కాటన్ దొర పరాయి దేశస్థుడు అయినా మన గోదావరి జలాలను సముద్రంలో కలవకుండా ఆనకట్ట కట్టి జీవనదిని పంట పొలాలను మళ్ళించిన అపర భగీరధుడు. ఇపుడు ఆ కాటన్ తో జగన్ని పోలుస్తున్నారు ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్. జగన్ రాష్ట్రంలో జనవనరుల ప్రాజెక్టుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని ధర్మాన కీర్తించారు.
శ్రీకాకుళం జిల్లాలో నేరడి ప్రాజెక్ట్ పూర్తి కోసం జగన్ తీసుకున్న చొరవను ఆయన మెచ్చుకున్నారు. మూడు దశాబ్దాలుగా నలుగుతున్న ఒక కీలక సమస్య విషయంలో ముందడుగు వేసిన జగన్ ఇందులో విజయం సాధిస్తారు అని కూడా అంటున్నారు.
వంశధార నదీజలాలు సముద్రంలో కలవకుండా నేరడి ప్రాజెక్ట్ కట్టినట్లు అయితే శ్రీకాకుళం జిల్లా అన్నపూర్ణ కావడం ఖాయమని ధర్మన అన్నారు.
ఒడిషా ప్రభుత్వంలో నేరుగా చర్చలు జరిపేందుకు కూడా జగన్ సిధ్ధపడడం ఆయన చిత్తశుద్ధిని సూచిస్తోందని అన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగానే నేరడి బ్యారెజ్ పూర్తి కావడం ఖాయమని కూడా ధర్మాన ధీమా వ్యక్తం చేస్తున్నారు.