పుంగనూరులో చంద్రబాబును అడ్డుకోవడమే ఆలస్యం… వెంటనే ఖండించడానికి పవన్‌కల్యాణ్ ముందుకొచ్చారు. పుంగనూరు ఘటనపై పవన్‌కల్యాణ్ ఖండన ప్రకటనపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. తన తండ్రి సామాన్య కానిస్టేబుల్ అని చెప్పుకునే పవన్‌కల్యాణ్, పుంగనూరులో వారే బాధితులుగా మిగిలితే, కనీసం సానుభూతి ప్రకటించకపోవడం ఏంటనే నిలదీతలు ఎదురవుతున్నాయి.
ప్రకటనలకే పరిమితం అవుతారా? లేక ఓదార్చడానికి నేరుగా చంద్రబాబును కలవరా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. దత్త తండ్రి చంద్రబాబును అడ్డుకుంటే, దత్త పుత్రుడిగా మీరెలా చూస్తూ ఉన్నారని వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు. పుంగనూరు ఘటనపై పవన్ ప్రకటన ఏంటో చూద్దాం.
“రాష్ట్రంలో వైసీపీ సర్కార్ వైఖరి ప్రతిపక్షం గొంతు నొక్కేలా వుంది. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు వైసీపీ నాయకుల అరాచకాలతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల తరపున పోరాడటం ప్రతిపక్షాల బాధ్యత. ఈ రోజు పుంగనూరు నియోజక వర్గంలో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు వాంఛనీయం కాదు. ఆయన పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ వ్యక్తులు రాళ్ల దాడులకు పాల్పడటం, వాహనాలు ధ్వంసం చేయడం అధికార పార్టీ హింసా ప్రవృత్తిని తెలియజేస్తోంది. వారిని నియంతృత్వం పెచ్చరిల్లుతోంది. పుంగనూరులో చోటు చేసుకున్న పరిణామాలను ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలి”
టీడీపీని వెనకేసుకు రావడానికి ఓ ఘటన కావాలి. అంతే తప్ప, తప్పొప్పలతో తనకు సంబంధం లేదన్నట్టుగా పవన్ తీరు వుంది. పోలీసు వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు తగలబెడుతున్నట్టు ఎల్లో పత్రికల్లోనే ఫొటోలతో సహా ప్రచురించారు. కానీ పవన్ కళ్లకు మాత్రం వైసీపీ వ్యక్తులే రాళ్ల దాడికి పాల్పడినట్టు, వాహనాలను ధ్వంసం చేసినట్టుగా కనిపిస్తోంది. టీడీపీ వాళ్లు యథేచ్ఛగా హింసకు దిగినా, ఖండించడానికి పవన్‌కు మనసు రాలేదు.
వైసీపీని విమర్శించడమే ప్రజాస్వామ్యమని పవన్ నమ్ముతున్నారు. గతంలో కుప్పంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకున్నారని ఆయన ఇంటికి వెళ్లి మరీ పవన్ పరామర్శించి సంఘీభావం తెలిపారు. తాజాగా చిత్తూరు జిల్లాలో బాబును అడ్డుకున్న నేపథ్యంలో ఆయన్ను ఓదార్చడానికి పవన్ ఎప్పుడు వెళ్తున్నారో మరి అంటూ నెటిజన్లు సెటైర్స్ విసురుతున్నారు.