‘గంటా’కు పోటీ తగులుతోందా?

భీమిలి, విజయనగరం ప్రాంతాలు పూసపాటి క్షత్రియులకు అడ్డాల్లాంటివి. వాళ్లు కానీ.. వాళ్ల మద్దతు వున్న వాళ్లు గానీ గెలవడం అన్నది ఎక్కువగా జరుగుతూ వుంటుంది. మంత్రి గంటా శ్రీనివాసరావు గత ఎన్నికల్లో భీమిలికి వెళ్లి…

భీమిలి, విజయనగరం ప్రాంతాలు పూసపాటి క్షత్రియులకు అడ్డాల్లాంటివి. వాళ్లు కానీ.. వాళ్ల మద్దతు వున్న వాళ్లు గానీ గెలవడం అన్నది ఎక్కువగా జరుగుతూ వుంటుంది. మంత్రి గంటా శ్రీనివాసరావు గత ఎన్నికల్లో భీమిలికి వెళ్లి గెలిచారు. తెలుగుదేశం పార్టీ కాబట్టి పూసపాటి అశోక్ గజపతిరాజు మద్దతు దొరికింది. 

కానీ ఈసారి డవుట్ గా వుంది. ఎందుకంటే భీమిలి బరిలోకి పూసపాటి వంశీకులు దిగే అవకాశం కనిపిస్తోంది. విజయనగరం నుంచి మళ్లీ అశోక్ గజపతిరాజు పోటీచేస్తారు. ఎంపీగానేనా, లేదు ఎమ్మెల్యేగానా అన్నది ఇంకా ఫిక్స్ కాలేదు. కానీ గంటా పోటీచేస్తున్న భీమిలి నుంచి అశోక్ అన్న ఆనంద్ గజపతిరాజు కుమార్తె పోటీకి దిగుతారని వినిపిస్తోంది. ఆనంద్ గజపతిరాజుది ప్రేమవివాహం. ఉమను ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

ఉమాగజపతి రాజు భీమిలి నుంచి గెలుపొంది పార్లమెంట్ కు వెళ్లారు కూడా. ఆ తరువాత తరువాత ఆమె ఈ ప్రాంతానికి దూరమైపోయారు. ఉమాగజపతికి ఇద్దరు కుమార్తెలు. వారిలో ఒకరైన సంచయిత గజపతి రాజు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరారు. వాస్తవానికి అశోక్, ఆనంద్ ల రాజకీయ ప్రస్థానం భాజపా భాగస్వామిగా వున్న జనతా పార్టీతోనే ప్రారంభమైంది. 

సేవారంగంలో బిజీగా వున్న సంచయిత గజపతి రాజు భాజపాలో చేరారు అంటే కచ్చితంగా ఆమె ఎంచుకునేది భీమిలి నియోజకవర్గమే. సహజంగా ఈ ప్రాంతంలో వున్న క్షత్రియులు ఆమెకు మద్దతుగా నిలవడం కూడా ఖాయం. మరి అదే జరిగితే గంటా పరిస్థితి ఇరుకున పడుతుంది.

సాధారణంగా పోటీచేసిన నియోజక వర్గం నుంచి మరోసారి చేయడం గంటాకు అలవాటు లేదు. కానీ ఈసారి అలా షిప్ట్ కావాలన్నా, మరో ప్లేస్ దొరికే పరిస్థితి అంత సులువుగా కనిపించడం లేదు. పోనీ సెంటిమెంట్ కు వ్యతిరేకంగా భీమిలికే ఫిక్స్ అవుదాం అంటే, ఇప్పుడు పూసపాటి వంశీయుల నుంచి పోటీ వచ్చే పరిస్థితి కనిపిస్తోంది.

చూడాలి ముందు ముందు ఇంకా ఎన్ని డెవలప్ మెంట్ లు వస్తాయో?