చంద్రబాబు తనయుడు, టీడీపీ భావి నాయకుడు నారా లోకేశ్‌పై నోరు పారేసుకున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు … ఇప్పుడు ఆ యువ కిషోరాన్ని మంచి చేసుకునేందు నానా పాట్లు పడుతున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ఎర్రన్నాయుడి కుటుంబానికి మంచి ప్రజాదరణ ఉంది. అలాంటి కుటుంబానికి చెందిన అచ్చెన్నాయుడు ప్రస్తుతం లోకేశ్ ఆగ్రహం నుంచి తప్పించుకు నేందుకు, ఆయన ప్రాపకం కోసం మరీ దిగజారుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నారా లోకేశే సరైనోడైతే …పార్టీకి ఈ దుస్థితి ఎందుకొస్తుందనే ఆవేదన అచ్చెన్నాయుడు వెల్లగక్కిన విజువల్స్ ఇటీవల బయటపడడం తీవ్ర సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అచ్చెన్నపై చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ ఆగ్రహంగా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ముఖ్యంగా లోకేశ్ చల్లని చూపు కోసం …ఆయన తానా అంటే అచ్చెన్నాయుడు తందానా అనడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా లోకేశ్‌ను ఆదర్శంగా తీసుకున్న అచ్చెన్నాయుడు తన ప్రత్యర్థి పార్టీ వైసీపీ నేతలకు సవాల్ విసిరారు.
తిరుపతి ఉప ఎన్నికలో దొంగ ఓట్లు వేయలేదని తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రమాణం చేయడానికి సిద్ధమా? అని మంత్రులు, ఎమ్మెల్యేలకు అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. ఉప ఎన్నికలో దొంగ ఓట్లు వేయించడమే కాకుండా తమపై ఎదురు దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దొంగ ఓట్ల విషయంలో ఎన్నికల సంఘం ప్రేక్షక పాత్ర వహించడం దారుణమన్నారు. దొంగ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. వివేకా హత్యతతో తనకు, తన కుటుంబానికి సంబంధం లేదని ఇటీవల అలిపిరి వద్ద నారా లోకేశ్ ప్రమాణం చేసి హైడ్రామా క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ప్రమాణం చేయాలని లోకేశ్ డిమాండ్ చేసి అభాసుపాలైన సంగతి తెలిసిందే. లోకేశ్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వీడియో లీక్ అయినప్పటి నుంచి అచ్చెన్నాయుడు, దాని నుంచి దృష్టి మళ్లించేందుకు చేయని ప్రయత్నం లేదు.
ఇందులో భాగమే తాజా సవాల్ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తన రాజకీయ అనుభవమంత వయస్సు కూడా లేని లోకేశ్ దెబ్బకు తన కుటుంబ పేరు ప్రతిష్టలను మంటగలిపేలా అచ్చెన్న వ్యవహరిస్తున్నారని ఆయన శ్రేయోభిలాషులు వాపోతున్నారు.