మొత్తానికి ఈ ఉద్యమం కాస్త లేటుగా అయినా భారత్‌లో మొదలైంది. తుఫాన్ రేపుతున్నట్టుగా కనిపిస్తోంది. అయితే రేగాల్సింది తుఫాన్ కాదు. సునామీ, భూకంపం పుట్టాల్సింది. అయితే ఇప్పటికీ ఈ ఉద్యమం కేవలం చోటామోటా వాళ్ల చుట్టూ మాత్రమే తిరుగుతూ ఉంది. అలోక్‌నాథ్, నానా పటేకర్.. వీళ్లు ప్రాభవం కోల్పోయిన వాళ్లు.
ఇప్పుడు ఏ అంత ఊపులేని వాళ్లు. అందుకే వీళ్ల మీద కూడా రాళ్లు చాలా ఈజీగా పడ్డాయి. గతంలో ఏం చేశారనే మాట పక్కనపెడితే.. ఇప్పుడు వీళ్లకు ఫేమ్‌లేదు కాబట్టే.. వీళ్లపై ఆరోపణలు ఈజీ అయ్యాయి. అందరూ కూడా తేలికగా విరుచుకు పడగలుగుతున్నారు.
ఇండియాలో ఊపందుకున్న ఈ మీ టూ ఉద్యమంలో పెద్ద చేపల ప్రసక్తే లేకపోవడాన్ని గమనించాలి. పెద్దహీరోలు, బడా నిర్మాతలు, ప్రస్తుతం స్టార్లుగా చలామణి అవుతున్న వాళ్లెవ్వరి మీదా ఇలాంటి మాటలు మోగడంలేదు. బాలీవుడ్‌లో చూసినా, దక్షిణాదిన చూసినా వృద్ధ రచయితలు, ముసలి నటుల మీద ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి కానీ.. ఊపుమీదున్న స్టార్ హీరోల మీద ఎవ్వరూ మాట్లాడటంలేదు.
ఇందుమూలంగా ఏం అర్థం చేసుకోవాలి?
స్టార్ హీరోలంతా మంచోళ్లా? వీళ్లు తమ ఇండస్ట్రీలో ఎవ్వరినీ వేధించలేదా? ఎవరితోనూ అనుచితంగా ప్రవర్తించలేదా? లేక ఇప్పుడు వీళ్ల మీద మాట్లాడటానికి ఎవరికీ సత్తా లేదా? అంటే.. స్టార్ హీరోల మీద ఏ హీరోయిన్ కూడా ఆరోపణలు చేయలేదు.. అనే అభిప్రాయమే వినిపిస్తూ ఉంది.
స్టార్ హీరోల వేధింపులు అంటే.. ఇప్పటికిప్పుడు చేస్తున్నవి కావు, ఈ హీరోలో ఏ దశాబ్దాల వెనుక ఎవరినైనా వేధించి ఉన్నా అవి బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదని విశ్లేషకులు అంటున్నారు. మీ టూ ఉద్యమం మహిళల్లో వచ్చిన ధైర్యానికి ఎంత నిదర్శనం అనుకున్నా… పవర్, మనీ ముందు ఇది కూడా నిలబడలేదు అని తేల్చి చెబుతున్నారు.
కేవలం బాలీవుడ్‌లో మీ టూ వరకేకాదు.. హాలీవుడ్‌లో ఈ వ్యవహారం నడిచిన తీరును గమనించినా.. అక్కడ కూడా ముసలీముతక వాళ్ల మీద ఆరోపణలు చేశారు కానీ… స్టార్లు, స్టార్ హీరోల మీద వరకూ ఇది వెళ్లలేదు. అయితే అక్కడ ముసలి నిర్మాతల తీరు గురించి హీరోయిన్లు చెప్పారు.
వాళ్లు తమతో అనుచితంగా ప్రవర్తించిన తీరు గురించి చెప్పారు. మరింత విశేషం ఏమిటంటే.. ఇక్కడ నానా పటేకర్ వంటి సీనియర్ కేరెక్టర్ ఆర్టిస్ట్, మంచి నటనా పటిమ ఉన్న నటుడు బుక్ అయినట్టుగా హాలీవుడ్ లో కూడా ఒక సీనియర్ కేరెక్టర్ ఆర్టిస్ట్ ఇరుక్కున్నాడు. అతడు కూడా ప్రపంచం మెచ్చిన నటుడే.
అతడే మోర్గన్ ఫ్రీమన్. ఈ నటుడి మీద చాలా ఆరోపణలు వచ్చాయి. ప్రతిభావంతుడైన నటుడే కానీ.. సెక్స్ వేధింపులకు గురి చేయడంలో అత్యంత నీఛుడు అంటూ అక్కడ కొంతమంది ఆడవాళ్లు ఆరోపించారు. నానాపటేకర్ విషయంలో కూడా ప్రతిభావంతమైన నటుడే కానీ.. నీఛుడు. అంటున్నారు.
అయితే అక్కడా ఇక్కడా స్టార్ హీరోల మీద మాత్రం ఏ హీరోయిన్ కూడా ధైర్యంగా మాట్లాడలేకపోయింది. ఇండస్ట్రీలో స్టార్ హీరోల వేధింపుల గురించి ఉన్న ప్రచారాలు ఏమీ కొదవ కాదు. దీనిగురించి సామాన్య జనాలను కదిలించినా.. తమకు తెలిసిన విషయాలను ఏవో చెబుతాయి.
ఇక ఇండస్ట్రీని దగ్గరగా గమనించే వ్యక్తులకు ఇలాంటి విషయాలు బోలెడన్ని తెలుస్తాయి. వీటిప్రకారం హీరోయిన్లు తీవ్రమైన వేధింపులను ఎదుర్కొంటున్నారు అనే అభిప్రాయం వినిపిస్తుంది. అయితే ఇప్పుడు కూడా అలాంటివేవీ బయటకు రావడం లేదు.
