కరోనా సెకెండ్ వేవ్ రోజురోజుకూ ఉధృతమవుతోంది. పేద, ధనిక, చిన్నా,పెద్దా అనే తేడా లేకుండా అందరిపై పంజా విసురుతోంది. తాజాగా సీపీఎం జాతీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ నేత సీతారాం ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి (34)ని కరోనా బలి తీసుకుంది. ఓ ప్రముఖ వార్తాపత్రికలో సీనియర్ కాపీ ఎడిటర్.
ఈ నేపథ్యంలో సీతారాం ఏచూరి కుమారుడు ఆశిష్ ఏచూరి ఇటీవల కరోనాబారిన పడ్డాడు. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం ఆయన తుదిశ్వాస విడిచాడు. తన కుమారుడి మృతి విషయమై ఏచూరి ట్వీట్ చేశారు.
‘ఈ రోజు ఉదయం నా పెద్ద కొడుకు ఆశిష్ ఏచూరీ కరోనాతో మృతి చెందడం చాలా బాధాకరం. ఆశిష్‌ను బతికించడానికి చికిత్స అందించిన వైద్యులకు కృతజ్ఞతలు. వైద్యులు, నర్సులు, ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులు మాకు అండగా నిలిచారు’ అని ఆయన ఆవేదనతో ట్వీట్ చేశారు.
ఇప్పటికే కరోనా దెబ్బకు పలువురు ప్రముఖులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఏచూరి కుమారుడి మృతికి పలువురు సంతాపం తెలిపారు. సీతారాం ఏచూరి రాజ్యసభ సభ్యుడిగా బలమైన ప్రజావాణిని వినిపించే నేతగా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారు.