రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల్ని దృష్టిలో పెట్టుకొని ప్రధాని నరేంద్ర మోడీకి, ఏపీ ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. రాష్ట్రానికి 60 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు కావాలని కోరారు. టీకా ఉత్సవ్‌లో భాగంగా ఒక్కరోజే 6,28,961 డోసులు ఇచ్చినట్లు పేర్కొన్న ముఖ్యమంత్రి.. తగినన్ని డోసులు పంపిస్తే 45 ఏళ్లు దాటిన ప్రతి వ్యక్తికి వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియను 3 వారాల్లో పూర్తిచేస్తామన్నారు.
స్కూల్-కాలేజీల్లో కరోనా భయం
ఏపీలోని పాఠశాలలు, కాలేజీల్లో కరోనా భయాలు పట్టుకున్నాయి. ప్రాంతాలు, జిల్లాలతో సంబంధం లేకుండా శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు దాదాపు ప్రతి జిల్లాలో కాలేజీ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు.
నవంబర్ నుంచి కాలేజీలతో పాటు 9, 10 తరగతుల పిల్లలకు స్కూల్స్ తెరిచారు. కొన్నాళ్లు పరిస్థితి సజావుగానే ఉన్నప్పటికీ, ప్రస్తుతం సెకెండ్ వేవ్ లో భాగంగా ఎక్కువమంది కరోనా బారిన పడుతున్నారు.
గాలి ద్వారా కూడా కరోనా
మరోవైపు సెకెండ్ వేవ్ లో గాలి ద్వారా కూడా కరోనా వ్యాపిస్తుందనే విషయాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇప్పటికే దేశీయంగా సీసీఎంబీ లాంటి సంస్థలు ఈ విషయాన్ని వెల్లడించగా.. తాజాగా అంతర్జాతీయ నిపుణుల బృందం కూడా స్పష్టంచేసింది.
కరోనా గాలి ద్వారా కూడా వ్యాపిస్తోంది కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. బ్రిటన్, అమెరికా, కెనడాకు చెందిన ఆరుగురు వైద్యుల బృందం ఈ విషయాన్ని శాస్త్రీయంగా కనుగొంది.
మరోసారి పూర్తిస్థాయి కరోనా హాస్పిటల్ గా..
ఇటు తెలంగాణలో కూడా కరోనా కేసులు మరోసారి వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో.. గాంధీ ఆస్పత్రిని మరోసారి పూర్తిస్థాయి కరోనా హాస్పిటల్ గా మార్చేస్తున్నారు. రేపట్నుంచే ఆ కార్యక్రమం మొదలుకాబోతోంది. రేపట్నుంచి ''గాంధీ''లో ఔట్ పేషెంట్స్ ను చూడరు. కేవలం కరోనా కేసుల్ని మాత్రమే ట్రీట్ చేస్తారు.
ఇప్పటికే హాస్పిటల్ లో 450 మంది కరోనా పేషెంట్లు ఉండగా.. నిన్న ఒక్క రోజే 150 మంది జాయిన్ అయ్యారు. గాంధీలో 10 నిమిషాలకు ఒక కరోనా పేషెంట్ జాయిన్ అవుతున్నట్టు వైద్యులు ప్రకటించారు.
తెలంగాణలో ఆక్సిజన్ కొరత
మరోవైపు కరోనా పేషెంట్లకు అవసరమైన బెడ్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. ఆక్సిజన్ కొరత మాత్రం ఉందని స్వయంగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతానికి తెలంగాణలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఉందని, రాబోయే రోజుల్లో కొరత లేకుండా చూస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు.
తెలంగాణలో లాక్ డౌన్, కర్ఫ్యూ, 144 సెక్షన్ లాంటివేవీ పెట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఈ సందర్భంగా మరోసారి స్పష్టంచేశారు. చివరికి రాత్రి పూట కర్ఫ్యూకు సంబంధించి కూడా ఎలాంటి ఆలోచన లేదని తేల్చిచెప్పేశారు.
ఏపీలో జగన్ మరోసారి సమీక్షా సమావేశం
పెరుగుతున్న కరోనా కేసుల్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి అత్యవసర సమీక్ష సమావేశం ఏర్పాటుచేశారు. ఇప్పటికే 11 మంది ఐఏఎస్ లతో కరోనా కట్టడికి కమిటీని ఏర్పాటుచేసిన జగన్.. కొద్దిసేపటి కిందట కరోనా పరీక్షలపై సమీక్ష నిర్వహించారు.
అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరికి పరీక్షలు చేయాలని, సంఖ్య పెంచాలని ఆదేశించారు. ప్రస్తుతం అర్బన్ ప్రాంతాల్లో 62శాతం, రూరల్ ప్రాంతాల్లో 38 శాతం కరోనా కేసులున్నాయి. అయితే అర్బన్ తో పోలిస్తే రూరల్ లోనే ఎక్కువగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి.