ఆగస్టులో విజయ్ దేవరకొండ మెరిశాడు. సెప్టెంబర్ లో అక్కినేని కుటుంబమంతా కట్టకట్టుకొని థియేటర్లలోకి వచ్చేసింది. ఇప్పుడు అక్టోబర్ లోకి ఎంటరయ్యాం. మరీ ఈ నెలలో ఎవరు పైచేయి సాధించబోతున్నారు. ఏ సినిమాకు మెరిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఎప్పట్లానే చాలా సినిమాలు క్యూలో ఉన్నప్పటికీ అంచనాలున్న సినిమాలు మాత్రం నాలుగే. వాటిలో ఒకటి అరవింద సమేత. ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడం వల్ల ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. ఇదొక ఎత్తయితే, ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మొట్టమొదటి సినిమా ఇది. త్రివిక్రమ్ స్టయిల్ లోకి తారక్ ఎలా ఒదిగిపోయాడు, తారక్ ను త్రివిక్రమ్ ఎంత కొత్తగా చూపించబోతున్నాడనే క్యూరియాసిటీ అందర్లో ఉంది. ఈనెల 11న థియేటర్లలోకి వస్తోంది అరవింద సమేత.
ఈ సినిమా తర్వాత అంచనాలు పెంచుతున్న సినిమా నోటా. ఈ నెల హైప్ ఉన్న సినిమాల్లో మొట్టమొదట థియేటర్లలోకి వస్తున్న మూవీ ఇదే. రీసెంట్ గా గీతగోవిందం సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో, విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ మూవీతో విజయ్ దేవరకొండ కోలీవుడ్ కు కూడా పరిచయమౌతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రచారం ఊపందుకుంది. రిజల్ట్ ఏంటనేది 5వ తేదీన తెలిసిపోతుంది.
రామ్ నటించిన హలోగురు ప్రేమకోసమే, పందెంకోడి-2 సినిమాలపై కూడా ఓ మోస్తరు అంచనాలున్నాయి. రామ్ నటించిన తాజా చిత్రం ఉన్నది ఒకటే జిందగీ ఫ్లాప్ అయినప్పటికీ ఈ మూవీకి కాస్త క్రేజ్ రావడానికి కారణం ఈ సినిమా టీజర్. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టీజర్ యూత్ ను బాగానే ఎట్రాక్ట్ చేసింది. పైగా నేను లోకల్, సినిమా చూపిస్తమావ లాంటి హిట్ సినిమాలు తీసిన త్రినాథరావు నక్కిన దర్శకుడు కావడంతో “హలోగురు..” సినిమా మార్కెట్లో నలుగుతోంది.
డబ్బింగ్ సినిమా అయినప్పటికీ పందెంకోడి-2పై కూడా అంచనాలున్నాయి. దీనికి ప్రధానంగా 2 కారణాలున్నాయి. గతంలో వచ్చిన పందెంకోడి సినిమా ఇక్కడ కూడా హిట్ అవ్వడం ఒక కారణమైతే, రీసెంట్ గా విశాల్ నటించిన అభిమన్యుడు, డిటెక్టివ్ సినిమాలు ఇక్కడ కూడా క్లిక్ అవ్వడం మరో రీజన్. ఈ రెండు కారణాల వల్ల పందెంకోడి-2పై తెలుగునాట కూడా అంచనాలు పెరిగాయి.
ఈనెలలో ప్రధానంగా ఈ 4 సినిమాలపైనే అందరి దృష్టి ఉంది. వీటిలో ఏ సినిమా పైచేయి సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. వీటితో పాటు భలే మంచి చౌకబేరము, వీరభోగవసంతరాయలు, దేశంలో దొంగలు పడ్డారు, భైరవగీత, బేవార్స్ లాంటి సినిమాలు లైన్లో ఉన్నప్పటికీ వీటిపై ఎవరికీ ఎలాంటి అంచనాల్లేవు.