ప్ర‌జ‌ల ప్రాణాలు గాల్లో…చ‌ర్య‌లెన్న‌డు?

క‌రోనా నియంత్ర‌ణ‌కు సంబంధించి కేసీఆర్ స‌ర్కార్‌పై తెలంగాణ హైకోర్టు మ‌రోసారి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డింది. మీకు ఆదా య‌మే ముఖ్య‌మా? అని నిల‌దీసింది. క‌రోనా నియంత్ర‌ణ విష‌యంలో తెలంగాణ స‌ర్కార్ చేతులెత్తేసింద‌ని గ‌తంలోనే హైకోర్టు తీవ్ర…

క‌రోనా నియంత్ర‌ణ‌కు సంబంధించి కేసీఆర్ స‌ర్కార్‌పై తెలంగాణ హైకోర్టు మ‌రోసారి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డింది. మీకు ఆదా య‌మే ముఖ్య‌మా? అని నిల‌దీసింది. క‌రోనా నియంత్ర‌ణ విష‌యంలో తెలంగాణ స‌ర్కార్ చేతులెత్తేసింద‌ని గ‌తంలోనే హైకోర్టు తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.  

సినిమా హాళ్లు, ప‌బ్బులు, బార్ల‌లో ర‌ద్దీ త‌గ్గించేందుకు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటున్నారో తెలియ‌జేయాల‌ని ఇటీవ‌ల ప్ర‌భుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో నేడు మ‌రోసారి విచార‌ణ‌కు వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ప్ర‌భుత్వంపై హైకోర్టు అస‌హ‌నంతో పాటు ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. 

క‌రోనా క‌ట్ట‌డికి హైకోర్టుకు సమర్పించిన నివేదికలో కనీస వివరాలు లేకపోవడంతో న్యాయస్థానం మండిప‌డింది. ‘పబ్బులు, మద్యం దుకాణాలపై చర్యలు ఏమయ్యాయి? మీకు ఆదాయమే ముఖ్యమా?’ అని ప్రభుత్వాన్ని కోర్టు గ‌ట్టిగా నిల‌దీసింది. 

జిల్లా అధికారులు ఇచ్చే కరోనా కేసుల రిపోర్టులకు, ప్రభుత్వం ఇచ్చే పూర్తి రిపోర్టులకు చాలా తేడా ఉందంటూ హైకోర్టు సీరియ‌స్ అయ్యింది. అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ జోక్యం చేసుకుంటూ ప్ర‌జా ర‌ద్దీ నియంత్ర‌ణ‌కు త్వ‌ర‌లో నిర్ణ‌యం తీసుకుంటామ‌ని స‌మాధానం ఇచ్చారు.

ఏజీ ఆన్స‌ర్‌తో హైకోర్టు మ‌రింత ఆగ్ర‌హానికి గురైంది. ప‌క్క‌ రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కరోనా టెస్టులు ఎందుకు చేయలేని ప్ర‌శ్నించింది. ప్రజల ప్రాణాలు గాల్లో తేలాడుతుంటే ఇంకెప్పుడు నిర్ణయాలు తీసుకుంటార‌ని తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. 

ఒక ద‌శ‌లో అసలు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందా? లేదా ఆదేశాలు ఇవ్వమంటరా? అని నిల‌దీసే ప‌రిస్థితి చోటు చేసుకుంది. ఈ నేప‌థ్యంలో అసలు క‌రోనా క‌ట్ట‌డికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో స‌మ‌గ్ర నివేదికను మ‌ధ్యాహ్నానికి స‌మ‌ర్పించాల‌ని హైకోర్టు ఆదేశించ‌డం గ‌మ‌నార్హం.