పవన్ కల్యాణ్ కు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. వారి పార్టీ తరఫునే అధికారికంగా ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. ఈ రోజుల్లో కొవిడ్ పాజిటివ్ రావడం అంటే చాలా సాధారణమైన విషయం అయిపోయింది. సోకిన వారిని ప్రస్తుత వైద్య రీతులు ప్రాణాపాయం నుంచి బయటపడేస్తున్నాయి గనుక.. దాని గురించి పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు.
కాకపోతే.. జనం మెచ్చే నటుడిగా, ప్రజానాయకుడిగా ఎదగాలనుకుంటున్న వ్యక్తిగా పవన్ త్వరగా కోలుకోవాలని కోరుకోవచ్చు. కానీ.. పవన్ కల్యాణ్ కు కొవిడ్ పాజిటివ్ రావడాన్ని కూడా.. ఆ పార్టీ.. ఒక డాక్టరును ప్రమోట్ చేయడానికి, బూస్ట్ చేయడానికి వాడుకుంటున్నదా అని అనిపిస్తోంది.
ఖమ్మంకు చెందిన సుమన్ అనే డాక్టరు ప్రత్యేకంగా హైదరాబాదు వచ్చి వారం రోజులుగా పవన్ వైద్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఆయన పవన్ కుటుంబానికి సన్నిహితులు అని కూడా ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు. అలాగే పవన్ వైద్యం పర్యవేక్షిస్తున్న అపోలో వైద్యుల పేర్లు కూడా ఇచ్చారు.
కానీ అంతకు మించి.. పవన్ కల్యాణ్ రోగాన్ని ఆ పరిస్థితిని అభిమానులకు వివరించడానికి మించి.. డాక్టర్ సుమన్ ను కీర్తించడానికే ఆ ప్రెస్ నోట్ ఎక్కువ దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తోంది.
ఆ మధ్య అమితాబ్ కు కరోనా సోకినప్పుడు.. ఆయన తాను జాయిన్ అయిన ఆస్పత్రిని, వారి సేవలను ఆకాశానికెత్తేశారు. ఆ ఆస్పత్రి బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్‌లో అమితాబ్ కూడా ఒకరని, వారి బిజినెస్ ను పెంచడానికే.. ఆయన అలా మాట్లాడారని విమర్శలు వచ్చాయి. కొవిడ్ వచ్చిందో లేదో గానీ.. ఆ ఆస్పత్రికి అమితాబ్ బ్రాండ్ అంబాసిడర్ లా మాట్లాడుతున్నారని విమర్శలు వచ్చాయి.
పవన్ కల్యాణ్ వ్యవహారం కూడా అలాగే ఉంది. ఆ ప్రెస్ నోట్ చూస్తే.. పవన్ గురించి వివరాలు చెప్పే ప్రకటన కంటె కాస్త ఎక్కువగా.. డాక్టర్ సుమన్ హాస్పిటల్ గురించి పాంప్లెట్ కంటె కొంచెం తక్కువగా ఉందంటే అతిశయోక్తి కాదు.
డాక్టర్ సుమన్ ది ఏ ఊరు? ఎక్కడ చదువుకున్నారు? ఎవరిని పెళ్లి చేసుకున్నారు? ఎక్కడ ఆస్పత్రి పెట్టారు? ప్రాక్టీసు ఎలా ఉంది..? .. ఏంటీ వివరాలు? పవన్ కు కొవిడ్ ప్రెస్ నోట్ లో ఇవన్నీ ఎందుకు? డాక్టర్ సుమన్ పుట్టుమచ్చలు తప్ప సమస్తం చెప్పినట్టుగా ఈ ప్రెస్ నోట్ ఉంది. అసలు సుమన్ కోసమే.. పవన్ కు పాజిటివ్ అన్న సంగతి బయటపెట్టారా? అని డౌటొచ్చేలా ఉంది.
ఒక ప్రెస్ నోట్.. వంద డౌట్లు!
జనసేన పార్టీ ఒక ప్రెస్ నోట్ ఇచ్చింది గానీ.. అది వంద డౌట్లు రేకెత్తించేలా ఉంది. అవన్నీ వాళ్లకు తెలిసే ఇచ్చారా? లేదా, అనుకోకుండా అలా జరిగిపోయిందా? తెలీడం లేదు.
(1) చిరంజీవి ఫ్యామిలీ మొత్తం ఫోన్లో టచ్ లో ఉండి అన్ని వివరాలు తెలుసుకుంటున్నట్టుగా చెప్పారు. అంటే ఫ్యామిలీలో మిగిలిన వాళ్లెవరూ (నాగబాబు, వరుణ్ తేజ్ లాంటివాళ్లు) పవన్ గురించి పట్టించుకోలేదనే డౌటు పుడుతోంది.
(2) ‘నిర్మాత నాగవంశీ వారం రోజులుగా పవన్ వెంట ఉండి ఏర్పాట్లు చూస్తున్నారు’ అనే వాక్యం ఉంది. పవన్ కు కొవిడ్ వస్తే.. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఆయన స్వయంగా చేసుకోలేని స్థితిలో ఉన్నారా? నాగవంశీ చేసిన ఏర్పాట్లు ఏంటి? డబ్బుతో ముడిపడినవేనా? జబ్బు వచ్చినా కూడా నిర్మాతలే ఖర్చు పెట్టాలా? పవన్ పెట్టుకోలేరా?
(3) నాగవంశీ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ చిత్రానికి నిర్మాత. ఆయన సినిమా ఇంకా పూర్తి కాలేదు గనుక.. పవన్ ఆరోగ్యం గురించి టెన్షన్ పడుతున్నాడని, సినిమా రిలీజ్ కూడా అయిపోయింది గనుక.. ఇతర నిర్మాతలు పట్టించుకోవట్లేదని అర్థం వచ్చేలా ఈ వాక్యాలు ఉన్నాయి. పవన్ గురించి నాగవంశీ శ్రద్ధ చూపుతున్నట్లు ప్రచారం చేయడం వల్ల ఆయన సినిమాపై ఫ్యాన్స్ లో సానుభూతి బజ్ క్రియేట్ అవుతుందని అనుకుంటున్నారో ఏంటో ఖర్మ.
మొత్తానికి పవన్ కు కొవిడ్ రావడం కాదు గానీ.. దీనితో ముడిపెట్టి.. ఎవరెవరిని ప్రమోట్ చేయాలో.. ఎవరెవరికి మైలేజీ ఇవ్వాలో జాగ్రత్తగా రెండు రోజుల పాటు ప్లాన్ చేసి.. వారికోసం రెండు రోజుల తర్వాత ఈ ప్రెస్ నోట్ విడుదల చేసినట్లుగా ఉంది వ్యవహారం!