సత్యాన్నే పలకాలని మహాత్మాగాంధీ చెప్పడమే కాదు, ఆచరించి చూపారు కూడా. మై ఎక్స్‌పర్‌మెంట్స్ విత్ ట్రూత్ అని మహా త్మాగాంధీ తన ఆత్మకథను రాశారంటే ఎంత నిజాయతీతో కూడిన జీవితాన్ని లీడ్ చేసి ఉంటారో అర్థం చేసుకోవచ్చు.
స్వాతంత్ర్య సమరంలో భాగంగా దేశం యావత్తు ఆయన్ను అనుసరించిందంటే… అందుకు కారణం ఆయన నిజాయతీ, నిబద్ధత మాత్రమే. కానీ గాంధీని జాతిపితగా ఆరాధిస్తున్న మన దేశంలో, ఆయన ఆశయాలను ఆచరిస్తున్న వాళ్లు వేళ్ల మీద లెక్క పెట్టగలిగేంత మంది కూడా లేరంటే ఆశ్చర్చం కలిగిస్తోంది.
ఇదిలా ఉండగా గాంధీజీ ఆశయాలు, దేశానికి ఆయన అందించిన సేవలకు ముగ్ధులైన పెద్దలు తమ పిల్లలకు ఆయన పేరు పెట్టుకోవడం తెలిసిందే. అలాగే ఊరూరా గాంధీ విగ్రహాలు, వీధులకు ఆయన పేర్లు పెట్టడం వెనుక ఉద్దేశం …భావితరాలకు ఆయన గొప్పతనం తెలియజెప్పాలనేదే.
అయితే అసత్యాన్నే పలకాలని నేటి ఓ గాంధీ తన ఫిలాసఫీగా మార్చుకున్నట్టు ఆయన ఆచరణ చూస్తే ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఆదాయానికి మించిన ఆస్తుల మించిన ఆస్తుల కేసులో మాజీ సీజీఎస్టీ అధికారి బొల్లినేని శ్రీనివాస గాంధీని సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే తాను అరెస్ట్ కాకుండా కాలయాపన చేసేందుకు బొల్లినేని గాంధీ సరికొత్త ఎత్తుగడ వేసినట్టు సీబీఐ బయట పెట్టడం గమనార్హం. అరెస్ట్ చేయడానికి సీబీఐ అధికారులు తన ఇంటికి వచ్చే సరికి …తన కుటుంబ సభ్యులకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చిందని నకిలీ రిపోర్టులు సిద్ధం చేసి ఉంచినట్టు సమాచారం.
చివరికి ఆ రిపోర్టులు ఫేక్ అని సీబీఐ అధికారులు తేల్చి బొల్లినేని గాంధీని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. వివిధ ఉన్నత స్థాయిల్లో పనిచేసిన బొల్లినేని గాంధీ తన వరకూ వచ్చే సరికి, కేసులు, అరెస్ట్ నుంచి తప్పించుకోడానికి కరోనా మహమ్మారిని కూడా వాడుకునేందుకు ప్రయత్నించడం విమర్శలకు దారి తీసింది.
గాంధీజీ పేరు పెట్టుకుంటే సరిపోదని, ఆయన ఆశయాలను ఆచరించే వాళ్లే, మన జాతిపితకు నిజమైన వారసులని చెప్పక తప్పదు.