మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి మొదటి నుంచీ భయమే. ఇద్దరూ ఎస్వీ యూనివర్సిటీ వేదికగా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ వాళ్లిద్దరి మధ్య వార్ కొనసాగుతోంది. ఎస్వీ యూనివర్సిటీలో పెద్దిరెడ్డి కంటే చంద్రబాబు ఏడాది సీనియర్ విద్యార్థి. బాబు ఎకనామిక్స్ , పెద్దిరెడ్డి సోషియాలజీ విద్యార్థులు.
అప్పట్లో కామర్స్, ఎకనామిక్స్ డిపార్టమెంట్లలో చంద్రబాబు సామాజిక వర్గ ప్రొఫెసర్లదే ఆధిపత్యం. అందుకే ఆ విభాగాల్లో ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం విద్యార్థులు చేరేవారు కాదు. ఒకవేళ చేరినా పాస్ చేయరనో, మార్కులు సరిగా వేయరనో భయాలుండేవి. బహుశా ఆ కారణంగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా సోషియాలజీ సబ్జెక్ట్‌ను ఎంచుకున్నారని ఆయన మిత్రులు చెబుతారు.
ఎస్వీయూ చైర్మన్‌గా చంద్రబాబు కాలేకపోయారు. 1974లో కేవలం ఎకనామిక్స్ విభాగం చైర్మన్ పదవితోనే చంద్రబాబు సరిపెట్టుకున్నారు. కానీ ఆ ఏడాది కేవీ రమణారెడ్డి ఎస్వీయూ చైర్మన్‌గా గెలుపొందారు. ఎస్వీయూలో కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల మధ్య ఆధిపత్య పోరు సాగేది. రెడ్డి సామాజిక వర్గానికి సీహెచ్ శివారెడ్డి (హైకోర్టు లాయర్), చంద్రశేఖరరెడ్డి (మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డి తమ్ముడు) బలమైన పునాదులు వేశారు. వర్సిటీ ఎన్నికల్లో రెడ్ల ఆధిపత్యాన్ని పెద్దిరెడ్డి కొనసాగించారు.
1975లో ఎస్వీయూ చైర్మన్‌గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికయ్యారు. ఆ ఏడాది చంద్రబాబు ఎస్వీయూలో రీసెర్చ్ స్కాలర్‌గా జాయిన్ అయ్యారు. ఆ తర్వాత చంద్రగిరి నుంచి కాంగ్రెస్ (ఐ) తరపున చంద్రబాబు తన సమీప ప్రత్యర్థి, జనతా పార్టీ అభ్యర్థి కె.పట్టాభిరామ చౌదరిపై గెలుపొందారు. ఇదే ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీలేరులో జనతాపార్టీ తరపున బరిలో నిలిచి కాంగ్రెస్(ఐ) అభ్యర్థి సైపుల్లాబేగ్ చేతిలో ఓడిపోయారు.
చంద్రబాబుకు మొదట్లో రాజకీయ గురువు మాజీ మంత్రి గల్లా అరుణకుమారి తండ్రి రాజగోపాల్‌నాయుడు. పెద్దిరెడ్డికి మాజీ రాష్ట్రపతి, దివంగత నీలం సంజీవరెడ్డి. అప్పట్లో ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో నంద్యాల నుంచి నీలం సంజీవరెడ్డి జనతా పార్టీ తరపున పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో నీలం సంజీవరెడ్డి తరపున పెద్దిరెడ్డి నేతృత్వంలోని ఎస్వీయూ విద్యార్థులు చురుగ్గా పని చేశారు. దక్షణాదిలో గెలిచిన ఏకైక ఎంపీగా నీలం రికార్డుకెక్కారు. తన కోసం విద్యార్థి నాయకుడిగా పని చేసిన పెద్దిరెడ్డిపై నీలం సంజీవరెడ్డికి ప్రత్యేక అభిమానం వుండేది.
