ప‌వ‌న్‌కు క‌రోనా ఫేక్ అని…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ క‌రోనా బారిన ప‌డ్డ నేప‌థ్యంలో సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్‌వ‌ర్మ సెటైర్ విసిరారు. ఇది వివాదా స్ప‌దంగా మారింది. అస‌లే వ‌ర్మ‌, అందులోనూ త‌న‌కు న‌చ్చ‌ని ప‌వ‌న్‌పై ఎప్పుడెప్పుడు పంచ్‌లు వేద్దామా అని…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ క‌రోనా బారిన ప‌డ్డ నేప‌థ్యంలో సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్‌వ‌ర్మ సెటైర్ విసిరారు. ఇది వివాదా స్ప‌దంగా మారింది. అస‌లే వ‌ర్మ‌, అందులోనూ త‌న‌కు న‌చ్చ‌ని ప‌వ‌న్‌పై ఎప్పుడెప్పుడు పంచ్‌లు వేద్దామా అని ఎదురు చూస్తుంటారు. ఈ నేప‌థ్యంలో వ‌కీల్ సాబ్ చిత్రంలోనే ప‌వ‌న్ పాత్ర‌ను దృష్టిలో పెట్టుకుని ఆయ‌న‌పై వ‌ర్మ త‌న‌దైన స్లైల్‌లో వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

‘ఒక కనిపించని నీచమైన పురుగు కూడా పవన్ కల్యాణ్‌ను ఇలాంటి దయనీయ స్థితిలో పడుకోబెట్టేసిందంటే అసలు హీరో అనే వస్తువు ఈ ప్రపంచంలో ఉన్నట్టా లేనట్టా? చెప్పండి యువర్ ఆనర్’ అంటూ సెటైర్ విసిరారు. ఇంత‌టితో ఆగితే ఆయ‌న రాంగోపాల్‌వ‌ర్మ ఎందుక‌వుతారు? ప‌వ‌న్ అభిమానులను కూడా విడిచి పెట్ట‌లేదు. వారికి స‌వాల్ కూడా విసిరారు.  

‘వేరే హీరో ఫ్యాన్స్ అంతా పవన్ దుస్థితికి కరోనా కారణం కాదు. వకీల్ సాబ్ వసూళ్లే కారణమని అంటున్నారు. రండి, కదలండి, ప్రాణాలకు తెగించి పీకే జేబులు నింపండి’ అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. వ‌ర్మ వెట‌కారంపై ప‌వ‌న్ అభిమానులు మండి ప‌డుతున్నారు.

చికిత్స పొందుతున్న ప‌వ‌న్ ఫొటో సోషల్ మీడియాలో ప్ర‌త్య‌క్షం కావ‌డంపై కూడా వ‌ర్మ స్పందించారు. పవన్ ఫొటోలోని ఆర్ట్ డైరెక్షన్‌లో ఒక తప్పుందని వ‌ర్మ ప్ర‌స్తావించడం గ‌మ‌నార్హం. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్‌ను అడిగైనా సరే ఆ తప్పేంటో చెప్పించాలని ప్ర‌సిద్ధ డైరెక్ట‌ర్ రాజమౌళిని వ‌ర్మ కోరారు. ఆ తప్పేంటో గుర్తించి బయటపెట్టిన వారి ఫొటోను తాను పెట్టి మంచి బహుమతి ఇస్తానని వ‌ర్మ‌ ప్రకటించారు.  

‘ఫేక్ అని నేనట్లేదు. వేరే హీరోల దగుల్భాజీ ఫ్యాన్స్ అంటున్నారు. వాళ్ల ఆట కట్టించడానికి పవన్ కల్యాణ్ ఫ్యాన్‌గా ఆ చాలెంజ్ విసిరా’ అంటూ వ‌ర్మ త‌న మార్క్ వివరణ ఇచ్చారు. బ‌హుశా ప‌వ‌న్‌కు క‌రోనా లేద‌ని భావిస్తున్న వ‌ర్మ‌, త‌న అభిప్రాయాన్ని ఇత‌ర హీరోల ఫ్యాన్స్ చెబుతున్న‌ట్టుగా వ్యంగ్యాన్ని జోడించి ట్వీట్ చేయ‌డం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ప‌వ‌న్‌కు సంబంధించి ఏ చిన్న విష‌యాన్ని కూడా వ‌ర్మ విడిచిపెట్ట‌ర‌నేందుకు ఇదే ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకోవ‌చ్చు.

క‌రోనాబారిన ప‌డ్డ వ్య‌క్తిపై ఇలాంటి ట్వీట్లు చేయ‌డం కుసంస్కారానికి నిద‌ర్శ‌న‌మ‌ని కామెంట్స్ చేస్తున్నారు. మ‌రికొంద‌రు వ‌ర్మ విచ‌క్ష‌ణ‌కే వ‌దిలేయాల‌ని చెబుతున్నారు.