కేసీఆర్ కు కరోనా.. జగన్ నిర్ణయంపై ప్రశంసల వాన

సరిగ్గా వారం రోజుల కిందటి సంగతి. తిరుపతిలో జరగాల్సిన బహిరంగ సభకు తను హాజరు కావడం లేదని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఈ మేరకు ప్రజలకు బహిరంగ లేఖ రాసి మరీ సభకు హాజరవ్వకుండా…

సరిగ్గా వారం రోజుల కిందటి సంగతి. తిరుపతిలో జరగాల్సిన బహిరంగ సభకు తను హాజరు కావడం లేదని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఈ మేరకు ప్రజలకు బహిరంగ లేఖ రాసి మరీ సభకు హాజరవ్వకుండా నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో దీనిపై ప్రతిపక్షాలు, మరీ ముఖ్యంగా చంద్రబాబు చేసిన రాద్దాంతం అంతా ఇంతా కాదు. ఓటమి భయంతోనే జగన్, తిరుపతి రాలేదంటూ విమర్శలు చేశారు. దీనికి ఎల్లో మీడియా వత్తాసు పలికింది.

కట్ చేస్తే, అదే టైమ్ లో నాగార్జున సాగర్ లో బహిరంగ సభ నిర్వహించిన కేసీఆర్ ఇప్పుడు కరోనాతో బాధపడుతున్నారు. సాగర్ వెళ్లడం వల్లనే కేసీఆర్ కు కరోనా సోకిందని శాస్త్రీయంగా చెప్పలేం కానీ, ఆ సభ తర్వాతే కేసీఆర్ తో పాటు చాలామంది కరోనా బారిన పడిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. అంతేకాదు, ఆ సభ తర్వాతే సాగర్ ప్రాంతంలో పాజిటివ్ కేసులు పెరిగిన విషయం కూడా గమనించాలి. సో.. సాగర్ సభతోనే కేసీఆర్ కు కరోనా సోకిందనేది బహిరంగ రహస్యం.

తిరుపతి సభకు జగన్ వెళ్లినట్టయితే, సరిగ్గా సాగర్ లాంటి సన్నివేశమే తిరుపతిలో కూడా రిపీట్ అయి ఉండేది. అప్పుడు ఇదే చంద్రబాబు చాలా కన్వీనియంట్ గా మాట మార్చేసి, మరో విధంగా ఆరోపణలు అందుకునేవారు. కరోనా కేసులు పెరగడానికి జగనే కారణం అంటూ కొత్త పల్లవి ఎత్తుకునేవారు.

ఎవరు ఏమనుకున్నప్పటికీ, విశ్లేషణలు ఎలా ఉన్నప్పటికీ జగన్ మాత్రం ముందుచూపుతో వ్యవహారించారనే విషయం ఇప్పుడు అందరికీ అర్థమైంది. తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పటికీ, వయసులో చిన్నవాడు అయినప్పటికీ జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు అన్ని వర్గాల వారి ప్రశంసలు అందుకుంటోంది.

తిరుపతిలో జగన్ సభ పెడితే కచ్చితంగా పార్టీకి ప్లస్ అయ్యేది. మెజారిటీ మరింత పెరిగేది. కానీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్, ఆ టైమ్ లో తన పార్టీ గురించి ఆలోచించలేదు. ప్రజల క్షేమం గురించి ఆలోచించారు. అందుకే ధైర్యంగా సభను రద్దుచేశారు. ఇదే స్థానంలో కేసీఆర్ ఉన్నప్పటికీ అలాంటి నిర్ణయం తీసుకోలేదు.

తిరుపతి సభకు జగన్ వెళ్లకపోవడం కరోనా వ్యాప్తిని కాస్తయినా అడ్డుకున్నట్టయిందంటూ టీవీ చర్చావేదికల్లో, ఇతర సమాజిక మాధ్యమాల్లో నిపుణులు అభిప్రాయపడ్డారంటే, జగన్ ముందుచూపును అర్థంచేసుకోవచ్చు. కేసీఆర్ కు కరోనా వచ్చిన తర్వాతే, వారం కిందట జగన్ తీసుకున్న ఆ నిర్ణయం ఎంత గొప్పదో ఇప్పుడు అందరికీ తెలిసొస్తోంది.