ప్రభుత్వం నుంచి ఒక నిర్ణయం రావాలని ఆశిస్తోంటే.. ప్రభుత్వం మీద అందుకోసం ఒత్తిడి తేవాలని అనుకుంటే గనుక.. ప్రతిపక్ష నాయకులను ఆశ్రయించడం అనేది చాలామందికి ఒక అలవాటు. సాధారణ రాజకీయ నాయకుల వద్ద అలాంటి వ్యూహాలు చెల్లుబాటు అవుతాయేమో తెలియదు గానీ.. వ్యవహారాలను తాను స్వయంగా గమనిస్తూ, నిర్ణయాలను తాను స్వయంగా తీసుకునే ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి వద్ద అలాంటి టెక్నిక్కులు పనిచేయవు.
ఎవరికైనా ప్రభుత్వంతో సమస్య ఉంటే, నేరుగా సీఎంకే నివేదించుకోవచ్చు. విపక్షాల ద్వారా నరుక్కు వద్దాం అనుకునే వ్యూహాల కన్నా నేరుగా ముఖ్యమంత్రిని ఆశ్రయించడమే మంచిదని ప్రజలు తెలుసుకోవాలి.
కర్నూలు లో హత్యాచారానికి గురైన సుగాలి ప్రీతి కుటుంబం ఆవేదన, వారికి జరిగిన న్యాయమే ఇందుకు ఉదాహరణ! అదే తరహాలో.. పోలీసు కేసులు నమోదు అయిన అమరావతి ప్రాంత రైతులు కూడా వట్టి మాటల మట్టి గుర్రాలను నమ్ముకోకుండా.. ముఖ్యమంత్రికే తమ బాధ చెప్పుకుంటే చాలుననే వాదన కొందరిలో వినిపిస్తోంది.
అమరావతి పరిధిలో రెవెన్యూ అధికారులు ఎదుట నిరసనలు తెలియజేసిన అనేక మంది రైతులపై పోలీసు కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులను తక్షణం ఎత్తివేయాలంటూ జనసేనాని పవన్ కల్యాణ్ తన వంతుగా ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు కూడా.
నిజానికి సుగాలి ప్రీతి విషయంలోనూ పవన్ కేసును సీబీఐకు అప్పగించాలని డిమాండ్ చేశారు. అయితే అన్యాయానికి గురైన ఆ అమ్మాయి ఉదంతాన్ని తన రాజకీయ మైలేజీకి వాడుకోవాలని చూశారు. ఇలాంటి ట్రిక్స్ కు వెళ్లకుండా.. జగన్మోహన రెడ్డి తన కర్నూలు పర్యటనలో ప్రీతి కుటుంబాన్ని కలిసి.. కేసు సీబీఐకు ఇస్తామని తేల్చి చెప్పేశారు.
అమరావతి రైతులు కూడా.. కేసుల విషయంలో నేరుగా సీఎంకు విన్నవించుకోవడమే వారికి మేలు చేస్తుంది. జగన్ అధికార వింకేద్రీకరణను సంకల్పించారు. మూడు చోట్ల రాజధానులు ఏర్పాటు చేయదలచుకున్నారు. అందులో తేడాలేదు. ఆ విషయంలో ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విన్నపాలు చేయదలచుకుంటే.. ఆయన పట్టించుకోకపోవచ్చు గానీ.. ఆవేశంలో వ్యవహరించిన తీరుకు నమోదు అయిన కేసులను ఎత్తివేయాల్సిందిగా సానుకూల దృక్పథంతో విన్నవించుకుంటే ఫలితముంటుంది.
ప్రభుత్వ నిర్ణయాల్ని అమల్లోకి రానివ్వకుండా అడ్డుకునే తమ వైఖరి మీదనే అసంతృప్తి ఉంటుంది తప్ప… తమ మీద ముఖ్యమంత్రికి వ్యక్తిగతంగా కక్ష ఉండదని… అమరావతి ప్రాంత రైతులు తెలుసుకుంటే వారికే మంచిది!