ఆంధ్ర‌జ్యోతా? అంధ‌జ్యోతా?

ఓటుకు నోటు కావాలా? అయితే ఆంధ్ర‌జ్యోతి ఆఫీస్‌కు వెళ్లండి అని వైసీపీ సోష‌ల్ మీడియా పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తోంది. దీనికి కార‌ణం లేక‌పోలేదు. తిరుప‌తి ఉప ఎన్నిక‌కు ముందురోజు ఆంధ్ర‌జ్యోతి చిత్తూరు జిల్లా…

ఓటుకు నోటు కావాలా? అయితే ఆంధ్ర‌జ్యోతి ఆఫీస్‌కు వెళ్లండి అని వైసీపీ సోష‌ల్ మీడియా పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తోంది. దీనికి కార‌ణం లేక‌పోలేదు. తిరుప‌తి ఉప ఎన్నిక‌కు ముందురోజు ఆంధ్ర‌జ్యోతి చిత్తూరు జిల్లా టాబ్లాయిడ్‌లో “ఓటుకు వెయ్యి” శీర్షిక‌తో వార్తా క‌థ‌నాన్ని ప్ర‌చురించ‌డంపై వైసీపీ నేత‌లు, సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు మండిప‌డుతున్నారు. 

క‌ళ్లున్న క‌బోది ఆంధ్ర‌జ్యోతి అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఎంతోకొంత నిజం ఉంటే, మ‌రికొంత క‌ల్పించి రాసినా అర్థం ఉంటుంద‌ని, కానీ ఏమీ లేకుండానే ఏదో జ‌రిగిపోతున్న‌ట్టు రాయ‌డం వ‌ల్ల ఆంధ్ర‌జ్యోతి కాస్త అంధ‌జ్యోతి అని పిలిపించుకోవ‌డం త‌ప్ప పోయేదేమీ లేద‌ని వారు అంటున్నారు.

ఆ ప‌త్రిక‌లో రాసిన క‌థ‌నం ప్ర‌కారం .. ఓటుకు వెయ్యి రూపాయ‌ల‌తో పాటు అడిగిన వారికి మ‌ద్యాన్ని అధికార పార్టీ పంపిణీ చేస్తోంది. ఇదంతా వైసీపీ ప్ర‌భుత్వాధినేత‌కు స‌న్నిహిత బంధువుగా ఉండి జిల్లాలో కీల‌క పాత్ర పోషిస్తున్న ఓ ముఖ్య నేత ఈ పంప‌కాల‌కు కేంద్ర బిందువుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని రాసుకొచ్చారు. అంటే వైఎస్ జ‌గ‌న్‌కు స‌మీప బంధువైన టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ పెడుతున్న‌ట్టు రాసుకొచ్చారు.

ఈ డ‌బ్బును వ‌లంటీర్లతో పాటు స్వ‌యం స‌హాయ‌క సంఘాల లీడ‌ర్ల ద్వారా పంపిణీ చేస్తున్న‌ట్టు చ‌క్క‌టి క‌థ‌ను అల్లారు. వైసీపీ ప్ర‌లోభాల‌ను అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు సిద్ధ‌మ‌య్యాయ‌ని కూడా చెప్పుకొచ్చారు. ప‌నిలో ప‌నిగా వీలైన కాడికి ఫొటోలు, వీడియోలు తీసి ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేయ‌డానికి టీడీపీ సిద్ధ‌మ‌వుతున్న‌ద‌ట‌!

అస‌లు తిరుప‌తి పార్ల‌మెంట్ ఉప ఎన్నిక‌ల్లో డ‌బ్బు పంపిణీకి చ‌ర‌మ గీతం పాడిందే తామ‌ని అధికార పార్టీ నేత‌లు చెబుతున్నారు. ఇదో సాహ‌సోపేత‌మ‌నే అభిప్రాయాలు స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. జ‌గ‌న్ తీసుకున్న ఈ చ‌రిత్రాత్మ‌క నిర్ణ‌యాన్ని ఆంధ్ర‌జ్యోతి అభినందిస్తుంద‌ని ఎవ‌రూ అనుకోరు. ఆ ప‌ని చేయ‌క‌పోయినా ఫ‌ర్వాలేదు కానీ, త‌ప్పుడు స‌మాచారాన్ని రాయ‌డంపై పాఠ‌క లోకం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది.

రాత ఎప్పుడూ సాధ‌న‌తోనే మెరుగుప‌డుతుంది. కానీ ఆంధ్ర‌జ్యోతి య‌జ‌మాని మొద‌లుకుని, కిందిస్థాయి విలేక‌రుల వ‌ర‌కూ అరాచ‌కాన్ని ప్రాక్టీస్ చేస్తున్నార‌ని వైసీపీ నేత‌లు, సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు మండిప‌డుతున్నారు. అందుకే ఇలాంటి విష‌పు రాత‌లు ఆంధ్ర‌జ్యోతిలో క‌నిపిస్తున్నాయ‌ని ధ్వ‌జ‌మెత్తుతున్నారు. ఓట‌రెవ‌రైనా ఓటుకు నోటు కావాలని కోరుకుంటే తిరుప‌తి-చెన్నై బైపాస్‌లోని ఆంధ్ర‌జ్యోతి ఎడిష‌న్ కార్యాల‌యం లేదా తిరుప‌తి న‌గ‌రంలోని లీలామ‌హ‌ల్ సెంట‌ర్‌లో ఉన్న ఆ ప‌త్రిక ప్రాంతీయ కార్యాల‌యానికి వెళ్లి తీసుకోవ‌చ్చని అధికార పార్టీ నేత‌లు వ్యంగ్యంగా సూచిస్తున్నారు.

త‌మ పార్టీ ప్ర‌లోభాల‌ను టీడీపీ శ్రేణుల‌తో పాటు ఆంధ్ర‌జ్యోతి ప్ర‌తినిధులు కూడా అడ్డుకోవ‌చ్చ‌ని హిత‌వు చెబుతున్నారు. ఆంధ్ర‌జ్యోతి ప్ర‌తినిధులైతే చ‌క్క‌టి ఫొటోలు, వీడియోలు తీసే నైపుణ్యాన్ని క‌లిగి ఉంటార‌ని, కావున నిఘా ఉండి త‌మ‌ను ప‌ట్టించాల‌ని కోరుకుంటున్నారు.

వైసీపీ డ‌బ్బు పంపిణీ చేస్తోంద‌న్న త‌ప్పుడు రాత‌ల‌ను చ‌దివిన త‌ర్వాత‌… అది ఆంధ్ర‌జ్యోతా? లేక అంధ‌జ్యోతా? అనే అనుమానాలు క‌లుగుతున్నాయ‌ని సోష‌ల్ మీడియాలో పోస్టులు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతున్నాయి.

మంచి విత్త‌నాలు వేస్తే …పంట కూడా అందుకు త‌గ్గ‌ట్టుగానే వ‌స్తుంది. అలా కాకుండా విష‌పు విత్త‌నాల‌ను భూమిలో వేస్తే …అవి ఎలాంటి పంట‌ను ఇస్తాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. మ‌న‌సంతా విషాన్ని నింపుకుని రాసే రాత‌లు ఎలా ఉంటాయో నేటి అంధ‌జ్యోతి క‌థ‌న‌మే నిద‌ర్శ‌న‌మ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయినా ఆవు చేలో మేస్తే , దూడ గ‌ట్టున మేస్తుందా? అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి.  

సొదుం ర‌మ‌ణ‌