పుంగనూరులో అవాంఛనీయ ఘటనలను సృష్టించిన చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇదంత పక్కా ప్లాన్ ప్రకారమే చంద్రబాబు చేశారని ఆయన ఆరోపించారు. టీడీపీ శ్రేణుల దాడిలో గాయాలపాలై చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని మంత్రి శనివారం పరామర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు రాజకీయంగా దివాళా తీశారని మండిపడ్డారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించి రూట్ మ్యాప్ ఇచ్చిందొకటి, ఆ తర్వాత చేస్తామన్నది మరొకటి అని మంత్రి తప్పు పట్టారు. పుంగనూరు బైపాస్ నుంచి చిత్తూరు వెళ్తామని పోలీసులకు రూట్ మ్యాప్ ఇచ్చినట్టు ఆయన తెలిపారు. ఆ తర్వాత గొడవలు పెట్టుకునేందుకే పుంగనూరులోకి వెళ్లాలని చంద్రబాబు ప్రయత్నించారని మంత్రి మండిపడ్డారు.
అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై విచక్షణా రహితంగా దాడి చేశారని పెద్దిరెడ్డి ఆగ్రహించారు. చంద్రబాబు అంతులేని ఆవేదన, ఆలోచనతో బాధపడుతున్నారని బాబు విమర్శించారు. చంద్రబాబు రెచ్చగొట్టడం వల్లే పోలీసులపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆయన ఆరోపించారు. తిడుతూ ప్రజలను చంద్రబాబు రెచ్చగొట్టారని ఆరోపించారు. కుప్పంలో ఓడిపోతాననే భయంతోనే ఈ స్థాయిలో చంద్రబాబు గొడవలకు తెరలేపారని మంత్రి విరుచుకుపడ్డారు. కుప్పం అనగానే చంద్రబాబుకు ఓటమి, తాను గుర్తు కొస్తానని ఆయన అన్నారు.
పుంగనూరు ఘటన పోలీసులకు, ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమని మంత్రి స్పష్టం చేశారు. అల్లర్లకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. బాబు పర్యటనకు గన్స్ తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు. షార్ట్ గన్స్కు లైసెన్స్ వుండదని, వాటిని వెంట తీసుకొచ్చారని ఆయన అన్నారు. 200 వాహనాల్లో రౌడీలను తీసుకొచ్చి దాడులకు తెగబడ్డారని ఆయన ఆరోపించారు.