కోర్టుకెక్కినా చివరికి సీఐడీ విచారణ నుంచి మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు తప్పించుకోలేకపోయారు. న్యాయస్థానంలో దేవినేనికి చుక్కెదురైందని చెప్పొచ్చు.
తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ నెల 7న తిరుపతిలో దేవినేని ఉమా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సంబంధించిన వీడియోను ఆయన ప్రదర్శించారు.
అయితే ఆ వీడియో మార్ఫింగ్ చేశారని దేవినేనిపై కర్నూలు జిల్లా వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మాజీ మంత్రిపై వివిధ సెక్షన్ల కింద సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.
అనంతరం విచారణకు రావాలని రెండు దఫాలుగా ఇచ్చిన నోటీసులకు దేవినేని ఉమామహేశ్వరరావు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో మరోసారి ఆయనకు నోటీసు ఇచ్చారు.
ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు తనపై నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ను హైకోర్టులో దాఖలు చేశారు. తనను సీఐడీ అధికారులు ఇరికించేందుకు కేసు నమోదు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు.
పిటిషనర్ తరపు వాదనలు విన్న న్యాయస్థానం కీలక ఆదేశాలు ఇచ్చింది. అయితే దేవినేనికి పూర్తిస్థాయిలో ఊరట దక్కలేదు. కేవలం దర్యాప్తు అధికారిని మార్చాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
ఈనెల 29న మంగళగిరి సీఐడీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని దేవినేని ఉమను ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను మే 7వ తేదీకి వాయిదా వేసింది.
అప్పటి వరకు దేవినేనిని అరెస్ట్ చేయడం లాంటి చర్యలు తీసుకోవద్దని సీఐడీ అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. దీంతో విచారణ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నించిన దేవినేనికి నిరాశే ఎదురైంది.