంగతి అప్పుడు అర్థం కాకపోయినా, సెకండ్‌ హాఫ్‌ స్టార్ట్‌ అయిన కాసేపటికే పిక్చర్‌ క్లియర్‌ అయిపోతుంది. స్నేహితుడిగా వుండమని మాట తీసుకుని ఆయన ఎదురుగానే కూతురుని ముగ్గులోకి దించడానికి హీరో చేసే ప్రయత్నాలతోనే ద్వితియార్థం గడిచిపోతుంది. లాజిక్‌ అస్సలు లేని ఈ స్క్రీన్‌ప్లే లాక్‌ని ఓవర్‌ లుక్‌ చేసేసినా కానీ దానిని రసవత్తరంగా నడిపించడంలో మాత్రం దర్శకుడు, రచయిత విఫలమయ్యారు.

రెండు, మూడు సీన్లు లూప్‌లో వేసి అవే మళ్లీ మళ్లీ తిప్పి చూపిస్తూ వినోదానికి చేతులారా చరమగీతం పాడేసారు. ప్రథమార్ధంలో పండించిన కామెడీని ద్వితియార్ధంలో కూడా వుండేట్టు చూసుకున్నట్టయితే స్టోరీ, స్క్రీన్‌ప్లే లాంటి వాటి గురించి చర్చించుకోవాల్సిన పని లేకుండా ఈ ప్రేమ పాస్‌ అయిపోయేది. కానీ మరోసారి దర్శకుడు త్రినాధరావు 'మామ-అల్లుళ్ల' ఛట్రంలో పడి చివరకు కథానాయికని కూడా సైడ్‌ ట్రాక్‌ చేసేయడంతో పతాక సన్నివేశానికి ముందు హడావిడిగా ప్రేమని కన్ఫెస్‌ చేయడానికి మినహా ఆమెకి పెద్దగా పని పడలేదు.

పోనీ ద్వితియార్థంలో హాస్యానికి స్కోప్‌ లేదా అంటే... కావాల్సినంత గ్యాప్‌ వుంది కానీ హాఫ్‌ బేక్డ్‌ సీన్ల వల్ల అదేమీ పండలేదు. చివరకు ఏమి జరుగుతుందో, ఎలా జరుగుతుందో కూడా అర్థమైపోతున్న కథని కాపాడాల్సినవి రెండే ఎలిమెంట్లు. ఒకటి పొట్ట చెక్కలయ్యే కామెడీ కాగా, మరొకటి వీనులవిందైన మ్యూజిక్కు. దురదృష్టవశాత్తూ సెకండ్‌ హాఫ్‌లో సరిపడా కామెడీ లేదు, దేవిశ్రీప్రసాద్‌ మ్యూజిక్‌ కనీసం ఫస్ట్‌ హాఫ్‌లోను మ్యాజిక్‌ చేయలేదు. ఎక్కడో వినేసినట్టున్న పాటలే అన్నీను. నేపథ్య సంగీతం కూడా అన్యమనస్కంగా 'మమ' అనిపించినట్టే అనిపిస్తే అది మన తప్పుకాదు.

రామ్‌కి ఇలాంటి పాత్రలు కొత్త కాదు. ప్రకాష్‌రాజ్‌ చేయని పాత్ర లేదు. ఇద్దరి మధ్య కుదిరిన కెమిస్ట్రీ మెప్పించగా, అనుపమ ఎక్కువగా బ్యాక్‌గ్రౌండ్‌కే పరిమితమైంది. మిగిలిన వారిలో చాలా మందివి 'కరివేపాకు' తరహా పాత్రలే తప్ప గుర్తుండే లక్షణాలు, అభినయాలు లేవు. ముందే చెప్పినట్టు పాటలు ఆకట్టుకోలేదు. కానీ ప్రసన్నకుమార్‌ మాటలు కొన్ని బాగానే మెప్పించాయి. హాస్యాన్ని సృష్టించే అతని ప్రతిభ కూడా మెచ్చుకోతగినదే కానీ అది కొలత వేసినట్టు కాకుండా సినిమా అంతటా వుండేట్టు చూసుకుంటే మంచిది.

దర్శకుడు త్రినాధరావు వినోదాన్ని బాగా పండిస్తుంటాడు కానీ ద్వితియార్ధంలో ఇబ్బంది పడుతుంటాడు. గత రెండు చిత్రాల మాట ఎలా వున్నా ఈ చిత్రం ఒకే చోట తచ్చాడుతోన్న సంగతిని గుర్తించి ముందుగా సరిచేసుకోకపోవడం వల్ల, కాసింత కామెడీ జోడించి... రిపీట్‌ సీన్లు తగ్గించి, ఎమోషన్లు కనెక్ట్‌ అయ్యే విధంగా సీన్లు బలంగా రాసుకుని వుంటే గట్టెక్కేసేవాడు.

మొత్తమ్మీద ఒక సగటు సినిమా అని మాత్రమే అనిపించుకునే ఈ హలోగురు ప్రేమకోసమే... ప్రథమార్ధంలోని హాస్యం వల్ల ఒక మాదిరి ఫలితాన్ని సాధించవచ్చు. ఓవరాల్‌గా కాలక్షేపానికి పనికి వస్తుంది కానీ సంతృప్తినిచ్చి పంపించేంత స్టఫ్‌ లేదు.

బాటమ్‌ లైన్‌: హలో గురు 'మామ' కోసమే!
- గణేష్‌ రావూరి

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?