కరోనా వైరస్ కంటే ప్రమాదకరంగా దానికి వైద్యం అందించే కార్పొరేట్ వైద్యశాలలు పెద్ద మహమ్మారిగా తయారయ్యాయి. ఇక్కడ, అక్కడ అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో కరోనాకు వైద్యం అందించే సాకుతో ఆస్పత్రులు సామాన్యులను పీల్చి పిప్పి చేస్తున్నాయి.
కడప జిల్లా ప్రొద్దుటూరు లాంటి ఒక మోస్తారు పట్టణం, తిరుపతి లాంటి మధ్యస్థాయి నగరం, అలాగే హైదరాబాద్, విజయవాడ, చెన్నై లాంటి నగరాల్లో కరోనా వైద్యం పేరుతో కార్పొరేట్ ఆస్పత్రులు దోపిడీకి తెరలేపాయి. ఈ దోపిడీ మహమ్మారికి మందేది? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
ఏపీలో కోవిడ్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు జగన్ ప్రభుత్వం చర్యలకు శ్రీకారం చుట్టడం అభినందించాల్సిన విషయం. ఈ మేరకు కోవిడ్ ఆస్పత్రులను పునరుద్ధరిస్తున్నట్టు వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. పడకలు, ఆక్సిజన్, ఇంజక్షన్లు, కోవిడ్ చికిత్సకు అనుమతి ఉన్న ఆస్పత్రులకు ఇబ్బంది లేదని, త్వరలో మరిన్ని పడకలు అందుబాటులోకి తెస్తామని ఆయన చెప్పుకొచ్చారు.
2020 సెప్టెంబర్ 3వ తేదీ నాటికి ఉన్న 115 కోవిడ్ సెంటర్లు, 49,180 బెడ్లను తిరిగి శుక్రవారం సాయంత్రం నాటికి పూర్తిగా అందు బాటులోకి తీసుకురానున్నట్టు అనిల్‌కుమార్ సింఘాల్ చెప్పారు. ఇది ప్రజానీకానికి ఎంతో ఊపిరినిచ్చే సమాచారమే. అలాగే ప్రస్తుతం 140కి పైగా అనుమతి పొందిన ప్రభుత్వ, ప్రైవేట్ కోవిడ్ ఆస్పత్రులున్నట్టు ఆయన వెల్లడించారు. అయితే ప్రైవేట్ ఆస్పత్రులకు అనుమతులు ఇవ్వడంతో సరిపెట్టకుండా, వాటిపై ప్రభుత్వ అజమాయిషీ ఉండాలి. అప్పుడే ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందే రోగులు …ఆ ఆస్పత్రులు బిల్లుల రూపంలో జలగల్లా పీక్కతినే ముప్పు నుంచి తప్పించుకునే వీలుంటుంది.
కరోనాకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందిస్తున్నారు. అలాగే రోగికి అవసరరమైన పౌష్టికాహారం అందిస్తున్నారు. వైద్యాన్ని విస్తృత పరిచే క్రమంలో ఆరోగ్యశ్రీ పరిధిలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ఉన్నవారికి ఉచితంగా వైద్యం అందించాలి. మిగిలిన వారికి ప్రభుత్వం నిర్దేశించిన రేట్ల ప్రకారం వైద్యం అందించాలి. అయితే ఇక్కడే ప్రభుత్వ ఆదేశాలు అమలు కావడం లేదు. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీకి రోగి సగం మానసికంగా చచ్చిపోతున్నాడు.
ప్రైవేట్ ఆస్పత్రిలో రోగి చేరిన మొదలుకుని తన జబ్బుపై కంటే, ఆస్పత్రులు వేసే బిల్లులకు ఎక్కువ భయపడాల్సి వస్తోంది. రోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు అదనపు మానసిక వేదన తప్పడం లేదు. ఒక్కో ఆస్పత్రిలో లక్ష, లక్షన్నర, రెండు, మూడు లక్షలు డిపాజిట్ చేస్తే తప్ప వైద్యం అందించని దయనీయ స్థితి. ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు డిమాండ్ చేసినట్టుగా డబ్బు కడితేనే వైద్యం …లేదంటే ట్రీట్మెంట్కు నైవేద్యమే.
కరోనా వైద్యానికి దేనికంత తీసుకోవాలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ స్పష్టంగా పేర్కొంది. అత్యవసరం కాని చికిత్సకు రూ.3,220, ఐసీయూలో ఉంచితే వెంటిలేటర్, ఎన్ఐవీ లేకుండా అయితే రూ.5,480, నోట్లో పైపు లేకుండా వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ అందించే చికిత్స అయితే రూ.5,980, నోట్లో పైపుతో వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ అందించే చికిత్స అయితే రూ.9,580 తీసుకోవాలి. అలాగే రక్తంలో ఇన్ఫెక్షన్కు చికిత్స చేస్తే రూ.6,280, రక్తంలో ఇన్ఫెక్షన్, వెంటిలేటర్ చికిత్సకైతే రూ.10,380, రక్తంలో ఇన్ఫెక్షన్ ఉండి, బీపీ, పల్స్ పడిపోయే పరిస్థితి , శరీర భాగాలు పనిచేయని పరిస్థితిలో చికిత్స అందిస్తే రూ.10,380 వసూలు చేయాలి.
ఏ ఒక్క ఆస్పత్రిలో కూడా ఈ ధరల ప్రకారం వైద్యం అందిస్తున్న దాఖలాలు లేవు. గత ఏడాది ఒక్కో కరోనా రోగి నుంచి ఐదు లక్షలు, పది లక్షలు, 20 లక్షల వరకు గుంజిన ఆస్పత్రుల గురించి మీడియాలో కథలు కథలుగా కథనాలు వచ్చాయి. పోనీ రోగిని బతికిచ్చారా అంటే అదీ లేదు. కొన్ని ఆస్పత్రుల్లో అయితే రోగి మరణించారని తెలిస్తే డబ్బు కట్టరని, కోలుకుంటున్నారని చెప్పి, పూర్తి బిల్లు చెల్లించిన తర్వాత చావు కబురు చల్లగా చెప్పిన ఉదంతాలు లేకపోలేదు.
కావున జగన్ సర్కార్ ప్రస్తుత తీసుకుంటున్న చర్యలను ప్రశంసిస్తూనే ….ప్రైవేట్ ఆస్పత్రుల్లో కఠినంగా అజమాయిషీ చెలాయించి, రోగులను కార్పొరేట్ వైరస్ బారి నుంచి కాపాడాల్సిన బాధ్యత ఉందని ప్రజానీకం గుర్తు చేస్తోంది. ఆ దిశగా తక్షణం చర్యలు చేపట్టాల్సిన కింకర్తవ్యం జగన్ సర్కార్‌పై ఎంతైనా ఉంది.