ఐదేళ్ల కిందటి వరకూ టెలికాం కంపెనీల వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లింది. అయినదానికీ కాని దానికీ రేట్లు బాదేసిన రోజులవి. మొబైల్ లో ఇంటర్నెట్ డాటాను ఆఫ్ చేసుకోకపోతే, మెయిన్ బ్యాలెన్స్ ను మైనస్ లోకి పంపించేసిన రోజులవి. అదేమంటే.. కస్టమర్ ను ఖాతరు చేసే వారు కాదు, నంబర్ పోర్టబులిటీ పెట్టుకుని వెళ్లిపొమ్మన్నట్టుగా తేల్చేసేవారు. ఎయిర్ టెల్, ఐడియా, వొడాఫోన్ వంటి నెట్ వర్క్ లు ఆట ఆడేసుకున్నాయి.
అయితే ఇప్పుడు కథ అడ్డం తిరిగిన వైనం కనిపిస్తూ ఉంది. జియో రంగ ప్రవేశంతోనే కథ మారింది. విపరీత స్థాయి ఆఫర్లతో జియో వినియోగదారులను ఆకట్టుకుంది. అదే సమయంలో జియోకు వందల కోట్ల నష్టాలు అనే వార్తలూ వచ్చాయి! అయితే అందులో ఏదో వ్యూహముందని అనేక మంది అనుమానించారు. జియో ఆవిర్భవించిన నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు మార్కెట్లో జియో ఒక్కటే మిగిలే పరిస్థితి కనిపిస్తోందని మార్కెట్ ఎనలిస్టులు అంటున్నారంటే ఆశ్చర్యం కలగకమానదు! దీనికి ప్రత్యక్షంగా కొన్ని పరిణామాలు, పరోక్షంగా మరికొన్ని పరిణామాలు కలిసివస్తున్నట్టుగా ఉన్నాయి.
స్పెక్ట్రమ్ వాడుకోవడానికి సంబంధించి టెలికాం ఆపరేటర్లు భారీగా కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు చెల్లించాల్సిన వైనం గురించి కోర్టు గట్టిగా ఉంది. ఎయిర్ టెల్, ఐడియా-వొడఫోన్ లు ఏకంగా లక్ష కోట్ల రూపాయలకు పై మొత్తాన్ని చెల్లించాల్సి ఉందట. ఈ విషయంలో మినహాయింపును కోరుతూ ఉన్నాయి ఆ సంస్థలు. అయితే అలాంటి పరిస్థితి కనిపించడం లేదని తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఎయిర్ టెల్ కొంత మొత్తాన్ని జమ చేసింది. మిగతా సంస్థలు మాత్రం కేంద్రం కరుణ కోసమే వేచి ఉన్నాయని తెలుస్తోంది. కేంద్రం కరుణించి చెల్లించాల్సిన మొత్తంలో మినహాయింపును ఇవ్వకపోతే 30 కోట్ల మంది యూజర్లున్న ఒక టెలికాం సంస్థ మూతపడే పరిస్థితి ఉందని వార్తలు వస్తున్నాయి.
ఈ విషయంలో బ్యాంకులు కూడా స్పందించాయి. ఇప్పటికే పాత టెలికాం సంస్థలు నష్టాల్లో ఉన్నాయి. జియోతో పోటీ కోసమని అవి చార్జీలు తగ్గించేసి, భారీ ఆఫర్లు ఇస్తున్నాయి. మరోవైపు నిర్వాహణ ఖర్చులు ఉండనే ఉన్నాయి. ఇప్పటికే టెలికాం సంస్థలు ప్రతి క్వార్టర్ లోనూ నష్టాలనే కోట్ చేస్తున్నాయి. ఇప్పుడు పాత బకాయిల చెల్లింపుతో అవి దివాళా తీస్తాయని బ్యాంకర్ల అంచనా వేస్తున్నారు. మరి అదే జరిగితే మార్కెట్లో జియో మాత్రమే మిగులుతుందేమో అనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఏకస్వామ్యం ప్రజలకు ఏ మాత్రం మంచిది కాదు సుమా!