రాజకీయాల్లోకి సాధారణంగా సినిమా రంగం నుంచి హీరోలు, హీరోయిన్లు అడుగు పెడుతుంటారు. ఎందుకంటే వారికి ప్రజల్లో ఆదరణ, క్రేజ్ ఉంటాయి కాబట్టి. అరవై ఏళ్లకు రాజకీయరంగ ప్రవేశం చేసి ముఖ్యమంత్రి అయిన ఎన్‌టీఆర్ చరిత్ర మనకు తెలుసు.
తెలుగు సినిమా రంగం నుంచి కొందరు హీరోలు రాజకీయాల్లోకి వెళ్ళి ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యారు. కృష్ణంరాజు, చిరంజీవి, దాసరి నారాయణరావు కేంద్రంలో మంత్రులయ్యారు. తెలుగు హీరోయిన్లు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యారు. ఇలా చెప్పుకుంటూపోతే చాలా కథ ఉంది.
తెర మీద కనిపించేవారు రాజకీయాల్లోకి రావడం, ఎన్నికల్లో పోటీ చేయడం, గెలిస్తే మంత్రులుగానో, మరేవో పదవులు చేపట్టడం కూడా సాధారణంగా కనిపించే దృశ్యం. కాని సింగర్స్‌గాని, మిగతా విభాగాలవారుగాని రాజకీయాల్లోకి రారు. ఒకవేళ వచ్చినా ఎన్నికల్లో పోటీ చేయడంలాంటిది జరగదు.
పాపులర్ వ్యక్తులైతే రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కొన్నేళ్ల నుంచే (మరీ ఎక్కవ కాలం కాదు) పాపులర్ అయిన తెలంగాణకు చెందిన ఓ సింగర్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు సమాచారం. అతనెవరో కాదు రాహుల్ సిప్లిగంజ్. బిగ్ బాస్ విన్నర్‌గా, ఆస్కార్ స్టేజ్ ఫేమర్‌గా పాపులరైన రాహుల్ సిప్లిగంజ్ ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీకి సిద్దమైనట్లు తెలుస్తోంది. త్వరలో జరిగే తెలంగాణ ఎన్నికల బరిలో రాహుల్ పోటీ చేస్తారని చెబుతున్నారు.
ఇందు కోసం ముందుగానే పార్టీతో పాటుగా నియోజకవర్గం ఖరారు చేసుకున్నట్లు సమాచారం. ఎన్నికల్లో పోటీ పైన అధికార ప్రకటనకు రాహుల్ సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మంగళహాట్ ప్రాంతానికి చెందిన రాహుల్ సిప్లిగంజ్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్దంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్ నేతలు సైతం ప్రజల్లో ఆదరణ ఉన్న వారికి టికెట్ల కేటాయింపులో ఈ సారి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది. అందులో భాగంగా రాహుల్ ముందుకు వస్తే గోషామహల్ నుంచి పార్టీ అభ్యర్దిగా అవకాశం కల్పించేలా సానుకూల సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. గోషామహల్ నుంచి కాంగ్రెస్ కు రాహుల్ సరైన అభ్యర్థిగా పార్టీ నేతలు భావిస్తున్నారు.
బిగ్ బాస్ విన్నర్ గా గుర్తింపు దక్కించుకున్న రాహుల్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట ద్వారా అరుదైన ఖ్యాతి గడించారు. ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ రావడంతో ఆ పాట ఆస్కార్ స్టేజి మీద పర్ఫామ్ చేసే అవకాశం రాహుల్‌కు వచ్చింది. అలా ఆయన పేరు ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోయింది. ఈ కారణంగానే మాస్ నుంచి వచ్చి మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న రాహుల్ సిప్లిగంజిని గోషామహల్ నుంచి పోటీ చేపిస్తే గట్టి పోటీని ఎదుర్కోవచ్చని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ నుంచి రాహుల్ అక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో సరైన అభ్యర్దిగా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. పోటీ పైన రాహుల్ తుది నిర్ణయ తీసుకోవాల్సి ఉంది. తన శ్రేయోభిలాషులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటానని చెబుతున్నట్లుగా సమాచారం. దీంతో, రాహుల్ ఎన్నికల బరిలో నిలుస్తారా లేదా అనేది త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.