Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఆందోళనకారులు ఈ సవాలును స్వీకరించాలి!

ఆందోళనకారులు ఈ సవాలును స్వీకరించాలి!

కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం, అంటే భాజపా నేతృత్వంలోని ప్రభుత్వం.. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి ఒక సవాలు విసిరింది. సీఏఏ వల్ల ప్రభావితమయ్యే, నష్టపోయే ఒక్క వ్యక్తినైనా చూపించాలని సవాలు విసిరింది. వారికి ఎలా నష్టం జరుగుతుందో కూడా చెప్పాలని అన్నది. దీని ప్రకారం అయితే.. సీఏఏను వ్యతిరేకిస్తున్న వారు ఒక్క పేరును కూడా ఇవ్వలేరని, వాస్తవగా.. ఈ కొత్త చట్టం వల్ల దేశంలో నివసిస్తున్న పౌరులకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని తేల్చి చెప్పింది.

పౌరసత్వ సవరణ చట్టం- సీఏఏ అనేది వర్తమాన భారత రాజకీయ, సామాజిక స్థితిగతులను ఒక కుదుపు కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చట్టం ద్వారా.. అధికారికంగా ముస్లిం దేశాలుగా ప్రకటించుకున్న దేశాలనుంచి.. మతవివక్ష కారణంగా భారత్ కు తరలివచ్చిన నాన్-ముస్లిం మతాల వారికి పౌరసత్వం ఇవ్వడానికి మోడీ సర్కారు సంకల్పిస్తున్నది. అయితే.. ఈ చట్టం యావత్ ముస్లింలకు, దేశంలో ప్రస్తుతం పౌరులుగా ఉన్న ముస్లింలకు కూడా వ్యతిరేకం అన్నట్లుగా ఒక భారీ దుష్ప్రచారం జరుగుతోంది.

ముస్లిం సమాజంలోని వ్యక్తులు, తటస్థులు, మోడీ పరిపాలన, ఇతర పాలన పరమైన నిర్ణయాల పట్ల సానుకూల అభిప్రాయం ఉన్నవారు కూడా.. విపరీతంగా సాగుతున్న ప్రచారానికి గురై సీఏఏ పట్ల అపోహల్ని పెంచుకుంటున్నారు. ముస్లింలు రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. మోడీ వ్యతిరేక భావజాలం ఉన్నవారంతా వారికి మద్దతుగా తిరుగుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. వాస్తవంగా సీఏఏ అనేది ఏ రకంగా.. భారతీయ ముస్లింలకు ప్రమాదకరం కాదో.. ఆ సమాజానికి సరైన కోణంలోంచి వివరించి చెప్పడంలో.. కేంద్ర ప్రభుత్వం విఫలం అవుతోంది.

అయితే.. ఇలాంటి సంక్షోభం కొనసాగుతున్న సమయంలో.. కర్నాటక సర్కారు కొంత చొరవ తీసుకుంది. అపోహల్ని నివృత్తి చేయడానికి మంచి సవాలే విసిరింది. ఈ పౌరసత్వ సవరణ చట్టం వలన నష్టపోయే ఒక్క పౌరుడినైనా ఆందోళన చేస్తున్న వారు చూపించగలగాలని వారు ప్రశ్నిస్తున్నారు. నిజమే.. ఆందోళన చేస్తున్న వారు.. కేవలం మోడీ వ్యతిరేకతతో కాకుండా, నిజంగా దేశంకోసం అలా చేస్తుంటే గనుక.. ఈ సవాలును స్వీకరించాలి. లేకపోతే.. వారి ఆందోళనల వెనుక వక్ర ఉద్దేశ్యాలు ఉన్నాయని అనుకోవాల్సి వస్తుంది.

 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?