సరిగ్గా ఏడాది కిందట అర్ధాంతరంగా ఆగిన ఏపీ మున్సిపల్ ఎన్నిక ఎట్టకేలకూ పోలింగ్ వరకూ వచ్చింది. కరోనా అవాంతరం, ఆ తర్వాతి బోలెడన్ని వివాదాలతో వాయిదా పడుతూ వచ్చి, అసలు ఇప్పట్లో జరుగుతాయా? అనే సందేహాలను జనింపజేసిన ఈ ఎన్నికలకు నేడు పోలింగ్ జరుగుతూ ఉంది.
ఏపీలోని మున్సిపాలిటీలకూ, కార్పొరేషన్లకు పోలింగ్ ప్రక్రియ జోరందుకుంది. బ్యాలెట్ పేపర్ల మీద జరుగుతున్న పోలింగ్ ఈ రోజు సాయంత్రం ఐదు వరకూ జరగనుంది. పుర ప్రజలు, ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు.
విశేషం ఏమిటంటే.. ఈ ఎన్నికల ప్రక్రియను ఆపాలంటూ నిన్నటి వరకూ కూడా కోర్టులో పిటిషన్లు, విచారణలు జరిగాయి. ప్రత్యేకించి ఆగిన చోట నుంచినే ఈ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించడంపై విపక్షాలు అభ్యంతరాలు చెప్పాయి. అయితే కోర్టుకు గతంలో చెప్పిన దాన్ని బట్టి.. ఏపీ ఎస్ఈసీ ఆగిన చోట నుంచినే ఈ ఎన్నికల ప్రక్రియను కొనసాగించక తప్పలేదు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
బోలెడన్ని అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో.. వాటి విచారణ నిన్నటి వరకూ సాగింది. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ను రద్దు చేయాలన్న పిటిషన్లను ఇప్పటికే కొన్నింటిని కోర్టు కొట్టి వేసింది. నిన్న కూడా కొన్ని పిటిషన్లను కొట్టి వేయడంతో.. ఎన్నికల ప్రక్రియకు న్యాయస్థానం నుంచి ఎలాంటి ఆటంకాలూ లేకుండా పోయాయి.
ఇక కరోనా భయాల నేపథ్యంలో.. టౌన్లలో ఎంత మేరకు ఓటర్లు క్యూలు కడతారు? అనేది ప్రశ్నార్థకమే. పల్లె ప్రజలు పంచాయతీ ఎన్నికల్లో ఉత్సాహంగా ఓటేశారు. అయితే పట్టణ ప్రజల తీరు మరోలా ఉంటుంది. పంచాయతీ ఎన్నికల్లో 80 శాతానికి మించి పోలింగ్ నమోదు అయ్యింది.
పంచాయతీ ఎన్నికలను పోటీ చేసే వారు, వారి మద్దతుదార్లు ప్రతిష్టగా భావిస్తారు కాబట్టి.. అక్కడ సహజంగానే పోలింగ్ శాతం మెరుగ్గా నమోదవుతుంది. మరి పుర ప్రజలకు పట్టణ పాలక మండళ్లను ఎన్నుకోవడంపై ఏ మేరకు ఆసక్తి ఉందనేది నేటి సాయంత్రానికి క్లారిటీ వస్తుంది.