తిరుప‌తిలో కూడిక‌లు, తీసివేత‌లు …

తిరుప‌తి లోక్‌స‌భ ఉప పోరుకు కేవ‌లం కొన్ని గంట‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. తిరుప‌తి లోక్‌సభ సీటు మొద‌టి నుంచి కాంగ్రెస్‌కు కంచుకోట‌. ఆ త‌ర్వాత‌ వైఎస్ జ‌గ‌న్ నేతృత్వంలో ఆవిర్భ‌వించిన వైసీపీకి కంచుకోట‌గా…

తిరుప‌తి లోక్‌స‌భ ఉప పోరుకు కేవ‌లం కొన్ని గంట‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. తిరుప‌తి లోక్‌సభ సీటు మొద‌టి నుంచి కాంగ్రెస్‌కు కంచుకోట‌. ఆ త‌ర్వాత‌ వైఎస్ జ‌గ‌న్ నేతృత్వంలో ఆవిర్భ‌వించిన వైసీపీకి కంచుకోట‌గా మారింది. 2014, 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీనే గెలుపొందింది. వైసీపీ ఎంపీ బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ ఆక‌స్మిక మృతితో ఉప ఎన్నిక అనివార్య‌మైంది.

ఈ ఉప ఎన్నిక‌లో డాక్ట‌ర్ గురుమూర్తి (వైసీపీ), ప‌న‌బాక ల‌క్ష్మి (టీడీపీ), ర‌త్న‌ప్ర‌భ (బీజేపీ), చింతా మోహ‌న్ (కాంగ్రెస్‌) త‌దిత‌రులు బ‌రిలో నిలిచారు. వీరిలో వైసీపీ అభ్య‌ర్ధి డాక్ట‌ర్ గురుమూర్తి ఒక్క‌రే రాజ‌కీయాల‌కు కొత్త‌. వీరిలో అత్యంత పిన్న వ‌య‌స్కుడు కూడా ఆయ‌నే. అంతేకాదు, ఆర్థికంగా కూడా మిగిలిన వాళ్ల‌తో పోల్చితే అతి సామాన్యుడు.

అధికార ప‌క్షం వైసీపీ ప్ర‌ధానంగా భారీ మెజార్టీపై దృష్టి సారించింది. మిగిలిన ప్ర‌తిప‌క్షాలు మాత్రం ఎలాగైనా భారీ మెజార్టీకి గండికొట్టి వైసీపీని దెబ్బ‌తీయాల‌ని స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ బ‌లాబ‌లాల‌తో పాటు త‌మ బ‌ల‌హీన‌త‌ల‌పై ఆయా రాజ‌కీయ పార్టీలు దృష్టి పెట్టాయి.

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తిరుప‌తి పార్ల‌మెంట్ ప‌రిధిలోని నియోజ‌క‌వ‌ర్గాల వారీగా వైసీపీ సాధించిన మెజార్టీల‌ను ప‌రిశీలిద్దాం. తాజా ఉప ఎన్నిక‌లో ఆ పార్టీ టార్గెట్ పెట్టుకున్న భారీ మెజార్టీ గురించి చ‌ర్చిద్దాం. తిరుప‌తి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గాలున్నాయి. చిత్తూరు జిల్లాలో మూడు, నెల్లూరు జిల్లాలోని నాలుగు నియోజ‌కవ‌ర్గాలున్నాయి.

చిత్తూరు జిల్లాలోని తిరుప‌తి, శ్రీ‌కాళ‌హ‌స్తి, స‌త్య‌వేడు, నెల్లూరు జిల్లాలోని వెంక‌ట‌గిరి, సూళ్లూరుపేట‌, గూడూరు, స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గాలున్నాయి. వీటిలో స‌త్య‌వేడు, సూళ్లూరుపేట‌, గూడూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఎస్సీ రిజ‌ర్వ్‌డ్. తిరుప‌తి లోక్‌స‌భ మాత్రం ఎస్సీ రిజ‌ర్వ్‌డ్‌.

