తిరుపతి లోక్‌సభ ఉప పోరును అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. విస్తృతంగా ప్రచారం చేసుకున్నాయి. ఇక ఓటింగ్ మాత్రమే మిగిలి ఉంది. లక్షలాది మంది ఓటర్లు తీర్పు ఇవ్వాల్సి ఉంది. తిరుపతి పార్లమెంట్ పరిధిలో 17 లక్షల మంది ఓటర్లున్నారు. అయితే అధికార, ప్రతిపక్ష పార్టీలనే తేడా లేకుండా అన్ని పార్టీలను ఓ భయం వెంటాడుతోంది.
తిరుపతి పార్లమెంట్ పరిధిలో మొత్తం 17.50 లక్షల ఓటర్లున్నారు. అయితే వీరిలో ఎంత మంది తమ ఓటు హక్కు వినియోగించు కోడానికి ముందుకొస్తారనే దానిపై రాజకీయ పక్షాల్లో ఆందోళన నెలకుంది. ఇటీవల వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలను స్థానిక నాయకులు సొంతంగా భావించడంతో ఓటర్లను రప్పించేందుకు వ్యక్తిగత శ్రద్ధ చూపారు. కానీ ఉప ఎన్నికల పరిస్థితి అలా కాదు.
మరీ ముఖ్యంగా ఓటర్లకు డబ్బు పంపిణీ చేయకపోవడం పోలింగ్‌పై భారీగా పడే ప్రమాదం ఉందని అభ్యర్థులతో పాటు అన్ని రాజకీయ పార్టీల నేతలు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎప్పుడూ ఇలా ఓటుకు నోటు ఇవ్వని పరిస్థితి లేదు.
తమ పేరు చెప్పు కుని నేతలు మాత్రం పదవులు, అధికారాన్ని అనుభవిస్తూ, ప్రజాధనాన్ని దోచేస్తూ… తమకు మాత్రం రిక్తహస్తాలు చూపడం ఏంటనే అసంతృప్తి సగటు ఓటర్‌లో బలంగా నెలకుంది. దీంతో ఓటు వేసేందుకు తామెందుకు రావాలనే ఆగ్రహం, అసంతృప్తి, ఆక్రోశం ఓటర్లలో వ్యక్తమవుతోందని రాజకీయ నేతలు పసిగట్టారు. మరీ ముఖ్యంగా “మాకేంటి?” అనే ప్రశ్నే ఓటర్లను పోలింగ్ కేంద్రానికి నడిపించడంపై ఆధారపడి ఉంది.
వైసీపీ మాత్రం తమ ప్రభుత్వం అన్ని రకాల సంక్షేమ పథకాల లబ్ధి కలిగిస్తోందని, అందువల్లే ఓటుకు నోటు ఇవ్వడం లేదని చెబుతోంది. మిగిలిన పార్టీలు మాత్రం అధికార పార్టీనే డబ్బు పంపిణీకి దూరంగా ఉన్నప్పుడు, తామెందుకు పంపిణీ చేయాలని ప్రశ్నిస్తున్నాయి. పైగా తమకు గెలుపు అవకాశాలే కనుచూపు మేరలో లేనప్పుడు, ఓటుకు నోటు పంపిణీ చేసి చేయి కాల్చుకోవడం ఎందుకని ప్రశ్నిస్తున్నాయి.
సాధారణంగా ఓటు వేసేందుకు ఆసక్తి చూపేది దిగువ, మధ్య తరగతి ప్రజలే. మరీ ముఖ్యంగా శ్రమ జీవులే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ వస్తున్నారు. ఓటు వేయకపోతే చచ్చిపోయిన వాళ్లతో సమానమనే భావన కూడా వారిని ఓటు వేసేందుకు ముందుకు నడిపిస్తోంది. ప్రజాస్వామ్యం, హక్కులు అంటూ ఉపన్యాసాలు ఇచ్చేవాళ్లు కేవలం మాటలకే పరిమితమవుతారనే విమర్శ బలంగా ఉంది. ఇది నిజమని అనేక సందర్భాల్లో రుజువవుతూ వస్తోంది.
ఈ నేపథ్యంలో తాజా తిరుపతి ఉప ఎన్నికపై ఓటుకు నోటు ఇవ్వని ప్రభావం బలంగా ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు కరోనా విజృంభిస్తుండడం కూడా ఓటింగ్‌పై పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇలా అన్నీ కలిసి ఓటింగ్‌పై భారీగా పడే ప్రమాదం ఉంటుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
సొదుం రమణ