నువ్వు, నేను …మనమందరం కూడా ఇప్పుడు ఓ విపత్కర పరిస్థితితో యుద్ధం చేస్తున్నాం. గతంలో అనేక దాడులను ఎదుర్కొని, తిప్పికొడుతూ, ఎప్పటికప్పుడు కొత్త చైతన్యాన్ని, ఉత్సాహాన్ని నింపుకుంటూ మానవ సమాజం తన ఉనికిని కాపాడుకుంటూ వస్తోంది.
కరోనా లాంటి విపత్కర వైరస్‌లను ఎదుర్కోవడం మానవాళికి కొత్త కాదు. కాకపోతే ఒక్కో కాలంలో ఒక్కో రూపంతో వైరస్ మనపై దాడికి వస్తుంటాయి. ఈ క్రమంలో కొత్త ఆవిష్కరణలకు, పరిశోధనలకు ప్రమాదకర వైరస్‌లు కారణమవుతున్నాయి. ఇప్పటి కరోనా వైరస్‌ను కూడా మనం ఆ దృష్టితోనే చూద్దాం.
కరోనా మహమ్మారి అత్యంత ప్రమాదకారే. ఇందులో రెండో అభిప్రాయానికి తావులేదు. దీన్ని అంతమొందించేందుకు కొంత మూల్యం చెల్లించక తప్పదు. ఈ క్రమంలో మనం బెంబేలెత్తాల్సిన పనిలేదు. మనం వెన్ను చూపి పారిపోతే మహమ్మారి విజయం సాధించినట్టే. తాను ఓడిపోవడం ఇంత వరకూ మానవాళి చరిత్రలోనే లేదు.
ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో మన మైండ్‌సెట్‌ను మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. పత్రికలు, చానళ్లు, సోషల్ మీడియాలో కరోనా వికటాట్టహాసానికి బ్రహ్మరథం పట్టాల్సిన పనిలేదు. ప్రజలను జాగృతం చేయడానికి భయపెట్టే కథనాలు, విజువల్స్ చూపాల్సిన పనిలేదు. ఈ సందర్భంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అదేంటో ప్రతి ఒక్కరం తెలుసుకుందాం.
‘100 మందిలో 98 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులుగా ఇంటికి వెళ్లున్నారు. దాని గురించి చెప్పడం లేదు. ఇంత వరకూ ఆగితే మంచిదే. కానీ చనిపోయిన వారి గురించి పదేపదే చెబుతూ, వారి ఫొటోస్‌ను వైరల్ చేస్తున్నారు.
ఇది వైద్యం తీసుకుంటున్న వారి మనోధైర్యాన్ని బలహీనపరిచే చర్యే. అంతేకాదు, వారి కుటుంబాల్ని భయభ్రాంతులకి గురి చేయడమే. ఇది ఎంత మాత్రం సరైంది కాదు. కరోనా నుంచి కోలుకున్న వారి గురించి కూడా చక్కని కథనాలు రాయండి. వారితో చానళ్లు ఇంటర్వ్యూలు చేసి మరొకరిలో ధైర్యం నింపండి. మందులే కాదు, అప్పుడప్పుడు నాలుగు మంచి మాటలు కూడా మనిషిని బతికిస్తాయి’ అని ఆ పోస్ట్ సారాంశం.
మనిషికి ప్రాణ వాయువు రెండు మంచి మాటలనేందుకు ఈ పోస్ట్‌కు మించిన నిదర్శనం ఏం కావాలి? కరోనా రోగుల్ని కాపాడేం దుకు ఇలాంటి పెద్దల సూక్తుల స్ఫూర్తితో ప్రతి ఒక్కరం చేయి చేయి కలుపుదాం. అలాగే రెండు మంచి మాటలతో వారి కుటుంబ సభ్యులకు ఓదార్పునిద్దాం. బాధితులకు, బాధిత కుటుంబాలకు ఈ రోజు మనం ఆపన్నహస్తం అందిస్తే, రేపు మనకు అదే శ్రీరామరక్ష.
ఎందుకంటే ఈ మహమ్మారి ఎప్పుడెవరిని ఆవహిస్తుందో చెప్పలేం కాబట్టి. మీకు మేము, మాకు మీరు… ఒకరికొకరు తోడుగా ముందుకు సాగినప్పుడే కరోనా లాంటి మహమ్మారి మనల్ను ఏమీ చేయలేదు. ఆ దిశగా అందరూ ఆలోచించాల్సిన, అడుగులు వేయాల్సిన ఆవశ్యకతను ప్రస్తుత విపత్కర పరిస్థితి ఓ గుణపాఠాన్ని నేర్పుతోంది.
సొదుం రమణ