ఉత్తరప్రదేశ్ లో పెద్ద జిల్లాలో ఒకటైన సోన్ భద్రా లో భారీ స్థాయి బంగారపు నిల్వలను గుర్తించినట్టుగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది. అక్కడ ఒక కొండ ప్రాంతంలో భారీగా బంగారు గనులున్నాయని తేల్చింది. ఆ బంగారపు గనిని తవ్వి తీయడానికి త్వరలోనే వేలం పాటను నిర్వహించనున్నట్టుగా ప్రకటించడం గమనార్హం. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంచనా ప్రకారం.. అక్కడ దాదాపు 3000 కిలోల బంగారం నిల్వలు ఉన్నాయి! మార్కెట్ ధర ప్రకారం దీని విలువ దాదాపు 12 లక్షల కోట్లు!
ప్రస్తుతం భారత దేశం వద్ద నిల్వ ఉన్న బంగారం మొత్తానికి సమానమైన స్థాయిలో సోన్ భద్ర వద్ద బంగార నిల్వలున్నాయని అంచనా. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం.. ఇండియా వద్ద ఉన్న మొత్తం బంగారం విలువ దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు. ఇప్పుడు సోన్ భద్రలో గుర్తించిన బంగారపు గనిలో కూడా దాదాపు అదే స్థాయి బంగారం ఉండటం గమనార్హం!
యూపీలో బాగా వెనుకబడిన జిల్లాల్లో సోన్ భద్రా కూడా ఒకటి. మొత్తం నాలుగు రాష్ట్రాలతో సోన్ భద్రా ప్రాంతం సరిహద్దును పంచుకుంటుంది. మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్, జార్ఖండ్, బిహార్ లతో సరిహద్దును పంచుకుంటుంది ఈ జిల్లా. ఇప్పుడు భారీ స్థాయి బంగారు గనుల గుర్తింపుతో వార్తల్లోకి వచ్చింది.