శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై హిందూవాద పార్టీ శివసేన వీధికెక్కనుంది. ఈ మేరకు ఆ పార్టీ తన నిర్ణయాలను ప్రకటించింది. కేరళలో తమ పార్టీ పోరు స్టార్ట్ చేస్తామని ప్రకటించింది. 1వ తేదీ సోమవారం కేరళ బంద్ కు శివసేన పిలుపు ఇచ్చింది.
కేరళలో పార్టీల సంగతి ఎలా వున్నా, శివసేన పిలుపు అన్నది కేరళలో కాస్త హడావుడి సృష్టిస్తుంది. అసలే కేరళలో రాజకీయాల వెనుక మతాల కోణం కాస్త తొంగిచూస్తూ వుంటుంది. ఇలాంటి నేపథ్యంలో సుప్రీంతీర్పు ప్రభావం అక్కడి జనాలపైనా, రాజకీయాలపైనా వుంటుంది. ఇలాంటి నేపథ్యంలో శివసేన హడావుడికి ముందు అడుగువేస్తోంది. దీన్ని సహజంగా భాజపా, విశ్వ హిందూ పరిషత్, ఆరెస్సెస్ లాంటివి తెరవెనుక నుంచి మద్దతు ఇచ్చి ముందుకు నడిపించడం ఖాయం.
వాస్తవానికి కేరళలోని ఆస్తిక వాదులు సుప్రీంతీర్పును అంగీకరించరు. అయితే సుప్రీంతీర్పు కాబట్టి పైకి ఎవ్వరూ పెదవి విప్పకపోవచ్చు. అలాంటి వారందరికీ ఇప్పుడు శివసేన మార్గదర్శకత్వం వహించే అవకాశం వుంది. మతపరమైన విశ్వాసాల్లో కోర్టుల జోక్యం ఏ మేరకు వుండాలన్న దానిపై దేశంలో భిన్నాభిప్రాయాలు వున్నాయి. ఇది ముందు ముందు ఎలా టర్న్ తీసుకుంటుందో చూడాలి.