.ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ డైరక్షన్ లో ఏనాడో ప్రారంభమైన సినిమా రాధేశ్వామ్. ఆది నుంచి అలా అలా ఆలస్యమవవుతూ వస్తోంది. ఇటలీలో లాస్ట్ ఇయర్ షూట్ అంటే అప్పుడే కరోనా వచ్చింది. ఆలస్యం అన్నది స్టార్ట్ అయింది. కరోనా తగ్గిన తరువాత ఏదో కిందా మీదా పడి అయిందనిపించారు. సిజి వర్క్ ఎక్కువ వుండడంతో ఆలస్యం అలా పెరుగుతూ వస్తోంది. విడుదల డేట్ ఇచ్చారు. ఫ్యాన్స్ ఆశగా చూస్తున్నారు.
ఈలోగా ప్రభాస్ కు నచ్చలేదని, రీ షూట్ లు అనీ వార్తలు వచ్చాయి. అబ్బే అదంతా అబద్దం, జస్ట్ ప్యాచ్ వర్క్, సాంగ్ ల్లాంటివి వున్నాయి అని సినిమా పీఆర్ టీమ్ చెప్పేసింది. సరే చిన్న ప్యాచ్ వర్క్, సాంగ్ ల్లాంటివేలే అనుకుంటే, ఇప్పుడు అవి కూడా వాయిదా పడ్డాయని బోగట్టా. దీనికి కారణం హీరోయిన్ షూటింగ్ కు నో అనడమే అని తెలుస్తోంది. పూజా హెగ్డే ఈ పరిస్థితుల్లో షూటింగ్ రావడానికి నిరాకరిస్తున్నట్లు బోగట్టా. అలాగే కృష్ణంరాజు ఎపిసోడ్ లు కొన్ని వున్నాయి. ఆయన వయసు రీత్యా కూడా ఇప్పుడు షూటింగ్ శ్రేయస్కరం కాదని ఆపేసారు.
సినిమా విడుదల జూలై నెలాఖరుకు. అందువల్ల పెద్దగా టెన్షన్ పడాల్సిన పని లేదు. కానీ సమస్య ఏమిటంటే మే, జూన్ ల్లో రావాల్సిన సినిమాలు అన్నీ వాయిదా పడుతున్నాయని వార్తలు అందుతున్నాయి. అంటే జూలై నుంచి విడుదలలు వుంటే కనుక మళ్లీ సినిమాలు అన్నీ క్యూ కడతాయి. అప్పుడు రాధేశ్యామ్ డేట్ కు ముందు, వెనుక, మీద ఎన్ని వచ్చి పడతాయో? చూడాలి. కరోనా వ్యవహారం జూన్ తో ముగిసిపోతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా కడుతున్నాయి. అలా అయితే ఫరవాలేదు. అలా కాకుండా మరొక్క నెల ముందుకు వెళ్తే చాలా కష్టం అయిపోతుంది.