మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు గజగజ వణికిపోతున్నారు. మంత్రి పెద్దిరెడ్డి పేరు ప్రస్తావించి విమర్శించడానికి బాబు సొంత జిల్లా టీడీపీ నేతలకు ధైర్యం లేదు. ఈ విషయం మరోసారి రుజువైంది. చిత్తూరు జిల్లా పుంగనూరు, అన్నమయ్య జిల్లా అంగళ్లులో చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు దాడికి దిగడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. కృష్ణా , కడప, శ్రీకాకుళం, నెల్లూరు, విశాఖ, విజయనగరం తదితర జిల్లాల్లో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు.
కానీ చంద్రబాబు సొంత గడ్డ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాత్రం అలాంటివి మచ్చుకైనా లేవు. దీనికి కారణం పెద్దిరెడ్డితో టీడీపీ నాయకుల వ్యాపార సంబంధాలే అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉదాహరణకు తిరుపతిలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని తిరుపతి ఏకైక కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ తదితర చోటా నాయకులు నిర్వహించారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జ్ సుగుణమ్మ అడ్రస్ లేరు.
ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంట్లో మనుషుల్లా సుగుణమ్మ, ఆమె అల్లుడు సంజయ్ వ్యవహరిస్తుంటారని తిరుపతి టీడీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. అంతెందుకు చంద్రగిరి టీడీపీ ఇన్‌చార్జ్ పులివర్తి నాని నోరెత్తితో ఒట్టు. చంద్రబాబును మోసే ఎల్లో మీడియాలో పుంగనూరు ఘటనను నిరసిస్తూ పలువురు నాయకుల అభిప్రాయాలను అచ్చోశారు.
ఇందులో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఏ ఒక్క నాయకుడి అభిప్రాయం లేకపోవడం వెనుక పెద్దిరెడ్డి అంటే భయం, భక్తి లేవని ఎవరైనా అనగలరా? చంద్రబాబుతో రాజకీయ, పెద్దిరెడ్డితో వ్యాపార సంబంధాల వల్లే చిత్తూరు జిల్లాలో టీడీపీ భూస్థాపితం అయ్యిందనేది వాస్తవం.