2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి, టీడీపీ నాయ‌కురాలు ప‌న‌బాక ల‌క్ష్మిపై 2,28,576 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా మెజార్టీల గురించి తెలుసుకుందాం. ఒక్క తిరుప‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం మిన‌హాయిస్తే మిగిలిన ఆరుచోట్ల‌ వైసీపీకే మెజార్టీ ద‌క్కింది. అయితే తిరుప‌తి అసెంబ్లీ నుంచి వైసీపీ అభ్య‌ర్థి భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి విజ‌యం సాధించ‌డం గ‌మ‌నార్హం. ఇక్క‌డ క్రాస్ ఓటింగ్ జ‌రిగిన‌ట్టు స్ప‌ష్టంగా తెలిసిపోతోంది. ఇక్క‌డ జ‌న‌సేన అసెంబ్లీ అభ్య‌ర్థికి 12 వేల ఓట్లు రావ‌డం గ‌మ‌నార్హం. బ‌రిలో జ‌న‌సేన‌ లేక‌పోయి ఉంటే మాత్రం వైసీపీ భ‌విష్య‌త్ ఏంటో ఊహించ‌డం క‌ష్ట‌మేమీ కాదు.

పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో తిరుప‌తి అసెంబ్లీ ప‌రిధిలో టీడీపీకి 3,578 ఓట్ల మెజార్టీ ద‌క్కింది. మిగిలిన ఆరు చోట్ల వైసీపీ అభ్య‌ర్థికే మంచి మెజార్టీ ద‌క్కింది. చిత్తూరు జిల్లాలోని శ్రీ‌కాళ‌హ‌స్తిలో 32,919, స‌త్య‌వేడులో 42,196, నెల్లూరు జిల్లాలో వెంక‌ట‌గిరిలో 36,199, సూళ్లూరుపేట‌లో 57,276, గూడూరులో 46,381, స‌ర్వేప‌ల్లిలో 15,926, పోస్ట‌ల్ బ్యాలెట్ల‌లో 1057 మెజార్టీ వ‌చ్చింది. మొత్తం 2,28,376 ఓట్ల మెజార్టీతో దుర్గాప్ర‌సాద్ గెలుపొందారు. ప్ర‌స్తుతం తాము రెండో స్థానంలో నిలుస్తామంటున్న బీజేపీకి 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఆ పార్టీ అభ్య‌ర్థి బొమ్మి శ్రీ‌హ‌రిరావుకు మొత్తం 16,125 ఓట్లు ల‌భించాయి. అలాగే ఆ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన బ‌ల‌ప‌రిచిన‌ బీఎస్పీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ ద‌గ్గుమాటి శ్రీ‌హ‌రిరావుకు 20,971 ఓట్లు ద‌క్కాయి.

ప్ర‌స్తుతం బీజేపీని జ‌న‌సేన బ‌ల‌ప‌రుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉండ‌గా గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ, అలాగే జ‌న‌సేన స‌పోర్ట్ చేసిన బీఎస్పీ కంటే కాంగ్రెస్‌, నోటా ఎక్కువ ఓట్లు సాధించ‌డం విశేషం. గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థి చింతా మోహ‌న్‌కు 24,039 ఓట్లు, నోటాకు 25,781 ఓట్లు వ‌చ్చాయి. బీజేపీకి ఒక్క తిరుప‌తిలోనే 4,400, అలాగే బీఎస్పీకి 5,848 ఓట్లు రావ‌డం గ‌మ‌నార్హం. మిగిలిన చోట్ల ఆ పార్టీలు నామ‌మాత్ర‌మే అని అర్థం చేసుకోవ‌చ్చు. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం జ‌న‌సేన బ‌ల‌ప‌రుస్తున్న బీజేపీ అభ్య‌ర్థి ర‌త్న‌ప్ర‌భ సాధించే ఓట్ల‌పై ఆస‌క్తి నెల‌కుంది. అంతేకాదు, ఆ రెండు పార్టీల మ‌ధ్య పొత్తుపై కూడా ఓట్ల ప్ర‌భావం ఉంటుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఇక వైసీపీ సాధించిన భారీ మెజార్టీపై కూడా అధ్య‌య‌నం చేయాల్సిన మ‌రో అంశం ఉంది. ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీకి భారీ ఆధిక్య‌త ల‌భించ‌డం గ‌మ‌నార్హం. సూళ్లూరుపేట‌లో 57,276, గూడూరులో 46,381, స‌త్య‌వేడులో 42,196 ఓట్ల ఆధిక్య‌త ల‌భించింది. ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో వ‌చ్చిన మెజార్టీ అక్ష‌రాలా 1,45,853 ఓట్లు. తిరుప‌తి అసెంబ్లీలో టీడీపీకి మెజార్టీ పోగా, మిగిలిన మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో ద‌క్కిన ఓట్లు 85,044. ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క వ‌ర్గాల్లో వైసీపీ ఎంత బ‌లంగా ఉందో ఈ ఫ‌లితాన్ని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు.

ముఖ్యంగా బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ గ‌తంలో గూడూరు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వ‌హించారు. మంత్రిగా కూడా ప‌నిచేశారు. మంచి మ‌నిషిగా పేరుంది. ఆయ‌న‌కు సూళ్లూరుపేట‌లో బంధువ‌ర్గం కూడా ఎక్కువే. వీట‌న్నింటికి జ‌గ‌న్ హ‌వా తోడైంది. దీంతో ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల్లి దుర్గాప్ర‌సాద్‌కు భారీ మెజార్టీ ద‌క్కింద‌నే వాద‌న ఉంది. ప్ర‌స్తుతానికి వ‌స్తే బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ కుటుంబ స‌భ్యుల‌కు టికెట్ ఇవ్వ‌లేద‌నే అసంతృప్తి, పార్టీలోని అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు త‌మ‌కు లాభిస్తాయ‌ని టీడీపీ ఆశ‌లు పెట్టుకుంది.

అయితే వైసీపీ వాద‌న మ‌రోలా ఉంది. తాము ప్ర‌తిప‌క్షంలో ఉండ‌గా తిరుప‌తి నుంచి భారీ మెజార్టీతో గెలుపొందామ‌ని, ఇప్పుడు తాము ప్ర‌భుత్వంలో ఉండ‌డంతో పాటు 90 శాతం హామీలు నెర‌వేర్చ‌డం క‌లిసి వ‌స్తుంద‌ని అధికార పార్టీ నేత‌లు లెక్క లేస్తున్నారు. దీంతో భారీ మెజార్టీ సాధించే అవ‌కాశాలున్నాయని ఆ పార్టీ భావిస్తోంది. పైగా బ‌ల్లి దుర్గాప్ర‌సాద్‌రావు కుమారుడు క‌ల్యాణ్‌కు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చార‌ని, ఆ కుటుంబం హ్యాపీగా ప్ర‌చారంలో పాల్గొంటోంద‌ని, ఇక అసంతృప్తి అనే మాట‌కే తావు లేద‌ని వైసీపీ బ‌ల‌మైన వాద‌న తెర‌పైకి తెచ్చింది.

ఇదిలా ఉండ‌గా గ‌త రెండు నెల‌లుగా ఆ పార్టీ త‌న‌కు తానుగా, అలాగే ప‌లు స్వ‌తంత్ర సంస్థ‌ల‌తో స‌ర్వేలు చేయించింది. ఆ స‌ర్వేలో కామ‌న్‌గా తేలిన అంశం ఒక్క‌టే. వైసీపీకి 3.50 ల‌క్ష‌ల‌కు త‌క్కువ కాకుండా మెజార్టీ వ‌స్తుంది.

స‌ర్వేలో భాగంగా కొన్ని ముఖ్య‌మైన అంశాలు కూడా వెల్ల‌డ‌య్యాయి. గ‌తంలో మైన‌స్‌లో ఉన్న తిరుప‌తిలో, ప్ర‌స్తుతం వైసీపీ అనూహ్యంగా పుంజుకుంది. ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డితో పాటు ఆయ‌న త‌న‌యుడు అభిన‌య్‌రెడ్డి ప‌క్కా ప్ర‌ణాళిక‌తో క్షేత్ర‌స్థాయిలో పార్టీ బ‌లోపేతానికి చ‌ర్య‌లు చేప‌ట్టారు. దీంతో ఇటీవ‌ల కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో 22 ఏక‌గ్రీవాలు కాగా, ఒక చోట వాయిదా ప‌డ‌గా, మిగిలిన 27 డివిజ‌న్ల‌లో ఎన్నిక‌లు జ‌రిగాయి.

ఇందులో 26 చోట్ల వైసీపీ, కేవ‌లం ఒక్క డివిజ‌న్‌లో మాత్ర‌మే టీడీపీ గెలుపొందింది. డివిజ‌న్ల వారీగా వైసీపీ సాధించిన మెజార్టీ చూస్తే …దాదాపు 30 వేలు ఓట్లు ఆధిక్య‌త సాధించింది. ఈ నేప‌థ్యంలో త‌క్కువ‌లో త‌క్కువ అంటే ఈ ఎన్నిక‌ల్లో వైసీపీ 30 వేల మెజార్టీ సాధిస్తుంద‌ని స‌ర్వేలో తేలింది.

వైసీపీ స‌ర్వే ప్ర‌కారం శ్రీ‌కాళ‌హ‌స్తిలో పార్టీ బ‌లంగా ఉన్న‌ప్ప‌టికీ, నేత‌ల మ‌ధ్య అసంతృప్తి ఎక్కువ‌గా ఉంది. దీంతో రావాల్సిన మెజార్టీ కంటే త‌క్కువ వ‌స్తుంద‌ని తేలింది. ఈ నేప‌థ్యంలో నియోజ‌క వ‌ర్గంలో భారీ మెజార్టీ సాధించేందుకు వైసీపీ పెద్ద‌లంతా అక్క‌డ దృష్టి పెట్టారు. అలాగే గూడూరులో కూడా పార్టీలో స‌మ‌న్వ‌య లోపం స్ప‌ష్టంగా క‌నిపించింది. ఇక్క‌డ పార్టీ నేత‌ల మ‌ధ్య కుమ్ము లాట‌లు తీవ్ర‌స్థాయిలో ఉన్న‌ట్టుగా స‌ర్వేలో తేలింది. అయితే ప్ర‌జ‌ల్లో పార్టీపై ప్ర‌జాభిమానం బ‌లంగా ఉండ‌డం విశేషం.

వెంక‌ట‌గిరిలో భారీ మెజార్టీ సాధించేందుకు ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి గ‌ట్టి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా జ‌గ‌న్‌తో గ్యాప్ ఉంద‌న్న అపోహ‌ను తొల‌గించుకునేందుకైనా త‌న నియోజ‌క వ‌ర్గంలో భారీ మెజార్టీ సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఆయ‌న ఉన్నారు. దీంతో అక్క‌డ గ‌తంలో కూడా భారీ మెజార్టీ సాధించే అవ‌కాశాలున్నాయి. ఇక స‌త్య‌వేడు, సూళ్లూరుపేట‌, స‌ర్వేప‌ల్లి నియోజ‌క వ‌ర్గాల గురించి ఎలా ఢోకాలేదు. ఊహించ‌ని రీతిలో భారీ మెజార్టీ సాధించేందుకు క్షేత్ర‌స్థాయిలో అధికార పార్టీకి అవ‌కాశాలు సానుకూలంగా ఉన్నాయ‌ని స‌మాచారం.

మొత్తానికి భారీ మెజార్టీతో డాక్ట‌ర్ గురుమూర్తిని గెలిపించి, త‌మ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు గిప్ట్‌గా ఇవ్వాల‌ని తిరుప‌తి పార్ల‌మెంట్ ప‌రిధిలోని ఏడుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప‌ట్టుద‌ల‌తో ప‌ని చేస్తున్నారు. క‌ల‌ను సాకారం చేసుకునే ప్ర‌య‌త్నంలో, ఏ మాత్రం స‌ఫ‌ల‌మ‌వుతారో మ‌రికొన్ని రోజుల్లో వెలువ‌డే ఫ‌లిత‌మే జ‌వాబిస్తుంది. అంత వ‌ర‌కూ వేచి చూడ‌క త‌ప్ప‌దు.

సొదుం ర‌మ‌ణ‌