దేశ రాజధాని ఢిల్లీని కరోనా మహమ్మారి మళ్లీ ఏడాది వెనక్కి పంపింది. కరోనా సెకండ్ వేవ్ దూకుడు పెంచింది. మరీ ముఖ్యంగా ఢిల్లీలో అనూహ్యంగా కేసులు పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కాసేపటి క్రితం కీలక ప్రకటన చేశారు.
ఢిల్లీలో ఆరురోజుల పాటు పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. నేటి రాత్రి 10 గంటల నుంచి వచ్చే సోమవారం ఉదయం 5 గంటల వరకూ లాక్డౌన్ అమల్లో ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ కరోనా రెండో దశ దూకుడుపై ఆందోళన వ్యక్తం చేశారు.
తాను లాక్డౌన్కు వ్యతిరేకమని, అయితే పరిస్థితి అదుపు తప్పు తుండడంతో కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదన్నారు. ఢిల్లీలో గత నాలుగు రోజులుగా రోజుకు దాదాపు 25 వేల కేసులు నమోదు అవుతున్నాయన్నారు. కరోనా పాజిటివిటీ రేటు, ఇన్ఫెక్షన్లు భారీగా పెరుగుతు న్నాయన్నారు.
రోజుకు లక్ష మందికి కరోనా పరీక్షలు చేస్తున్నామన్నారు. కరోనాకు సంబంధించి ప్రతిదీ పారదర్శకంగా ఉన్నామన్నారు. రోగులకు తగినంతగా బెడ్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజూ ఇదే స్థాయిలో రోగులు వస్తే మాత్రం వ్యవస్థ ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. లాక్డౌన్ కాలంలో ఆక్సిజన్, మందులు సమకూర్చే ఏర్పాట్లు చేస్తామన్నారు. విపత్కర సమయంలో సాయం చేస్తున్నందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.
లాక్డౌన్ సమయంలో వలస కూలీలు ఢిల్లీలోనే ఉండాలని చేతులెత్తి దండం పెడుతూ అభ్యర్థించారు. ఇది కేవలం ఆరు రోజుల పాటు మాత్రమే కొనసాగే లాక్డౌన్గా ఆయన చెప్పుకొచ్చారు. వలస కూలీలను తమ ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకుంటుందని తెలిపారు.
లాక్డౌన్లో భాగంగా నిత్యావసరాలు, ఆహార సంబంధిత, వైద్యం సహా ఇతర అత్యవసర సేవలు కొనసాగుతాయని కేజ్రీవాల్ తెలిపారు. కేవలం 50 మందితో మాత్రమే పెళ్లిళ్లు జరుపుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కోరారు. పెళ్లిళ్లకు ప్రత్యేకంగా పాసులు జారీ చేస్తామని ప్రకటించారు.