రాధేశ్యామ్ సినిమాకు సంబంధించి ఇంకా డైలమా వీడలేదు. సినిమాకు సంబంధించి పెండింగ్ లో పడిన ఓ పాటను షూట్ చేద్దామా లేక పక్కన పడేద్దామా అనే సందిగ్దం యూనిట్ ను ఇంకా వెంటాడుతూనే ఉంది. ఆ డైలమాలోనే రేపట్నుంచి రాధేశ్యామ్ చివరి షెడ్యూల్ ప్రారంభం అవుతోంది.
రామోజీ ఫిలింసిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో రాధేశ్యామ్ ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. 10 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్ లో ప్రభాస్ పాల్గొంటాడు. కొన్ని సన్నివేశాల్ని ప్రభాస్ పై రీషూట్ చేయబోతున్నారు.
ఇక చివరి సాంగ్ ను రాధేశ్యామ్ లో పెట్టాలా వద్దా అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ ఆ పాట పెట్టాల్సి వస్తే, ఆఖరి షెడ్యూల్ మరికొన్ని రోజులు పెరుగుతుంది. దీనికితోడు పూజా హెగ్డే డేట్స్ కూడా సెట్ చేసుకోవాలి. ఈ పాటను పెట్టాలని ప్రభాస్ తో పాటు హిందీ డిస్ట్రిబ్యూటర్లు కోరుతున్నారు.
ఇటు నిర్మాతలకు మాత్రం ఇష్టంలేదు. ఇప్పటికే బాగా ఆలస్యమైన ఈ సినిమాకు వీలైనంత త్వరగా గుమ్మడికాయ కొట్టేయాలనేది వాళ్ల ఆలోచన. ఆదివారం లోపు దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటారు.
అటు ప్రభాస్ నటిస్తున్న మరో సినిమా ఆదిపురుష్ షూటింగ్ ఆగిపోయింది. ముంబయిలో కరోనా కేసులు భారీగా పెరగడంతో మహారాష్ట్ర ప్రభుత్వం పాక్షిక లాక్ డౌన్ విధించింది. ఈ క్రమంలో ఆదిపురుష్ సినిమా షూటింగ్ ను నిలిపేశారు.