ఓవైపు వివాదం నడుస్తున్నప్పటికీ, మరోవైపు శంకర్ మాత్రం తన పని తాను చేసుకుపోతున్నాడు. అపరిచితుడు హిందీ రీమేక్ కు సంబంధించి నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ నుంచి లీగల్ నోటీసు ఎదుర్కొన్నాడు శంకర్. ఓవైపు ఆ వివాదం నడుస్తుండగానే, మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ గా కియరా అద్వానీని ఎంపిక చేశారు..
రణ్వీర్ సింగ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో రాబోతున్న అపరిచితుడు హిందీ రీమేక్ లో కియరా హీరోయిన్ గా నటించనుంది. ఈ మేరకు నిన్న అగ్రిమెంట్ కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. రణ్వీర్ సింగ్, కియరా కాంబోలో ఇదే తొలి సినిమా కాబోతోంది.
మరోవైపు ఆస్కార్ రవిచంద్రన్ ఈ రీమేక్ కు సంబంధించి కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నాడు. అపరిచితుడు సినిమాకు సంబంధించి రచయిత సుజాత, తనకు పూర్తి హక్కులు రాశాడని.. ఆ కథ-మాటలన్నీ సుజాతవేనని వాదిస్తున్నాడు ఆస్కార్ రవిచంద్రన్. ఓ నిర్మాతగా సినిమాకు సంబంధించిన అన్ని హక్కులపై తనకు అధికారం ఉంటుందని అంటున్నాడు.
అటు శంకర్ మాత్రం సినిమా టైటిల్ లో కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వంలో కింద తన పేరు ఉందని చెబుతున్నాడు. కథ తనది కాబట్టి.. దాని స్ఫూర్తితో హిందీలో మరో వెర్షన్ తీసుకునే హక్కు తనకు ఉందంటున్నాడు. ఓవైపు ఈ వివాదం నడుస్తుండగా, మరోవైపు సినిమాలో హీరోయిన్ తో పాటు నటీనటుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది.