చంద్రబాబు విపరీతమైన భయాందోళనలో ఉన్నారు. ఈ దఫా అధికారంలోకి రాకపోతే ఏమవుతుందో అనే ఆలోచన ఆయన్ను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. 2024 ఎన్నికలు టీడీపీకి అత్యంత ప్రతిష్టాత్మకం. ఏ మాత్రం అటూఇటూ అయినా ఇక టీడీపీ భవిష్యత్ గల్లంతే. తన కుమారుడు లోకేశ్ భవిష్యత్ గురించి చంద్రబాబు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. 2029 ఎన్నికలు వచ్చే నాటికి చంద్రబాబు 80వ ఏడాదిలో అడుగు పెడతారు. ఇక ఆయన రాజకీయంగా చురుగ్గా పాల్గొనే పరిస్థితి వుండదు.
ఈ లోపే తన కుమారుడిని రాజకీయంగా స్థిరపరచాలనే తాపత్రయంలో చంద్రబాబు ఉన్నారు. కానీ ఏపీలో రాజకీయాలు ఎవరికీ అంతుచిక్కని విధంగా ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని తన మీడియా ద్వారా క్రియేట్ చేస్తున్నప్పటికీ, ఒకప్పటిలా ఇలాంటివి ప్రజలపై ఏ మాత్రం ప్రభావం చూపడం లేదు. సంక్షేమ పథకాలు జగన్‌కు పాజిటివ్ అయ్యాయనే సర్వే నివేదికలు చంద్రబాబును కలవరపెడుతున్నాయి.
దీంతో కనీసం పొలిట్‌బ్యూరోలో కూడా చర్చించకుండా జగన్‌కు మించి సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. దీంతో సంక్షేమ పథకాలను వ్యతిరేకించే వర్గాల్లో చంద్రబాబుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ బాటలోనే పయనిస్తానంటే, మీరెందుకని చంద్రబాబును నిలదీస్తున్నారు. వైఎస్ జగన్‌పై ఎల్లో మీడియాలో తప్ప, జనంలో తాము అనుకున్నంతగా వ్యతిరేకత లేదనేది చంద్రబాబు భావన.
మరోవైపు పలు జాతీయ సంస్థల సర్వే నివేదికలు జగన్‌కు అనుకూలంగా ఉన్నాయి. దీంతో టీడీపీకి అధికారంపై బాబుకు నమ్మకం కుదరడం లేదు. ఈ నేపథ్యంలో తన సహజ శైలికి భిన్నంగా ఎక్కడికక్కడ గొడవలు సృష్టిస్తూ, వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయనే నెగెటివిటీని సృష్టించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు, ఆరోపణలు వైసీపీ నుంచి నుంచి వ్యక్తమవుతున్నాయి.
బహిరంగ సభల్లో చంద్రబాబు తన స్థాయి, పెద్దరికాన్ని మరిచి రెచ్చిపోతున్నారు. దాడులకు ఆయన ఉసిగొల్పుతున్నారు. పోలీసులపై రెచ్చిపోతూ బ్లాక్ మెయిలింగ్ ద్వారా తన గ్రిప్‌లోకి తెచ్చుకోవాలని తపన పడుతున్నారు. పోలీసులు ఖబడ్దార్, పెద్దిరెడ్డి ఖబడ్దార్, సైకో సీఎం ఖబడ్దార్ అంటూ అందరినీ తెగ హెచ్చరిస్తున్నారు. విపరీతమైన భయం ఉన్నవారే ఇలాంటి హెచ్చరికలు చేస్తుంటారని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
చుట్టూ పటిష్టమైన భద్రత పెట్టుకున్న చంద్రబాబు, తనపై ఎవరూ దాడి చేయలేరనే ధీమాతోనే ప్రత్యర్థులపై చెలరేగిపోతున్నారు. ముఖాముఖి తలపడితే చంద్రబాబు గొల్లుమని ఏడుస్తారనే సంగతి తెలిసిందే. తనలోని భయాన్ని, ఒత్తిడిని వార్నింగ్‌లతో బయటపెట్టుకుంటున్న చంద్రబాబుకు ఏమవుతుందోనని టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.