చంద్రబాబు నాయుడు నలభయ్యేళ్ల రాజకీయ అనుభవం అనేది ఆయన రికార్డుల్లో మాత్రమే మిగిలిపోయింది. అంతే తప్ప ఆ అనుభవసారం ఆయన బుర్రలో మాత్రం మిగిలినట్లు లేదు. ఆయనలోని వ్యూహ చాతుర్యాలు, రాజకీయ ఎత్తుగడల నైపుణ్యాలు అన్నీ మంటగలిసిపోయినట్లుగా ఉంది…! ఇప్పుడు ఆయన అచ్చంగా జగన్మోహనరెడ్డి వేసిన అడుగులనే కాపీ కొట్టడానికి చేస్తున్న ప్రయత్నం చూస్తోంటే అలాగే అనిపిస్తుంది. తాజాగా ఆయన జగన్మోహన రెడ్డి ‘ఓదార్పు యాత్ర’ను కూడా కాపీ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
చంద్రబాబు.. ప్రజా చైతన్య యాత్రలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అధికారం వీడిపోయి.. జగన్ ప్రజాభిమానాన్ని శాశ్వతంగా చూరగొనే దిశగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుండేసరికి చంద్రబాబుకు కంగారుపుట్టింది. కేవలం 9 నెలలు కూడా ఆయన ఆగలేకపోతున్నారు. అప్పుడే జగన్ 9 నెలల జగన్ పాలనను తూకం వేయడానికి ఆయన రాష్ట్రమంతా యాత్ర చేయడానికి బయల్దేరారు. ప్రభుత్వ వైఫల్యాలను ఆయన ప్రజల ఎదుట ఎండగడతారట. అదంతా ఓకే!
కానీ ఇందులో భాగంగా ఆయన జగన్ ‘ఓదార్పు యాత్ర’ను కూడా కాపీ కొడుతున్నారు. పింఛను అందక గుండె ఆగిన కుటుంబాలను ఆయన ఈ చైతన యాత్రలో పరామర్శిస్తారట. ఆత్మహత్య చేసుకున్న రైతులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలను కూడా కలుస్తారట. ఇంతకూ వారిని కలిసి ఉత్తినే పోచికోలు కబుర్లు చెప్పి.. జగన్ ను నాలుగు తిట్లు తిట్టి వెళ్లిపోతారో లేదా.. కనీసం మరణాలు సంభవించిన కుటుంబాలకు ఏదైనా ఆర్థికంగా కూడా సాయం అందిస్తారో లేదో తెలియదు.
ఏదో చావుల్ని రాజకీయం చేయడానికి ఇవాళ ఆత్మహత్య చేసుకున్న రైతులు కుటుంబాలను కలవాలని చంద్రబాబునాయుడు అనుకుంటున్నారు గానీ.. ఆయన హయాంలో కేవలం ప్రభుత్వం వైఫల్యాల వల్ల మరణించిన రైతుల కుటుంబాల వివరాలు వినడానికైనా ఎన్నడైనా ఆయన ప్రయత్నించారా అనేది ప్రజలకు కలుగుతున్న పెద్ద సందేహం.
ఒకవేళ చంద్రబాబు ఈ కాపీ ఓదార్పు యాత్రలో.. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆయన పరామర్శించినప్పుడు.. రుణమాఫీ అనేది చంద్రబాబు హయాంలో పూర్తిగా చేయకపోయినందువల్లనే.. ఇవాళ తాము ఇబ్బందులు పడుతున్నామని.. చెప్పిన మాట నిలబెట్టుకోలేదని.. రైతులు ఎవరైనా చంద్రబాబును నిలదీస్తే ఆయనకు మొహం చెల్లుతుందో లేదో మరి!