అల్లు అర్జున్ ఇకనైనా ఓకెనా?

మంచికో చెడుకో త్వరగా డెసిషన్ తీసుకోకపోవడం, డైరక్టర్లను మరీ ఏళ్ల తరబడి తమ క్యాంప్ లో కట్టేసి, అటు చూడాలంటే భయపడేలా చేయడం, ఆస్థానంలో స్క్రిప్ట్ తయారీకే ఏళ్లు పూళ్లు పట్టేలా చేయడం వంటి…

మంచికో చెడుకో త్వరగా డెసిషన్ తీసుకోకపోవడం, డైరక్టర్లను మరీ ఏళ్ల తరబడి తమ క్యాంప్ లో కట్టేసి, అటు చూడాలంటే భయపడేలా చేయడం, ఆస్థానంలో స్క్రిప్ట్ తయారీకే ఏళ్లు పూళ్లు పట్టేలా చేయడం వంటి సమస్యలతో బన్నీ అంటే చాలు డైరక్టర్లు కాస్త దూరంగా వుండేలా తయారయింది వ్యవహారం. పైగా ఏ సబ్జెక్ట్ చేయాలా? అంటూ కిందామీదా పడడం, పాటలు, డ్యాన్స్ లు, ఫైట్లు అన్నీ తనే డిజైన్ చేసుకోవడం ఇలాంటివి అన్నీ బన్నీని డైరక్టర్లకు దూరం చేస్తున్నాయి,.

నాపేరు సూర్య విడుదలై అయిదు నెలలు దాటేస్తోంది. ఇప్పటివరకు బన్నీ సినిమా కనీసం అనౌన్స్ మెంట్ లేదు. ఓ పక్క విక్రమ్ కుమార్ ను ఓ అడుగు ముందుకు, ఓ అడుగు వెనక్కు నడిపిస్తున్నారు. అతనికి వక్కంతం వంశీని జతచేసి, కథ వండిస్తున్నారు. ఓ ఒరలో రెండు కత్తులు ఇముడుతాయా? విక్రమ్ కు వంశీకి ఓ పాయింట్ దగ్గర మ్యాచ్ సెట్ అవుతుందా?

అది అలా వుంచి త్రివిక్రమ్ తో సినిమా చేయాలని బన్నీకి వుంది. ఇప్పుడు ఇటు త్రివిక్రమ్ కు కూడా అదే ఆప్షన్ తప్ప మరోటిలేదు. కానీ మళ్లీ ఇక్కడ సవాలక్ష సమస్యలు. బన్నీ పూర్తి ఫ్రీడమ్ త్రివిక్రమ్ కు ఇవ్వాలి. ఎన్టీఆర్ కాబట్టి, త్రివిక్రమ్ తను అనుకున్నట్లు అరవింద సమేత తీయగలిగాడు. అదే బన్నీ అయి వుంటే, మరో రెండుపాటలు, ఫైట్లు, నానా వ్యవహారాలు చేరివుండేవి. 

అలాగే నిర్మాతగా త్రివిక్రమ్ హారిక వాళ్లకే చేస్తారు. మరి అది బన్నీకి ఓకె కావాలి. ఎందుకంటే బన్నీ కమిట్ మెంట్ లు (అడ్వాన్స్ లు తీసుకోకపోయినా) వేరే వున్నాయి. అలాగే కేవలం బన్నీకి మాత్రమే నప్పితే సరిపోదు. ప్రతి వ్యవహారం అల్లు అరవింద్ కు కూడా నప్పాలి. 

ఇన్ని నప్పుళ్ల మధ్య త్రివిక్రమ్ తో బన్నీ సినిమా సెట్ అవుతుందా? ఇకనైనా బన్నీ కొత్త ఆఫీసు నుంచి సెట్ మీదకు వస్తారా? చూడాలి. ఏం జరుగుతుందో? ఇప్పటికే హీరోల రేసులో అందరికన్నా వెనుకబడిపోయాడు బన్నీ. మళ్లీ కనీసం కొంతయినా ముందుకు రావాలంటే, నిర్క్షయాలు త్వరగా తీసుకోవాల్సి వుంది.