రామ భక్తులు, ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లోని రామభక్తులు, హనుమంతుడి భక్తులు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే రామ భక్తుడైన ఆంజనేయుడి జన్మస్థానం తిరుమల గిరులలోని అంజనాద్రి అని టీటీడీ బృందం చేసిన పరిశోధనల్లో తేలింది.
పురాణాలు, శాస్త్రాలు, భౌగోళిక విషయాలు, శాసనాలు …ఇలా బోలెడు అంశాలు పరిశీలించి, పరిశోధించి ఆంజనేయుడి జన్మస్థలం అంజనాద్రి అని తేల్చినట్లు టీటీడీ పరిశోధకులు చెప్పారు. మొత్తమ్మీద హనుమంతుడు తెలుగోడు అని తెలిసింది కాబట్టి హనుమంతుడి భక్తులు హ్యాపీగా ఫీలవుతున్నారు. దేవుళ్లలో రాముడికి ఎంత విలువ, గౌరవం ఉన్నాయో హనుమంతుడికి అంతే విలువ, గౌరవం ఉన్నాయి.
టీటీడీ వారు మొదట్లో చెప్పిన విషయం గుర్తుందా ? హనుమంతుడు మా దగ్గరే పుట్టాడని దేశంలో ఏ రాష్ట్రం వారు కూడా ఇప్పటివరకు క్లెయిమ్ చేసుకోలేదు కాబట్టి తాము ఆధారాలతోసహా హనుమంతుడు పుట్టింది తిరుమలలోనేనని చెప్పబోతున్నామని అన్నారు. ఈ విషయాన్ని ఉగాదినాడు బయట పెట్టబోతున్నామని అన్నారు. కానీ ఆరోజు చెప్పలేదు.
శ్రీరామనవమినాడు చెప్పారు. శ్రీరాముడికి -ఆంజనేయుడికి ఉన్న లింకు అందరికీ తెలిసిందేకదా. అందుకని ఆ సెంటిమెంటు ప్రకారం శ్రీరామనవమినాడు చెప్పారు. టీటీడీ పరిశోధక బృందం విషయం వెల్లడించింది నిన్ననే కాబట్టి దీనిపై ఇంకా చర్చోపచర్చలు మొదలు కాలేదు.
హనుమంతుడు తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు కదా. దేశ వ్యాప్త దేవుడు. కాబట్టి దీనిపైనా దేశమంతా చర్చ జరుగుతుండొచ్చు. టీటీడీ పరిశోధకులు చెప్పినట్లు హనుమంతుడు మావాడేనని ఇప్పటివరకు ఎవరూ క్లెయిమ్ చేసుకోలేదా ? రాముడు పుట్టింది అయోధ్యలోకాదు, నేపాల్ లో పుట్టాడని కొంతకాలం క్రితం ఆ దేశ ప్రధాని ఓ వివాదం లేవదీశాడు కదా. మరి హనుమంతుడి గురించి ఇతర రాష్ట్రాల వారు కూడా ఏదో ఒకటి ఎప్పుడో చెప్పే ఉండాలి కదా.
ఆంజనేయ స్వామి జన్మస్థలం విషయంలో గతంలో కొందరు పరిశోధకులు కొన్ని విషయాలు చెప్పారు. ఆంజనేయ స్వామి తమ ప్రాంతంలోనే జన్మించినట్టు ఐదు ప్రాంతాలకు చెందిన పరిశోధకులు గతంలో వాదించారు. కర్నాటకలోని హంపికి సమీపంలో ఒక అంజనాద్రి ఉంది. ఆంజనేయుడు అక్కడే జన్మించినట్టు కొందరు పరిశోధకులు వాదించారు. అయితే, అందుకు సాక్ష్యాధారాలేవీ లభించలేదని హంపిలోని కర్నాటక విశ్వవిద్యాలయం పరిశోధకులు ఆ తర్వాత పేర్కొన్నారు.
జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో అంజన్ అనే గ్రామం ఉంది. అక్కడే ఆంజనేయుడు జన్మించినట్టు కొందరు వాదించారు. అయితే, ఆ వాదనను నిర్ధారించడానికి ఆధారాలు లభించలేదు. గుజరాత్‌లోని నవసారి ప్రాంతంలో అంజన అనే గుట్ట ఉంది. అక్కడే ఆంజనేయుడు జన్మించాడనే వాదన ఉంది. కానీ, అది కూడా నిర్ధారణ కాలేదు.
ఇక హర్యానాలోని కైతల్ ప్రాంతం నుంచి కూడా ఇటువంటి వాదనే వచ్చింది. కానీ దానికీ చారిత్రక, పౌరాణిక ఆధారాలేవీ లభించలేదు. మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న త్రయంబకేశ్వరానికి ఏడు కిలోమీటర్ల దూరంలో అంజనేరి అనే పర్వతం ఉంది. అక్కడ నుంచి కూడా కొందరు ఈ రకమైన వాదనలు చేశారు. కానీ ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదు.
కర్నాటకలోని హంపి ప్రాంతమే కిష్కింధ అని చరిత్రకారులు నిర్ధారించారు. అయితే కిష్కింధ హనుమంతుడి జన్మస్థానం కాదు. ఆంజనేయ స్వామి అక్కడికి హంపికి వలస వెళ్లి ఉంటాడని చరిత్రకారులు చెబుతున్నారు. ఇక రామాయణం, మహాభారతం మొదలైనవి ఇతిహాసాలని అంటారు. ఆస్తికులు అనండి, భక్తులు అనండి వారు రామాయణం, భారతం నిజంగాజరిగిన కథలు అంటారు.
హేతువాదులు అవి కాల్పానికాలు అంటే క్రియేట్ చేసిన రచనలు అంటారు. రామాయణాన్నికొందరు కావ్యం అంటారు. కావ్యం అంటే సాహిత్య సంబంధమైనది. కాబట్టి దాన్నిచరిత్రగా ఒప్పుకోరు. ఇలా ఎన్నో వివాదాలున్నాయి. అదంతా అలా ఉంచితే, టీటీడీ పరిశోధకుల ప్రకారం ఆంజనేయుడు పుట్టింది తిరుమలలోని అంజనాద్రి మీద కాబట్టి ఆయన తెలుగోడే.
అంటే రామాయణ కాలానికే తెలుగు భాష ఉండి ఉండాలి. మరి ఆయన తెలుగు మాట్లాడి ఉంటాడా ? రాముడు ఉత్తర భారతీయుడు. అప్పటికి హిందీ వాడుకలో ఉన్నట్లయితే రాముడు ఆ భాషలోగాని, దానికి దగ్గర్లో ఉన్న మరో భాషలో గానీ మాట్లాడి ఉండాలి. అలాంటప్పుడు రాముడు, ఆంజనేయుడు ఏ భాషలో మాట్లాడుకొనివుంటారు? కామన్ గా ఏదో ఒక భాష ఇద్దరికీ తెలిసి ఉండాలి.
అసలు రామాయణ కాలం నాటికి జనం ఏయే భాషలు మాట్లాడేవారు. రాముడు, సీత, హనుమంతుడు మొదలైనవారు ఏ భాషలో మాట్లాడుకున్నారు? అనే విషయం మీద కూడా పరిశోధన చేస్తే మంచిది. ఇది జరిగిన చరిత్ర అనుకున్నట్లైతే భాషల విషయం కూడా తేల్చాలి.