నా పేరు: కమల్ హాసన్
దరఖాస్తు చేయు ఉద్యోగం: కింగ్ మేకర్ ( నా పార్టీ మక్కల్ నీధి మయ్యమ్ (ఎంఎన్‌ఎం) గురించి నాకు తెలుసు కదా! ఎన్నికలయ్యాక మా పార్టీ ఎక్కడ వుందీ, అంటే 'టార్చి లైట్' వేసి చూడాలి. మార్టీ గుర్తు అదే లెండి. అలా నన్ను వెతుక్కుంటూ వస్తారు.)
వయసు: తమిళంలో ఎంత వయసొచ్చిన హీరోలు హీరోలే. యంగ్ హీరోలూ, వోల్డ్ హీరోలూ అంటూ వుండరు. మేకప్ లేకుండా కనిపించినా యంగే అనుకుంటారు. ఏం చెయ్యం?
ముద్దు పేర్లు: 'కమల' హాసన్ ( బీజేపీ బీ పార్టీ అంటున్నారు లెండి! కానీ నిజం కాదు.) దశావతారం (సినిమా పేరు. ఒక్కొక్క అవతారం ఎత్తుకుంటూ పోయాక, పదవ అవతారంలో ముఖ్యమంత్రిని కావచ్చు. మొదటి అవతారంలో మూడున్నరశాతం పైగా వోట్లు వచ్చాయి. ఇప్పుడు రెండవ అవతారం ఎత్తుతున్నాను. ఇంకాస్త పెరగవచ్చు. ఇదీ నా లెక్క.)
విద్యార్హతలు: నేనే పాఠ్యాంశంగా మారాక కూడా, నే చదువుగురించి అడుగుతారా? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడుే్యకషన్ (సీబీఎస్‌సి)లో 'ఫ్రమ్ బస్ కండక్టర్ టూ సూపర్ స్టార్' అంటూ నా మీద పాఠం పెట్టారు. ఇంకా 'ఛాయ్‌వాలా టూ ప్రైమ్ మినిస్టర్' మీద మోడీజీ మీద ఇంకా పాఠం రావాల్సి వుంది.
విలాసం: నన్ను కలవటానికా? తమిళ నాడులో ఎక్కడ వుంటారో చెప్పండి. నేనే మోర్నింగ్ వాక్ చేసుకుంటూ వచ్చేస్తాను. అన్ని రకాల మత్తులు దిగిపోయాక వోటర్లను కలవటానికి అదే తగిన సమయం.
గుర్తింపు చిహ్నాలు: ఒకటి: నాయకుడు. ఈ పాత్ర సినిమాలో చేస్తే అదరి పోయింది. నిజజీవితంలో చేస్తే అంత రెస్పాస్స్ రాలేదు. సహజనటన తెర మీద తప్ప జీవితంలో పనికి రాదన్నమాట.
రెండు: ప్రాబ్లెమ్మేమిటంటే నన్ను క్లాస్ అంటున్నారు. నేను మాస్ అని ఎలా చెప్పేదీ? నేను రౌడీ పాత్ర వేసినా నాజూకయిన రౌడిలా కనిపిస్తానే? ఎలా?
సిధ్ధాంతం: ఎక్కడా 'ద్రావిడ' శబ్దం పార్టీలో కానీ, పేరులోకానీ రాకుండా జాగ్రత్త పడ్డాను. అలాగని బీజేపీ కి బీ పార్టీ అనుకునేరు. నేను నాస్తికుణ్ణి. దేవుణ్ణి నమ్మను. వాళ్లు మాత్రం నమ్ముతారా ఏమిటి? నమ్మితే దేవుడి పేరు మీద రాజకీయాలెందుకు చేస్తారు?
వృత్తి: కలెక్షన్లు వచ్చినా రాకపోయినా, మంచి టాక్ వస్తుంది నా సినిమాలకు. అలాగే నేనూ నటిస్తాను. రాజకీయాల్లో కూడా అదే రిపీట్ అయ్యేటట్లుగా వుంది.
హాబీలు: 1. పవన్ కూ నాకూ వ్యక్తిగత జీవితంలో పోలికలు వుండవచ్చు. కానీ పార్టీ విషయంలో ఒకే నిర్ణయం వుంటుంది. పొత్తులు మార్చను.
2. బస్తీలోకి వెళ్ళి గంభీరమైన విషయాలు మాట్లాడతాను.
అనుభవం: నా అనుభవం రజనీ కాంత్ కు పనికి వచ్చింది. నా లో తనని చూసుకున్నాడు. కాబట్టే తప్పుకున్నాడు. రజనీ అనుభవం నా కెలా పనికి వస్తుందా? అని ఆలోచిస్తున్నాను. ఫలితాలు వచ్చాక చూడాలి.
మిత్రులు: పొత్తులే లేవంటే మిత్రులెలా వుంటారు. కాకుంటే నా వల్ల వోట్లు చీలుతుంటే సంతోషిస్తారే… వాళ్లే నా మిత్రులు.
శత్రువులు: జనానికి ఉద్యోగాలు కాకుండా, ఉచితాలు ఇచ్చేవారు.
మిత్రశత్రువులు: నా సినిమా చూసి 'మహానటుణ్న'ని మెచ్చుకుని, నా రాజకీయాలు చూసి 'సగటు నేత' అని పెదవి విరిచే వారు.
జీవిత ధ్యేయం: తొంభయ్యవ్వ యేటయినా సరే తమిళ నాడు ముఖ్యమంత్రి కావాలని.
సతీష్ చందర్