రామ్ చరణ్-బోయపాటి కాంబినేషన్ లో ముస్తాబవుతోంది వినయ విధేయరామ. ఈ సినిమా విడుదల డేట్ జనవరి 11. అయితే ఇప్పటికి ఇంకా మరో ముఫైరోజులు షూటింగ్ బకాయి వుందని తెలుస్తోంది. ఓ విధంగా వినయ విధేయ కొత్త రికార్డులు సృష్టిస్తోంది.
ఇప్పటికి నూట అయిదురోజుల వరకు షూటింగ్ జరిగింది. ఇంకా ముఫైరోజులు షూటింగ్ వుంది. హీరో కారణంగా క్యాన్సిల్ అయిన షూటింగ్ డేస్ వుండనే వున్నాయి. ఓ సోలో హీరో సినిమా ఇన్నాళ్లు చెక్కడం అది కూడా బ్యాంకాక్ నుంచి విశాఖ దాకా డైరక్టర్ సెంటిమెంట్ లొకేషన్లు అన్నీ టచ్ చేసుకుంటూ వస్తున్నారు. అయినా ఇంకా మరో ముఫైరోజులు వుంది.
ఇదిలా వుంటే సినిమా ఖర్చు ఆకాశాన్ని అంటేస్తోందని తెలుస్తోంది. బోయపాటి పెట్టిస్తున్న ఖర్చు వందకోట్లు దాటి మరో పాతిక వరకు డేకేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి సీన్ కు భారీ.. భారీ.. భారీ అన్నదే బోర్డర్ లైన్ అన్నట్లుగా ఫిక్సయి షూటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో నిర్మాత దానయ్య కక్కలేక మింగలేక మౌనం వహించినట్లు తెలుస్తోంది.
సినిమాకు అన్ని విధాలా రాబడి (72 కోట్లు తెలుగు రాష్ట్రాలు, 8 కోట్లకుపైగా ఓవర్ సీస్) 130 కోట్ల వరకు వుంటుంది. కానీ ఖర్చు కూడా అంతకు అంతా చేయించేసినట్లు తెలుస్తోంది. నిజానికి బోయపాటి గతంలో కూడా ఇదే చేసారు. జయ జానకీనాయక సినిమాకు కూడా అలవి మించి ఖర్చుచేయించేసారని విమర్శలు వున్నాయి. ఆఖరికి ఆ నిర్మాతకు నష్టాలే మిగిలాయి.
ఇప్పుడు ఈ సినిమాకూ బోయపాటి అదే చేస్తున్నారు. ఇప్పటి వరకు సరైనోడు తప్పిస్తే లాభాలు ఇచ్చిన బోయపాటి సినిమా లేదు. మరి ఈసినిమా నిర్మాత దానయ్య పరిస్థితి ఏమిటో?