అనూహ్యంగా చేతులు మారిన మహేష్ ‘మహర్షి’

మహేష్ నటిస్తున్న ప్రతిష్టాత్మక 25వ చిత్రం మహర్షి. ప్రారంభం నుంచి ఈ సినిమా తెరవెనక ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. తొలుత నిర్మాతల విషయంలో గందరగోళం సృష్టించిన ఈ సినిమా, ఆ తర్వాత శాటిలైట్ రైట్స్…

మహేష్ నటిస్తున్న ప్రతిష్టాత్మక 25వ చిత్రం మహర్షి. ప్రారంభం నుంచి ఈ సినిమా తెరవెనక ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. తొలుత నిర్మాతల విషయంలో గందరగోళం సృష్టించిన ఈ సినిమా, ఆ తర్వాత శాటిలైట్ రైట్స్ విషయంలో అయోమయానికి గురిచేసింది. 2 ఎంటర్ టైన్ మెంట్ ఛానెళ్ల మధ్య నెల రోజులుగా దోబూచులాడిన ఈ సినిమా ఫైనల్ గా ఓ ఛానెల్ చెంతకు చేరింది.

భారీ పోటీ మధ్య మహర్షి మూవీ శాటిలైట్ రైట్స్ ను జెమినీ ఛానెల్ దక్కించుకుంది. ఈ డీల్ వెనక ఓ పెద్ద ప్రహసనమే నడిచింది. నిజానికి ఈ సినిమాను మొన్నటివరకు జీ తెలుగు ఖాతాలో చూశారు చాలామంది. కేవలం సంతకాలు మాత్రమే పెండింగ్ అనేలా నడిచింది వ్యవహారం.

గతంలో ఈ సంస్థ స్పైడర్ సినిమా రైట్స్ ను ఎలాగైతే గంపగుత్తకు దక్కించుకుందో, అదే తరహాలో మహర్షిని కూడా భారీ మొత్తానికి దక్కించుకునేందుకు రంగం సిద్ధంచేసింది. అంతా ఓకే. ఇక అగ్రిమెంట్ పూర్తిచేయడమే ఆలస్యం అనుకున్న టైమ్ లో, లాస్ట్ మినిట్ లో మహర్షి శాటిలైట్ రైట్స్ ను జెమినీ ఛానెల్ ఎగరేసుకుపోయింది.

ఈ డీల్ వెనక దిల్ రాజు భారీగా లాబీయింగ్ చేసినట్టు తెలుస్తోంది. నిజానికి అశ్వనీదత్ ద్వారా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కోసం డీల్ చేసింది జీ తెలుగు ఛానెల్. ఈ సినిమాకు అశ్వనీదత్ కూడా నిర్మాతే. కానీ ఎక్కడో దిల్ రాజుకు, జీ తెలుగు ఛానెల్ కు చెడింది.

పైగా జీ తెలుగు ఛానెల్ కు శాటిలైట్ రైట్స్ తో పాటు డిజిటల్ రైట్స్ ఇవ్వడానికి దిల్ రాజు మొగ్గుచూపలేదు. అందుకే ఆఖరి నిమిషంలో మహర్షి హక్కులు జెమినీ టీవీ సొంతమయ్యాయి. గతంలో పార్టనర్ షిప్ విషయంలో కూడా నిర్మాతలు దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ మధ్య వివాదం నడిచిన విషయం తెలిసిందే.

ఇప్పుడు శాటిలైట్ రైట్స్ విషయంలో మరోసారి నిర్మాతల మధ్య చిన్నపాటి వివాదం తలెత్తినప్పటికీ, అంతిమంగా దిల్ రాజుదే పైచేయిగా నిలిచింది. 

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి