జగన్ పై, జగన్ సర్కార్ పై విమర్శలు చేయమంటే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు ఎక్కడ లేని హుషారు వచ్చేస్తుంది. ఆఖరికి కరోనాతో బెడ్ పై రెస్ట్ తీసుకుంటున్న టైమ్ లో కూడా ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి పవన్ వెనకాడడం లేదు. అయితే ఈ ఉత్సాహంలో ముందువెనక ఆలోచించడం లేదు పవన్.
కనీసం తను చేస్తున్న విమర్శల్లో లాజిక్ ఉందా లేదా? ప్రభుత్వం ఎందుకిలాంటి నిర్ణయం తీసుకుందనే విషయాల్ని పవన్ ఓసారి ఆలోచించి విమర్శలు చేస్తే బాగుంటుంది.
ఏపీలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయంటూ ఇలా ప్రకటన వచ్చిందో లేదో అలా ట్విట్టర్ అందుకున్నారు పవన్. ఇష్టమొచ్చినట్టు విమర్శలు చేసి పడేశారు. అసలు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనక కారణం ఏంటనేది ఆయన ఆలోచించలేదు. పవన్ విమర్శలు, వాటి వెనక లాజిక్ ఎలా మిస్ అయ్యారనే విషయాన్ని వరుసగా చూద్దాం.
1. తెలంగాణకు లేని ఇబ్బంది ఏపీకి ఎందుకొచ్చింది?
పొరుగునే ఉన్న తెలంగాణ ప్రభుత్వం పరీక్షలు రద్దు చేసింది. మరి అదే పని ఏపీ సర్కార్ కూడా చేయొచ్చు కదా, ఎందుకు చేయడం లేదనేది పవన్ కల్యాణ్ ప్రశ్న. ఇక్కడ పవన్ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది.
పరీక్షలు నిర్వహించాలంటే మినిమం వర్కింగ్ డేస్ నిబంధన ఒకటి ఉంది. నిబంధన ప్రకారం ఒక విద్యాసంవత్సరంలో 160 వర్కింగ్ డేస్ పాఠాలు బోధించాలి. తెలంగాణలో అది జరగలేదు. ఏపీలో మాత్రం ఆ పనిదినాల్ని జాగ్రత్తగా పూర్తిచేయగలిగారు. అలా విద్యా సంవత్సరాన్ని, దాంతో పాటు సిలబస్ ను పూర్తిచేశారు కాబట్టే పరీక్షలు నిర్వహిస్తున్నారు.
2. పదో తరగతి పరీక్షలు నిర్వహించకపోతే మిలట్రీ ఉద్యోగాలు కోల్పోతారా?
పదో తరగతి పరీక్షలు నిర్వహించపోతే మిలట్రీ ఉద్యోగాలు కోల్పోతారనడం అర్థరహితం అంటూ ఆరోపణలు చేశారు పవన్. కానీ అదే పరీక్షల్లో గతేడాది గ్రేడింగ్స్ లేక చాలామంది ఔత్సాహితులు మిలట్రీలో ఉద్యోగాలు కోల్పోయారు.
ఇదే అంశాన్ని ఎత్తిచూపుతూ పరీక్షలు నిర్వహిస్తేనే మంచిదని పలు విద్యా సంఘాలు కూడా ప్రభుత్వాన్ని కోరాయి. అందుకే పదో తరగతి పరీక్షల విషయంలో ముందుకెళ్తోంది ప్రభుత్వం.
3. కేంద్రం కూడా పరీక్షలు రద్దు చేస్తే రాష్ట్రం ఎందుకు చేయదు?
సిలబస్ విషయంలో, పరీక్షల నిర్వహణ విషయంలో కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య ఉన్న తేడా అందరికీ తెలిసిందే.
స్టేట్ సిలబస్ లో చదివే విద్యార్థులు, సీబీఎస్ఈ సిలబస్ లో చదివే పిల్లలకు టోటల్ ఎకడమిక్ క్యాలెండరే డిఫరెంట్ గా ఉంటుంది. అలాంటప్పుడు దానికి, దీనికి లింక్ పెట్టి విమర్శలు చేయడం ఎంత వరకు సమంజసమో పవన్ కల్యాణే ఆలోచించుకోవాలి.
4. గతేడాది చేసిన తప్పుల్ని సరిదిద్దుకునేందుకే ఈసారి పరీక్షలు?
ఊరికే ఏదో ఒక విమర్శ చేయాలి కాబట్టి పవన్ ఈ ఆరోపణ చేసినట్టున్నారు. 2020లో పదో తరగతి విద్యార్థులకు ఇచ్చిన సర్టిఫికెట్లలో చిన్నచిన్న తప్పులు దొర్లినప్పటికీ.. దాన్ని మొత్తం ఆ విద్యా సంవత్సరంలో చదువుకున్న విద్యార్థులందరికీ ఆపాదించడం ఎంత వరకు కరెక్ట్. పోనీ.. పూర్తిస్థాయిలో తప్పులు జరిగాయని అనుకుందాం. అలాంటప్పుడు ఆ తప్పులకు, ఈసారి పరీక్షల నిర్వహణకు ఏంటి సంబంధమో పవన్ కే తెలియాలి.
మరోవైపు నిబంధనలు, జాగ్రత్తలు పాటిస్తూ చాలా రాష్ట్రాల్లో విద్యార్థులు ఇప్పటికే పరీక్షలు రాశారు. ఇంకా చెప్పాలంటే ఇదేం కొత్త విషయం కాదు. భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్ వేసుకొని, శానిటైజర్ పూసుకొని విద్యార్థులు పరీక్షలు రాయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చింది.
ఇవన్నీ పక్కనపెడితే.. పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలకు ఇంకాస్త టైమ్ ఉంది. షెడ్యూల్ ప్రకారం ప్రస్తుతానికి పరీక్షలు నిర్వహించడానికే మొగ్గుచూపుతున్నామని, అప్పటి పరిస్థితుల బట్టి మళ్లీ తమ నిర్ణయాన్ని పున:సమీక్షించుకుంటామని విద్యాశాఖ మంత్రి చెప్పకనే చెప్పారు. అయినప్పటికీ జనసేనాని 2 పేజీల ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ప్రభుత్వంపై తన అక్కసు చూపించుకున్నారు.