అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావించిన తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ ఈరోజు ఉదయాన్నే మొదలైంది. ఓటర్లు చురుగ్గా పోలింగ్ లో పాల్గొంటున్నారు. ఇంకాసేపు గడిస్తే ఎండలు మరింత పెరుగుతాయనే ఉద్దేశంతో పొద్దున్నే పోలింగ్ స్టేషన్ల ముందు బారులు తీరారు. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి, తన కుటుంబ సభ్యులతో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు
తిరుపతి లోక్ సభ స్థానానికి జరుగుతున్న ఈ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ గెలుపును తమ పాలనకు గీటురాయిగా వైసీపీ చూస్తుండగా.. ఈ స్థానంలో గెలిచి ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని చాటిచెప్పే ప్రయత్నం చేస్తున్నాయి టీడీపీ-బీజేపీ.
అందుకే మహామహులంతా తిరుపతి వచ్చి ప్రచారం చేసి వెళ్లారు. అయితే తిరుపతి లోక్ సభ స్థానంలో గెలుపు తమదేనని, కేవలం మెజారిటీపైనే తమ దృష్టి ఉందని చెబుతోంది వైసీపీ. 7 అసెంబ్లీ స్థానాల పరిథిలో ఈరోజు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకే మొదలైన పోలింగ్ సాయంత్రం 7 గంటల వరకు జరగనుంది.
మధ్యాహ్నం 12 తర్వాత పోలింగ్ తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ ఊపందుకుంటుందని చెబుతున్నారు. మొత్తంగా చూసుకుంటే.. 70శాతానికి పైగా పోలింగ్ నమోదైతే వైసీపీకి తిరుగులేని మెజారిటీ వస్తుందనేది ఓ అంచనా.
తొలిసారిగా ఈ ఎన్నికతో కేంద్ర ఎన్నికల సంఘం ఓ నిర్ణయం తీసుకుంది. 80 ఏళ్లు పైబడినవారితో పాటు వికలాంగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించింది. ప్రస్తుతం 2470 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారు సాయంత్రం 6 గంటల తర్వాత ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.