పెద్ద హీరోలపై మాట్లాడితే అంతే?
ఒకనొక పెద్ద హీరో.. బాలీవుడ్‌లో లీడింగ్‌లో ఉన్న ఏ హీరోయిన్‌నీ వదిలే టైపు కాదు. బ్రహ్మచారిగా గడిపేస్తూ ఉంటాడతను. బ్రహ్మచారి మాత్రమే.. వర్జిన్ కాదు సుమా. చాలా మంది హీరోలు, హీరోయిన్‌లు అతడి ముందు పడిపోతారు, బాలీవుడ్‌లో నెట్టుకురావాలంటే అతడి ఆశీస్సులు ఎంతో ఉపకరిస్తాయి. అందుకే చాలామంది అతడి దగ్గర కాంప్రమైజ్ అవుతారు.
అతడి దగ్గర తమకు ఛాన్స్ దక్కడమే లక్ అన్నట్టుగా వ్యవహరిస్తారు. అయితే ఒక హీరోయిన్ మాత్రం కాస్త తేడాగా వ్యవహరించింది. అతడి సినిమాలతో నిమిత్తం లేకుండా ఆ హీరోయిన్ లీడ్‌లోకి వచ్చేసింది. దీంతో హీరోగారు ఆమెను రమ్మన్నారు. ఆమె రాను అంది. హీరోకి కోపం వచ్చింది. ఆమెతో లైంగిక వాంఛలను నెరవేర్చుకోవాలనే కసి పెరిగింది.
అయితే పైకి బెదిరించి తెచ్చుకోలేడు కదా.. అందుకే వ్యూహాత్మకంగా తనకున్న అండర్ వరల్డ్ పరిచయాలను ఉపయోగించుకున్నాడు. ముంబై మాఫియాను అడ్డం పెట్టుకుని ఆమెను బెదిరించాడు. అతడి వద్దకు వెళ్తావా లేక యాసిడ్ పోసేసి నీ కెరీర్ క్లోజ్ చేయాలా? అనేంత స్థాయి బెదిరింపులు.
అప్పటికి ముంబైలో సినిమా వాళ్లపై అండర్ వరల్డ్ జనాలు చాలా ఈజీగా దాడులు చేసేయగలుగుతున్న రోజులవి. ఇక హీరోయిన్ కెరీర్ అప్పుడే పుంజుకుంటోంది. ఇక చేసేది లేక ఆమె ఆ హీరోకి లొంగిపోయింది. ఇదంతా పోలీసులకు కూడా తెలిసిన కథే.
బాలీవుడ్ జనాలకూ, అండర్ వరల్డ్‌కు ఉన్న పరిచయాల విషయంలో జరిగిన విచారణలో ఈ కథ కూడా వెలుగు చూసింది. పోలీసులు తమ నివేదికల్లో ఈ అంశాలను పెట్టారు కానీ.. వ్యక్తుల పేర్లను బయటపెట్టలేదు. మరి ఇలా వేధింపులను ఎదుర్కొన్న ఆ హీరోయిన్ ఇప్పటికీ లైమ్ లైట్‌లోనే ఉంది.
ఆ హీరో స్టార్‌గా చలామణి అవుతున్నాడు. మీ టూ అంటూ.. ఇప్పుడు ఇలాంటివి బయటకు పెట్టవచ్చు కదా. అంటే.. ఇవన్నీ సాధ్యంఅయ్యే అంశాలు కావని చెప్పాలి.
టాలీవుడ్‌లో అయినా అంతే..!
టాలీవుడ్, కోలీవుడ్‌లలో కూడా మీటూ క్యాంపెయిన్‌పై కొంతమంది స్పందిస్తున్నారు. అయితే ఇక్కడ కూడా ముసలైపోయిన వాళ్ల మీద ఆరోపణలను తెరపైకి తెస్తున్న వాళ్లు కొంతమంది అయితే, హీరోల పేర్లు చెప్పలేక తాము వేధింపులకు గురయ్యామని చెబుతున్న వాళ్లు మరి కొంతమంది. ఇంతకు మించి స్టార్ల మీద స్పందించే ఛాన్సులు లేనట్టే. అంటే స్టార్ హీరోలంతా పత్తిత్తులే! వాళ్ల మీద ఆరోపణలు రావడంలేదు కాబట్టి.. వాళ్లంతా మంచోళ్లే!
అయినా అభినందించాల్సిందే!
ఈ విషయంలో ఇప్పటి వరకూ స్పందించిన వాళ్లను మాత్రం కచ్చితంగా అభినందించాల్సిందే. పవర్ లెస్ జనాల మీద వీళ్లు ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నా.. కొంతమంది పాత ఆధారాలను కూడా చూపిస్తున్నారు. వీళ్లు కచ్చితంగా అభినందనీయులే. గోముఖ వ్యాఘ్రాలుగా చలమణి అవుతున్న కొంతమంది రూపాలు బయటకు వస్తున్నాయి.
చాలామంది చేత ఆరాధింపబడుతున్న వాళ్ల అసలు రూపం బయటకు వస్తోంది. కనీసం ఈ మాత్రం ధైర్యం చూపుతున్న అమ్మాయిలను, ఆడవాళ్లనూ అభినందించాల్సిందే. వీరి తెగువను మెచ్చుకోవాల్సిందే. ఈ ధైర్యం మరింతమందిలో రావాలని.. తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను ధైర్యంగా బయటపెట్టి.. చేతిలో ఫేమ్ పవర్ ఉంది కదా అని వేధించిన వాళ్ల ఆట కట్టించాలని ఆంకాంక్షిద్దాం.