అసెంబ్లీ, లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఈవీఎంల మీద నింద మోపారు. ఈవీఎంలను ట్యాంపర్ చేశారంటూ ఎన్నికల ముందు గట్టిగా మాట్లాడారు. ఎన్నికలను ఈవీఎంల మీద కాకుండా బ్యాలెట్ల మీద నిర్వహించాలంటూ డిమాండ్ చేశారు.
అలాంటి ఈవీఎంల మీద జరిగినప్పుడే 2014లో తన పార్టీ ఎన్నికల్లో నెగ్గినా.. 2019 సమయానికి ఈవీఎం లపై నిందలేశారు తెలుగుదేశం అధినేత. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చాకా.. మోడీ ఢిల్లీలో పీఠం ఎక్కాకా మాత్రం చంద్రబాబు నాయుడు కిక్కురుమనలేదు. ఈవీఎంలను ట్యాంపర్ చేశారనే ఆరోపణను గట్టిగా చేయలేకపోయారు. అలా అంటే ఎక్కడ తీసుకెళ్లి లోపలేస్తారో అనే భయం కావొచ్చు!
ఇక పంచాయతీ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ల మీదే జరిగాయి. అయితే అవి పార్టీల గుర్తుల మీద జరగలేదు. కానీ పార్టీ మద్దతుదార్లు అనే క్లారిటీ మాత్రం ప్రజలకు ఉంది. ఎవరు ఏ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారనే అంశంపై వాళ్లకు స్పష్టత ఉంది. కొంత మేర వ్యక్తులను బట్టి పంచాయతీల్లో ఓట్లు పడటం సహజమే కానీ.. పార్టీలపై ప్రజల ధోరణి కూడా పంచాయతీ ఎన్నికల్లో చాలా వరకూ వ్యక్తం అవుతుంది.
ఇక ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలు పంచాయతీ ఎన్నికల్లో తమది పై చేయి అని చెప్పుకున్నాయి. ఆఖరికి పవన్ కల్యాణ్ కూడా వచ్చి తమ వాళ్లు 27 శాతం పంచాయతీల్లో నెగ్గారంటూ చెప్పుకుని కామెడీ చేశారు! చంద్రబాబేమో దాదాపు 40 శాతం అంటూ లెక్కలేశారు, తనేం తక్కువ కాదన్నట్టుగా పవన్ కల్యాణ్ 27 శాతమట! ఇలా తమది అఖండ విజయమని వీరిద్దరూ చెప్పుకున్నారు. అధికార పార్టీ 80 శాతం తమవే అని ప్రకటించేసింది. ఈ విషయంలో ఎవరి వాదనలు వారికున్నాయి.
కట్ చేస్తే.. ఆ ప్రకటనలకు కాలం చెల్లిపోయేలా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవి పార్టీల గుర్తుల మీద జరుగుతున్నాయి. అందునా బ్యాలెట్ పేపర్లపై ఎన్నికలు జరుగుతున్నాయి. ఫలితాల్లో తేడా వస్తే.. ఎవ్వరూ దేన్నీ నిందించలేరు! తాము ఎన్ని స్థానాల్లో గెలిచిందీ ప్రత్యేకంగా నేతలు ప్రకటించనక్కర్లేదు. ఆ విషయాన్ని ఎన్నికల నిర్వహణ సంస్థే ప్రకటిస్తుంది. అలాగే ఓడిపోయాకా ఈవీఎంలను నిందించేసి తప్పించుకోవడానికీ ఇప్పుడు కుదరదు ఎవరికీ. ఎందుకంటే.. ఇవి పక్కా బ్యాలెట్ లెక్కలతో తేలే ఫలితాలు.
ఒకే ఒక విషయం ఏమిటంటే.. ఇది పూర్తిగా పట్టణాల్లో ఉండే ప్రజలు ఇచ్చే తీర్పు. ప్రభుత్వాలపై పల్లె ప్రజల ధోరణికి, పట్టణ ప్రజల ధోరణికి కొంత తేడా ఉంటుంది. అది కూడా స్వల్పమైనదే. ఏతావాతా.. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన రెండేళ్ల తర్వాత ఏపీ రాజకీయంలో ఎవరి సత్తా ఏమిటో మున్సిపల్-కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియతో తేలనుంది.