ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వణికిస్తున్న ఈఎస్ఐ స్కామ్ ఎలా బయటపడింది? ఈ తొమ్మిది నెలల్లో ఎప్పుడూ చర్చకు రాని, వివాదాస్పదం కాని ఈఎస్ఐ అవినీతి దందా ఎలా బద్దలైంది? అనే ప్రశ్నవినిపిస్తోంది. ఈ అవినీతి భాగోతం బద్దలు కావడానికి ప్రధాన కారణం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు. ఆయనే ఫిర్యాదు చేయకపోతే ఈవేళ ఇంత పెద్ద కుంభకోణం ఎప్పటికి బయటపడేదో చెప్పలేం.
తెలంగాణ ఈఎస్ఐలో అవినీతి మూలాలు ఏపీలోనూ ఉన్నాయని, ఈ భారీ అవినీతిపై అవినీతి నిరోధక శాఖతో విచారణ చేపట్టి దోషులను శిక్షించడంతో పాటు, ప్రజాధనాన్ని కాపాడాలని సీపీఎం మధు ఈ ఏడాది జనవరి 10న సీఎం జగన్‌కు లేఖ రాశాడు.
తెలంగాణ ఈఎస్‌ఐ అవినీతిలో దోషులుగా దొరికిన మెడికల్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే రకమైన పాత్ర పోషించినట్లు ఈ లేఖలో పేర్కొన్నారు. అధిక రేట్లకు మందులు, కిట్స్ సరఫరా చేయడం, టెండర్ ప్రక్రియ పాటించకపోవడం, ఇండెంట్ లేకుండానే సరఫరా చేయడం, రేట్ కాంట్రాక్ట్ సంస్థల నుంచి కాకుండా నాన్ రేట్ కాంట్రాక్ట్ సంస్థల నుంచి అధిక ధరలకు కొనుగోలు చేయడం తదితర పద్ధతుల్లో కోట్లాది రూపాయిలు కార్మికుల సొమ్మును కొల్లగొట్టినట్లు మధు ప్రభుత్వ దృష్టికి లేఖ ద్వారా తీసుకెళ్లారు.
తాజాగా విజిలెన్స్ విడుదల చేసిన నివేదిక సైతం దాదాపుగా మధు లేవనెత్తిన అవినీతి అంశాలను ధ్రువీకరించడం గమనార్హం. నామినేషన్ ప్రాతిపదికన మూడు, నాలుగు మందుల కంపెనీల నుండే కొనుగోలు చేశారని, దీనికి అప్పటి కార్యికశాఖమంత్రి అచ్చెన్నాయుడు రాసిన లేఖే ప్రాతిపదికని నివేదికలో పేర్కొనడం ప్రస్తుతం రాజకీయ దుమారాన్ని రేపింది.
రూ. 975.79 కోట్ల విలువైన మందుల కొనుగోళ్లలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు , రూ.151 కోట్ల అవినీతి చోటు జరిగినట్టు విజిలెన్స్ విచారణలో తేలింది. ఈ మేరకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంటు విభాగం విడుదల చేసిన నివేదిక ఒక్కసారిగా కలకలం రేపింది. సీపీఎం మధు కారణంగానే ఈ వేళ ఇంత పెద్ద స్కామ్ బయటికి వచ్చింది.