అందుకే విద్యార్థిగా ఉండగానే పెద్దిరెడ్డికి జనతా పార్టీ టికెట్‌ను నీలం సంజీవరెడ్డి ఇప్పించారనే ప్రచారం ఉంది. చంద్రబాబునాయుడిలో లౌక్యం ఎక్కువే. రాజకీయాలకు తగ్గట్టు నటనలో ఆయనదో ప్రత్యేక శైలి. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమోషనల్ పర్సనల్. నమ్మిన వారి కోసం ఎందాకైనా అంటారు. తేడా వస్తే, అంతు చూసే వరకూ వదిలిపెట్టరు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సోదరుడు భాస్కర్‌రెడ్డి రాజకీయంగా బలమైన అండ. ఆ తర్వాత కాలంలో అతను భౌతికంగా దూరం కావడం పెద్దిరెడ్డికి పెద్ద లోటే.
చదువుకునే రోజుల్లో పెద్దిరెడ్డి, చంద్రబాబు మధ్య ఏర్పడిన రాజకీయ వైరం ఇప్పటికీ సాగుతోంది. తాజాగా పుంగనూరులో చంద్రబాబును అడుగు పెట్టకుండా పెద్దిరెడ్డి అడ్డుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే బాబు పర్యటనలో లేని విధంగా రెచ్చ గొట్టేందుకు పుంగునూరుకు వెళ్లాలని చంద్రబాబు పంతం పట్టారని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే పెద్దిరెడ్డి అంటే తండ్రితనయులు చంద్రబాబు, లోకేశ్‌లకు భయం అని చెప్పేందుకు ఉదాహరణలున్నాయి.
లోకేశ్ పాదయాత్ర కూడా పుంగనూరులో సాగకపోవడాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. పుంగనూరు పక్కన తప్పించుకు తిరిగినట్టు లోకేశ్ వెళ్లిపోయారు. ఆ తర్వాత పక్క నియోజకవర్గాల్లో లోకేశ్ మాట్లాడుతూ పెద్దిరెడ్డి అంతు చూస్తామని హెచ్చరించారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అంతే. చిత్తూరుకు వెళుతూ మార్గమధ్యంలో పుంగనూరు బైపాస్‌ను టచ్ చేస్తారని మాత్రమే బాబు షెడ్యూల్లో వుంది. నిజంగా పుంగనూరు వెళ్ల గలిగే ధైర్యమే బాబులో వుంటే, షెడ్యూల్లోనే పెట్టి వుండేవారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అడ్డా పులివెందులకు వెళ్లగలిగినప్పుడు పుంగనూరు ఏం పాపం చేసిందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ఏయ్ పెద్దిరెడ్డి ఖబడ్దార్ లాంటి హెచ్చరికలు ఇప్పటికి చంద్రబాబు బోలెడు చేశారు. బాబు వార్నింగ్‌లకే పరిమితమైతే, పెద్దిరెడ్డి మాత్రమే యాక్షన్‌కు దిగుతున్నారు. పెద్దిరెడ్డి పెద్దగా మాట్లాడరు. ఉపన్యాసాలంటే ఆయనకు విసుగు. ఆయన చేతల మనిషే. పెద్దిరెడ్డి చర్యలను సమర్థించాల్సిన పనిలేదు. కానీ ఆయన వ్యవహార శైలి గురించి తప్పక చర్చించుకోవాలి.
పెద్దిరెడ్డి , చంద్రబాబు …. ఇద్దరూ చిత్తూరు జిల్లా నాయకులే. ఒకరి గురించి మరొకరికి బాగా తెలుసు. బాబు వార్నింగ్‌లతో భయపెట్టాలని చూస్తారు. పెద్దిరెడ్డి ముందు ఆ పప్పులేవీ వుడకకపోగా, మరింతగా రెచ్చిపోతున్నారు. ఇదే చంద్రబాబుకు అసలు నచ్చడం లేదు. ఇప్పుడు ఏకంగా కుప్పంపై పెద్దిరెడ్డి దృష్టి సారించడం చంద్రబాబు జీర్ణించుకోలేక పోతున్నారు.